మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 24, 2020 , 00:55:40

‘మధిర’ బరిలో 67 మంది.. విజేతలెవరో మరి..

‘మధిర’ బరిలో 67 మంది.. విజేతలెవరో మరి..
  • -బ్యాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
  • -రేపు మధ్యాహ్నం కల్లా తేలనున్న రిజల్ట్‌
  • -ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ

మధిర, నమస్తే తెలంగాణ, జనవరి 23: మధిర మున్సిపాలిటీలో ఈ నెల 22న మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించి ఆయా బ్యాలెట్‌ బాక్సులను మధిర మండల పరిధిలోని ఖాజీపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించారు అధికారులు. అభ్యర్థుల భవితవ్యం ఆయా బ్యాలెట్‌ బాక్సుల్లో ఉంది. ఈ బ్యాలెట్‌ ఉంచిన స్ట్రాంగ్‌రూం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధిర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా 44 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. 22 వార్డులకు సంబంధించి మొత్తం ఓటర్లు 24,251 మంది ఉండగా 20,021 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తం 67 మంది బరిలో ఉన్నారు. వీరిలో గెలుపు అదృష్టం ఎవరిని వరించనున్నదోనని పోటీలో ఉన్న అభ్యర్థులతోపాటు పట్టణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం ఈ నెల 25న తేలనుంది. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పలు వార్డుల్లో ఢీ అండే ఢీ అనే విధంగా పోటీ నెలకొంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ ఎన్నికల ఫలితాలపై ఒక అంచనాకు రాలేక పోతున్నారు. ఎన్నికల ఫలితాలపై ఇటు రాజకీయ పార్టీల నాయకుల్లో, అటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.


logo
>>>>>>