మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 25, 2020 , 00:29:08

నిర్లక్ష్యం వీడండి..

నిర్లక్ష్యం వీడండి..


శిరస్ర్తాణం ధరించండి..హెల్మెట్‌ వినియోగంపై పోలీస్‌ శాఖ దృష్టి


ఖమ్మం క్రైం : ప్రస్తుత కాలంలో హైస్పీడ్‌ వాహనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల రంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో ఇంజిన్‌ స్టార్ట్‌ చేసిన వెంటనే హైస్పీడ్‌ను అందుకుంటున్నాయి. ద్విచక్ర వాహనాలు వాడుతున్న వారిలో సగం మందికి పైగా యువతే ఉండటం విశేషం. హైస్పీడ్‌ వాహనాలతో రయ్‌మంటూ రోడ్లపై దూసుకుపోతూ అదుపు లేని వేగంతో ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు క్షతగాత్రులవుతున్నారు. అనేక ప్రమాదాల్లో హెల్మెట్‌ లేని కారణంగా తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. శరీరంలో ఎక్కడ గాయాలైనా మానే అవకాశముంది. కానీ తలకు గాయమైతే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒక్కోసారి విషమించి, ప్రాణాలను తీస్తుంది. అందుకే ఆలోచించి శిరస్ర్తాణం ధరించి సురక్షిత ప్రయాణం చేయండి..

మన భద్రత మనకు ముఖ్యం

పోలీసులు ఒత్తిడి తెస్తున్నారనో.. చలానా బాధ తప్పుతుందనో హెల్మెట్‌ వాడుతున్నారే తప్ప.. హెల్మెట్‌ ప్రయోజనాలు తెలిసి వాడేవారు చాలా తక్కువ మంది ఉన్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. హెల్మెట్‌ ధరించడం వలన రోడ్డు ప్రమాదాలకు గురైతే సురక్షితంగా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్‌ రద్దీ, ఇరుకు రోడ్లతో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి నివారణ కోసం హెల్మెట్‌ ధరించి వాహనాలు నడిపితే ప్రమాదాల్లో తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

హెల్మెట్‌ వినియోగంపై పోలీస్‌ శాఖ కృషి

ద్విచక్ర వాహనదారులు పూర్తి స్థాయిలో హెల్మెట్‌ వినియోగించేలా  పోలీస్‌ శాఖ దృష్టి సారించింది. ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశాలతో హెల్మెట్‌ ధరించి వాహనాలు నడిపేలా పటిష్ట చర్యలు చేపట్టారు.  ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలనే నిబంధనను కఠినతరం చేశారు. తొలుత పోలీస్‌ శాఖలోనే అధికారులు మార్పు తీసుకొచ్చారు. కమిషనర్‌ ఆదేశాలతో ఆయా సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులు తమ సిబ్బందికి ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్‌ వినియోగించేలా ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బందికి హెల్మెట్‌లు కూడా అందించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల నుంచి హెల్మెట్‌ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మం నగరంలో హెల్మెట్‌ వాడని ద్విచక్ర వాహనదారుడికి ఈ-చలాన్‌ ద్వారా పెనాల్టీలు ఇంటికి పంపిస్తున్నారు.

షెల్‌ ఎంతో కీలకం : హెల్మెట్‌ పై భాగంలోని షెల్‌ను కీలకంగా పరిగణిస్తారు. ఇది తయారు చేసిన పదార్థంపై హెల్మెట్‌ నాణ్యత ఆధారపడి ఉంటుంది.
అత్యంత నాణ్యమైన షెల్‌ తయారీకి ఫైబర్‌ ఉపయోగిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగి హెల్మెట్‌ (తల) నేలకు బలంగా తాకినా ఫైబర్‌ పగిలిపోయే అవకాశం తక్కువ. బరువు తక్కువగా ఉండేందుకు కొన్ని కంపెనీలు షెల్‌ తయారీకి ప్లాస్టిక్‌, ఫైబర్‌ మిశ్రమాన్ని వినియోగిస్తాయి. ఫైబర్‌ దాదాపు 70 శాతం ఉంటే ప్లాస్టిక్‌ 30 శాతం ఉంటుంది. ఈ పాలీ ఫైబర్‌ హెల్మెట్లు సురక్షితమే. పగలడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి.

పూర్తిగా ప్లాస్టిక్‌తో.. : ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ)తోనూ చేసిన షెల్స్‌ చాలా ప్రమాదకరం. వీటిని నేలకు వేసి కొడితే పగిలిపోతుంటాయి. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు తలను కాపాడలేవు.

హెల్మెట్‌ తప్పుకుండా ధరించాలి

ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌  ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనం నడిపే ప్రతీ పోలీస్‌ విధిగా హెల్మెట్‌ ధరించాలి. అప్పుడే మనం ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రజలకు చెప్పే ముందు మేమే ఆచరించి చూపిస్తున్నాం. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలి. మనిషి ప్రాణం చాలా విలువైనది. తలకు గాయమైతే ప్రాణానికే ముప్పు. అందుకే వివిధ ఉదాహరణల ద్వారా వాహనదారుల్లో అవగాహన, చైతన్యం కల్పిస్తున్నాం.
-రమోజీ రమేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ ఖమ్మం

పూర్తిగా ఉంటే మేలు..

- హెల్మెట్లలో రెండు రకాలుంటాయి. ఒకటి ఫుల్‌ మోడల్‌. రెండోది సగం హెల్మెట్‌. సగం హెల్మెట్‌ కొన్ని సందర్భాల్లో ఉపయోగం లేకుండా పోతుంది. ఫుల్‌ హెల్మెట్‌ పూర్తిగా సురక్షితం.
-ప్రమాదం జరిగినప్పుడు గడ్డం నేలకు తగిలినా దెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది ఊడిపోయే అవకాశం అంతగా ఉండదు. కాలుష్యం నుంచి రక్షణ పొందొచ్చు. సగం హెల్మెట్‌ ఈ రక్షణలు ఏవీ ఇవ్వలేదు.

హెల్మెట్‌లో కీలక భాగాలు

- కొత్త రకాలు ఎన్నో.. :వాహనాల్లో పలు మోడల్స్‌ ఆకర్షిస్తున్నట్లే హెల్మెట్లు సైతం అనేక ఆకృతుల్లో వస్తున్నాయి. ప్రత్యేకంగా యువతను ఆకట్టుకునేందుకు స్పోర్టీలుక్‌తో తయారు చేస్తున్నారు. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.
కళ్లకు రక్షణగా వైజర్‌
హెల్మెట్‌లో ముఖ్యమైన భాగం కళ్లకు రక్షణ కల్పించే వైజర్‌ (ఫైబర్‌తో చేసిన గ్లాస్‌). దీంతో తయారు చేస్తే సురక్షితంగా ఉంటాయి. కొనుగోలు చేసేటప్పుడే దీనిని పరిశీలించుకోవాలి. ఫైబర్‌తో చేసినవి మెలిపెట్టి తిప్పినా పగలవు. ప్లాస్టిక్‌తో చేసినవి పగిలిపోతుంటాయి. శిరస్ర్తాణం వాడేప్పుడు వైజర్‌పై గీతలు పడకుండా చూసుకుంటే మంచిది.

రక్షించే ప్యాడింగ్‌..: హెల్మెట్‌లో మరో ప్రాధాన్య భాగం ప్యాడింగ్‌ సెల్‌ అడుగుభాగంలో ధర్మకోల్‌ ప్యాడింగ్‌ చేస్తారు. ఇందులోనూ నాణ్యత కీలకమే. థర్మాకోల్‌ విషయంలో సహజంగా హెల్మెట్‌ తయారీదారులు రాజీ పడకపోయినా థర్మాకోల్‌ ఎలా ఉందో చూసుకుంటే మంచిది. ఖరీదైన వాహనాలపై ప్రయాణించే వారి వేగానికి అదుపు ఉండదు. ఇలాంటి వారు మరింత రక్షణ కవచాలు ఉపయోగించుకోవాలి. వీరి కోసం ప్రత్యేకంగా హెల్మెట్లు ఉన్నాయి. ధర రూ. 5 వేలకు పైగానే ఉంటుంది.

ఐఎస్‌ఐ.. డీఓటీ.. : ఖచ్చితంగా ఐఎస్‌ఐ మార్కు ఉండాలి. ఇప్పుడు యూరోపియన్‌ దేశాల నుంచి దిగుమతి అవుతున్న పదార్థాలతో చేసిన వాటికి డీఓటీ ముద్ర ఉంటోంది. ఇవి మరింత సురక్షితమైనవని అనుభవజ్ఞులు చెబుతున్నారు.  వాస్తవానికి ధర తక్కువగా ఉంటే చాలని కొందరు రోడ్లవెంట దొరికే వాటితో రాజీపడుతున్నారు. ప్రాణానికి భద్రత ఇచ్చే హెల్మెట్ల విషయంలో ఈ తరహా ధోరణి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెల్మెట్‌ కొనేటప్పుడు నాణ్యతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
   

హెల్మెట్‌ ధరించే పద్ధతిపై దృష్టి పెట్టాలి

మంచిది కొనడమే కాదు.. హెల్మెంట్‌ ధరించడంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అవగాహన ఉండాలి. హెల్మెట్‌ వెనుకనుంచి పెట్టుకోవాలి. తీసేప్పుడు ముందు నుంచి తీయాలి. పక్కభాగాలు దవడలకు ఆనుకుని ఉండాలి. తలకు తగ్గ పరిమాణంలోనే శిరస్ర్తాణం ఉండాలి. వదులుగా ఉంటే ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగపడకపోవచ్చు. పై భాగం కనుబొమ్మలపై నిలచే విధంగా ధరిస్తే మంచిది.logo
>>>>>>