మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 24, 2020 , 00:55:40

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం
  • -వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు రావొద్దు
  • -అభివృద్ధి పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
  • -పదో తరగతిలోఉత్తమ ఫలితాలు సాధించాలి
  • -పల్లె ప్రగతి పనులను మరింత వేగవంతం చేయాలి
  • -జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు
  • -అంశాల వారీగా సాగిన జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సాధారణ సమావేశం


మామిళ్లగూడెం, జనవరి 23: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగుతుందని జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సాధారణ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ లింగాల మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు విస్మరించిన రంగాలను వృద్ధి తీసుకొచ్చి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలు, సంక్షేమం, విద్యావైద్యం, సాగునీటి వనరులు, తాగునీటి సమస్యలు పరిష్కరించేందకు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం సాగుతుందన్నారు. జిల్లాలో రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, భవనాల నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ప్రణాళిక పనుల్లో మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న యాసంగి పంటలకు సరిపడ సాగునీటిని అందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో సభ్యులు సూచించిన విధంగా పనులు పూర్తి చేయాలన్నారు.
 

అంశాల వారీగా సాగిన సమావేశం

జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ముందుగా నిర్ణయించిన ఏజెండా అంశాల వారీగా పాలకవర్గం సభ్యులు సమీక్షించారు. ముందుగా పల్లె ప్రగతి ప్రణాళిక పనులపై సభలో సమీక్షించేందకు చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అధికారులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెండవ విడుతలో జిల్లా వ్యాప్తంగా 584 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనుల పురోగతిని అధికారులు వివరించారు. పల్లెప్రగతి ప్రణాళిక పనుల అమలు, పనుల పురోగతిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 4వ స్థానంలో ఉందని డీపీవో తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం 218 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లను కొనుగోలు చేశామన్నారు. మరో 268 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలుకు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ చొరవ, బ్యాంకుల సహకారంతో మరోవారం రోజుల్లో కొనుగోలు చేస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.87.41 కోట్లు నిధులు విడుదలయ్యాయన్నారు. దీంతో స్పందించిన సభ్యులు గ్రామాలలో నిర్మాణం చేపడుతున్న వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల పనులు ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయని వాటిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల పనులు, ఇంకుడు గుంతల పనుల ముందుకు సాగడం లేదని సభ్యులు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చొరవ తీసుకున్న చైర్మన్‌ సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. డీఈవో విద్యాశాఖలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. 

రానున్న  పదోతరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.  జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు, తాగునీటి సరఫరాపై ఆ శాఖ ఈఈలు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 584 గ్రామ పంచాయతీల్లోని గ్రామాలకు, ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందించాలని తెలిపారు.   రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పశువైద్యం సేవలు మెరుగు పడాలన్నారు. మత్స్యకారుల సంక్షమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో సీఈవో ప్రియాంక మాట్లాడుతూ.. అభివృద్ధి,  సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, జడ్పీ ఏవో అప్పారావు,  డీపీవో శ్రీనివాసరెడ్డి, డీఆర్‌డీవో ఇందుమతి, డీఈవో మదన్‌మోహన్‌, డీఎంఎండ్‌హెచ్‌వో డాక్టర్‌ మాలతి, జేడీఏ ఝాన్సీలక్ష్మీకుమారి, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమాధికారులు కస్తాల సత్యనారాయణ, హృషికేష్‌రెడ్డి, రమేష్‌, మైనింగ్‌ ఏడీ సంజయ్‌కుమార్‌, టీఎస్‌ఎండీసీపీవో ఎల్లయ్య, ఇరిగేషన్‌ ఈఈలు ఎం. వెంకటేశ్వర్లు, కే.వెంకటేశ్వర్లు, నరసింహారావు, విద్యాసాగర్‌, ఆర్‌ఎండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ రమేష్‌, పీఆర్‌ ఈఈ ప్రభాకర్‌,  జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. logo
>>>>>>