గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 25, 2020 , 00:31:14

మరి గంటల్లో..

మరి గంటల్లో..
  • -రెండు గంటల్లో ఫలితాలు వెల్లడి..
  • -అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే
  • -ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • -ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అభ్యర్థులు
  • -ఫలితాల అనంతరం క్యాంపునకు తరలనున్న కౌన్సిలర్లు
  • -27న రోజున చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ..


అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఘడియలు రానే వచ్చాయి.. రెండు రోజుల నిరీక్షణకు తెరపడనుంది.. మరికొన్ని గంటల్లో  విజేతలెవరో తేలనుంది.. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఉత్కంఠకు నేటితో ముగింపు పడనుంది. మధిర, సత్తుపల్లి, వైరాల్లో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ నేతృత్వంలో ఎన్నికల అధికారులు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఓట్ల లెక్కింపు మొదలు పెట్టిన రెండు గంటల్లోనే మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సత్తుపల్లి, మధిర, వైరాల్లో 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సూచనలు ఇచ్చారు.. మున్సిపల్‌ పీఠాలను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. ఇతర పార్టీల ప్రలోభాలకు లోనుకాకుండా ఫలితాలు వెలువడిన వెంటనే విజేతలను క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 27న చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరగనుండటంతో రాజకీయ నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల సంగ్రామం చివరి అంకానికి చేరుకుంది. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు జిల్లాల అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇరు జిల్లాల పోలీస్‌ యంత్రాంగం పటిష్టమైన భద్రతను చేపట్టింది. కౌంటింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. రెండంచల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి గతంలో రెండు దఫాలుగా శిక్షణ పూర్తి చేసి ఉన్నారు. ఉమ్మడి ఖమ్మంలోని సత్తుపల్లి, మధిర, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల పరిధిలోని కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోటీలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఐదు మున్సిపాలిటీలలోనూ 125 వార్డులు ఉన్నాయి. వీటిలో 7 వార్డులు ఏకగ్రీవం అయినందున మిగిలిన 118  వార్డులకు ఎన్నికలు నిర్వహించగా ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. దాదాపు ఉదయం 11 గంటలలోపు అన్ని మున్సిపాలిటీల్లో ఫలితాలు వెల్లడైయ్యే అవకాశాలున్నాయి. వార్డుల సంఖ్య ఆధారంగా టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా ఒక రౌండ్‌లో కొన్ని వార్డులను లెక్కిస్తారు. ఒకొక్క టేబుల్‌పై ఒకొక్క వార్డుకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ముందుగా బ్యాలెట్‌ బాక్సులోని ఓట్లను టేబుల్‌పై పోసి 25 చొప్పున ఏజెంట్ల సమక్షంలోనే కట్టలు కడతారు. కట్టలు కట్టడం పూర్తయిన తరువాత ఒకొక్క ఓటును తెరిచి అభ్యర్థు వారీగా విభజిస్తారు. ఆ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. ఎవరికైతే మెజార్టీ వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ తంతు మొత్తం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కిస్తారు. అయితే ఈ నెల 27వ తేదీన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక ఉండటంతో గెలిచిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు క్యాంపులకు తరలించే అవకాశం ఉంది.

రెండు గంటల్లోనే ఫలితాలు...

సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి జ్యోతి నిలయం హైస్కూల్‌లో కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఈ మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను ఇప్పటికే ఆరు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 17 వార్డులకు లెక్కింపు జరుగుతుంది. మూడు రౌండ్‌లలో లెక్కింపును పూర్తి చేస్తారు. మొదటి రౌండ్‌లో ఏడు వార్డులు, రెండో రౌండ్‌లో ఆరు వార్డులు, మూడో రౌండ్‌లో నాలుగు వార్డుల చొప్పున లెక్కింపు జరుగుతుంది.

మొత్తం 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒకొక్క టేబుల్‌కు ఆరుగురు సిబ్బంది చొప్పున ఏడు టేబుళ్లకు 42 మంది సిబ్బంది హాజరవుతారు. 17 వార్డులకు సంబంధించి 49 మంది అభ్యర్థుల భవితవ్యం రెండు గంటల్లో తేలిపోతుంది. వైరా మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు రైతు శిక్షణ కేంద్రంలో జరుగుతుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుండగా ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం అయినందున మిగిలిన 19 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక్కడ మూడు రౌండ్‌లలో లెక్కింపు పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మున్సిపాలిటీలో 73 మంది  అభ్యర్థుల భవితవ్యం ఏమిటో తేలిపోతుంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రెండు రౌండ్‌లలో లెక్కింపు పూర్తి అవుతుంది. ఒకొక్క రౌండ్‌కు 18 వార్డుల చొప్పున లెక్కింపు చేస్తారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకుగాను 24 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రెండు రౌండ్‌లలో లెక్కింపు పూర్తి అవుతుంది. 56 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. రంగంలో ఉన్న 156 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుంది. మధిర మండల పరిధిలోని ఖాజీపురం గ్రామంలో ఉన్న మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలనందు మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు మొత్తం 8 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్‌కు మూడు వార్డులు కేటాయించడం జరిగింది. ఒక్క ఏడో టేబుల్‌ మాత్రమే ఒక వార్డుని  కేటాయించి మిగిలిన టేబుల్స్‌కు 7 టేబుల్స్‌కు 21 వార్డులు కేటాయించడం జరిగింది. మొత్తం 20,021 ఓట్లు పోల్‌ కాగా వాటిలో 23 పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఉన్నాయి.

27న చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియ..

పురపాలక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల ఫలితాల అనంతరం చేపట్టాల్సిన విధి విధానాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌  విధి విధానాలను ప్రకటించింది. ప్రధానంగా ఫలితాల తరువాత ఆయా నగరపాలక, పురపాలికల్లో ఎక్కువ వార్డులు, డివిజన్లు గెలుచుకున్న పార్టీ మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల ఎన్నికల నిర్వాహణకు మార్గదర్శకాలు విడుదల చేశారు. వాటిలో ఎన్నికల ప్రక్రియ ఇలా ఉంటుంది. ఈనెల 27న మేయర్లు, ఛైర్మన్ల ఎన్నికల ప్రక్రియ జరగనుంది. అదే రోజు నూతన పాలక మండళ్ల తొలి సమావేశం నిర్వహిస్తారు. తొలి సమావేశంలోనే మేయర్లు, చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను చేపట్టనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికల చేపడతారు. అనంతరం పురపాలక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడు ముగిసి ప్రభుత్వ అభివృద్ధి కార్యకలాపాలు యధావిధిగా కొనసాగనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు కూడా మున్సిపాలిటీలు కనుక చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు.logo
>>>>>>