శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Jan 25, 2020 , 00:23:31

ఓటు వజ్రాయుధం

ఓటు వజ్రాయుధం
  • -పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు
  • - సమర్థ పాలకులను ఎన్నుకోవటానికి ఓటు ఆయుధం
  • - ప్రజాప్రతినిధుల చేతిలో దేశ భవిష్యత్తు
  • - నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం


అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: దేశ సమగ్రత, అభివృద్ధి కోసం పాలకులను ఎన్నుకోవటానికి ఓటు పాత్ర కీలకం.. అది ఒక వజ్రాయుధం. భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. పాలకులను ఎన్నుకోవడమే ఓటు ముఖ్యఉద్దేశం. ఓటు హక్కును సుమా రు 20 నుంచి 30 శాతం ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ సద్వినియోగం చేసుకోవటం లేదు. ప్రధాన కారణం ఓటు ప్రాముఖ్యత, విలువ తెలియకపోవడం, అవగాహనలేక. నూరుశాతం పోలింగ్‌ సాధించే దిశగా ఎన్నికల సంఘం ఓటుప్రాముఖ్యత, నమోదుపై ఏటా జాతీ య ఓటర్ల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటుపై చైతన్యం తీసుకురావటం, యువతను ఓటు నమోదుకు ప్రోత్సాహించేందుకు దృష్టి సారిస్తున్నది. సమర్థ పాలకులను ఎన్నుకోవటానికి ఓటు ప్రజలకు ఆయుధం. ఎన్నికైన ప్రజాప్రతినిధులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశాభివృద్ధికి సేవాభావం ఉన్న ప్రజాప్రతినిధులను స్వేచ్ఛగా, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు ద్వారా ఎన్నుకోవాలన్నది ఎన్నికల సంఘం ముఖ్యఉద్దేశం.18ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించింది. 1950 జనవరి 25వ తేదీ ఎన్నికల సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోంది.

2011 నుంచి దినోత్సవం షురూ..

రాజకీయ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలనే లక్ష్యం తో యువతను భాగస్వామ్యులు చేయాలని ఓటు ప్రాముఖ్యతను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు ఆ రోజు గుర్తింపుకార్డులు అందించేందుకు ప్రణాళికను అమలు చేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 జనవరి 25వ తేదీన గుర్తించింది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది. 18 ఏళ్లు నిండిన యువతకు కొత్త ఓటు కల్పించడం, ఓటు సవరణ, ఓటు విలువ, ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.

ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఓటు ప్రాముఖ్యత, కొత్త ఓటు నమోదు, చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘంజనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించడంతో పాటు సత్కరిస్తుంది. ఓటు హ క్కు, ఓటును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయాలని ఎన్నికల సంఘం ప్రజలకు పిలుపునిస్తున్నది. ఈ సందర్భంగా పోలింగ్‌ బూత్‌ అధికారి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతం కోసం ప్రతిజ్ఞ చేయిస్తుంది.

ఓటు ఇలా పుట్టింది..

ఓటు హక్కు వినియోగం క్రీ.పూ.139 నుంచి ఉన్నట్లు చరిత్ర చెప్తోంది. పురాతన గ్రీకు దేశంలో పగిలిన మట్టి పాత్ర ముక్కలను ఓట్లుగా గుర్తించేవారని ప్రచారం. ప్రాచీన భారతదేశంలో క్రీ.శ 320లో తమిళనాడులో అరటి ఆకుల ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు చరిత్రను బట్టి తెలుస్తోంది. ఈ పద్ధతిని కూడా వోలూ వ్యవస్థ అని పిలిచేవారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా అమెరికాలో మొదటి సారి కాగితపు బ్యాలెట్లతో మూసాజ్‌ అనే సెట్స్‌లో ఓ చర్చ్‌ఫాస్టర్‌ ఎన్నిక కోసం వినియోగించింది. వివిధ దేశాల్లో రాజ్యాంగాల పరిపాలన విధానానికి అనుగుణంగా ఓటు హక్కుతోనే వార్డు సభ్యుల నుంచి రాష్ట్రపతి వరకు ఓటును వినియోగిస్తున్నాయి. భారతదేశంలో 1952 సార్వత్రిక వయోజన ఓటు హక్కు వినియోగంలోకి వచ్చింది. గతంలో బ్యాలెట్‌ద్వారా ఓటు హక్కును వినియోగంలో ఉండే ది. కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికత వల్ల ప్రస్తుతం ప్రధాన ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ యంత్రాల ద్వారా ఓటు వినియోగిస్తున్నారు.
 

దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది

ప్రజాస్వామ్య పటిష్టత ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతిలో దేశ భవిష్యత్తును నిర్ణయించేంది ఓటర్లే. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘం కీలకపాత్ర పోషిస్తున్నది. ఏ రాజకీయ పార్టీకి తలవంచక స్వతంత్య్రంగా తన విధులను నిర్వర్తిస్తుంది. కేంద్ర స్థాయిలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు విధులను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. ప్రజాస్వామ్యం మనుగడ ఓటరుపై ఆధారపడి ఉన్నందున ఈ రెండు సంఘాలు ఓటర్లను చైతన్యం చేస్తున్నాయి.

ఓటరుగా నమోదు ఇలా..

18 ఏళ్లు నిండిన యువతకు కొత్తగా ఓటు హక్కు కల్పించేందు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. కొత్తగా ఓటు హక్కు పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. ఓటు నమోదుకు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, తల్లిదండ్రుల ఆధారంగా జనన ధ్రువీకరణ, అఫిడవిట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ద్వారా పొందిన సంబంధిత పత్రాలను రెవెన్యూ అధికారులకు అందజేయాలి. అందజేసిన 15 రోజుల్లోగా పొందుపర్చిన వివరాల ఆధారంగా పరిశీలించిన తర్వాత రెవెన్యూ అధికారులు ఓటరు కార్డును లబ్ద్ధిదారులకు పోస్ట్‌ ద్వారా అందజేస్తారు. లేదా మీ సేవా కేంద్రాలనుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతం చేయండి

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ:  నేడు నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 9 గంటలకు కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌ నుంచి సీఈఆర్‌ క్లబ్‌ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో విధులు నిర్వహించే సిబ్బందితో ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తూ ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజస్వామ్యంపై విశ్వాసంతో, దేశ సంప్రదాయాలు, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, జాతి, మతం, కుల, వర్గ, భాషాభేదం లేకుండా ప్రలోభాలకు గురికాకుండా నీతి, నిజాయితీగా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకుంటానని’ ప్రతిజ్ఞ చేయించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఓటును వినియోగించుకోవాలి

భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 18 ఏళ్లు నిండిన యువతకు కొత్త ఓటు హక్కు కల్పించటానికి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తాం. ఓటు విలువ, ప్రాముఖ్యతను వివరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజాస్వామ్య పటిష్టత ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతిలో దేశ భవిష్యత్‌ను నిర్ణయించేంది ఓటర్లే. దేశంలో యువత బలం ఎక్కువగా ఉంది. కాబట్టి దేశ భవిష్యత్‌ దృష్ట్యా యువత ఓటు నమోదు చేసుకోవటంతో పాటు దానికి వినియోగించాలి.
-కర్నాటి వెంకటేశ్వర్లు,
జాయింట్‌ కలెక్టర్‌, కొత్తగూడెం


logo