సోమవారం 30 మార్చి 2020
Khammam - Jan 23, 2020 , 00:15:01

రఘునాథపాలెంను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలి

రఘునాథపాలెంను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలి
  • -గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమం చక్కటి అవకాశం
  • -పెండింగ్‌ పనులు పూర్తి చేసుకోవాలి
  • -ఫిబ్రవరి నెలాఖరులోగా కొత్త ఎంపీడీవో ఆఫీస్‌ సిద్ధం కావాలి
  • -మండల సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
  • -‘పాలెం’ ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన మద్దినేని రజిని

రఘునాథపాలెం, జనవరి22: పల్లెప్రగతి కార్యక్రమంలో రఘునాథపాలెం మండలాన్ని రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణాశాఖ మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం రోటరీనగర్‌లో గల రఘునాథపాలెం మండల పరిషత్‌ కార్యాలయం సమావేశ మందిరంలో మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పల్లెల్లో అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు అని చెప్పిన జాతిపిత మహాత్మాగాంధీ మాటలను బలంగా నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మొదటి విడతగా జరిగిన 30రోజుల కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందన్నారు. గ్రామాలు అన్ని రంగాల్లో పూర్తి అభివృద్ధిని సాధించాయనే సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలే స్వచ్ఛందంగా మేము సైతం అంటూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు పల్లెప్రగతి కార్యక్రమం చక్కటి వేధిక అన్నారు. 


రెండు విడతలుగా జరిగిన పల్లెప్రగతి పనుల్లో రఘునాథపాలెం మండలంలోని కొన్ని పంచాయతీలు వెనుకబడి ఉన్నాయని మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పల్లెప్రగతి కార్యక్రమం పట్ల ఎందుకు అయిష్టతను చూపుతున్నారో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుందన్నారు. చిన్న పంచాయతీలతో అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో 17పంచాయతీలు ఉన్న రఘునాథపాలేన్ని 37పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు. 20తండాలను జీపీలు చేస్తే అభివృద్ధి ఏమాత్రం జరగలేదని మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు.  ఇప్పుడు అభివృద్ధి చేసుకోలేకపోతే మీ గ్రామాలు ఎప్పటికీ వెనుకబడే ఉంటాయన్నారు. ముఖ్యంగా పల్లెప్రగతిలో భాగంగా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత తప్పక నిర్మాణం చేసుకోవాలని మంత్రి ఈజీఎస్‌ అధికారులను ఆదేశించారు. ఆ దిశగా గ్రామాల్లో ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని వందశాతం పూర్తి కావాలన్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు కొనలేదని కారణాలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కలెక్టర్‌తో మాట్లాడుతానన్నారు. ప్రతి గ్రామానికి వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్‌ యార్డు తప్పక ఉండాన్నారు. అభివృద్ధి కోసం కేటాయించిన నిధులతో పెండింగ్‌ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి ఆదేశించారు. ఏప్రిల్‌ నెలలో జరిగే మూడో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో రఘునాథపాలెం మండలాన్ని జిల్లాకే రోల్‌ మోడల్‌ చేయాలని మంత్రి అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.


ఫిబ్రవరిలో కార్యాలయం పూర్తికావాలి..

ఫిబ్రవరి నెలాఖరు కల్లా రఘునాథపాలెంలో నూతన ఎంపీడీవో ఆఫీస్‌ నిర్మాణం పూర్తికావాలని మంత్రి పంచాయతీ రాజ్‌ అధికారులను ఆదేశించారు. మళ్లీ వచ్చే సర్వసభ్య సమావేశం కొత్త మండల పరిషత్‌ కార్యాలయంలోనే జరుపుకోవాలని ఆదిశగా అన్ని రకాల హంగులతో కార్యాలయాన్ని సిద్ధం చేయాలన్నారు. సమస్యలపై కార్యాలయానికి వచ్చే వారికోసం వెయిటింగ్‌ హాల్‌, చల్లటి మంచినీటి సౌకర్యం, క్యాంటీన్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోనే కొత్త మండలంగా ఏర్పాటైన రఘునాథపాలెం మండల పరిషత్‌ కార్యాలయం ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. మధ్యాహ్నం భోజనం సైతం చేసి సమావేశాన్ని నిర్వహించుకోవాలన్నారు. సభకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారి ఈఈ గైర్హాజరుపై మంత్రి అజయ్‌కుమార్‌ మండిపడ్డారు. 


ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన రజిని

మండల కేంద్రం రఘునాథపాలెం ఎంపీటీసీగా మద్దినేని రజిని ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీవో శ్రీదేవి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి రజినీకి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. గ్రామాభివృద్ధిలో భాగస్వామురాలు కావాలని మంత్రి ఎంపీటీసీని ఆకాంక్షించారు. మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారానికి వచ్చిన పువ్వాడ అజయ్‌ కుమార్‌ను అధికారులు, ప్రజాప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, ఎంపీపీ భుక్యా గౌరి, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రమేష్‌, తహసీల్దార్‌ నర్సింహారావు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మందడపు నర్సింహారావు, ఖమ్మం ఏఎంసీ వైస చైర్మన్‌ మందడపు నర్సింహారావు, మాజీ జడ్పీటీసీలు కుర్రా భాస్కర్‌రావు, అజ్మీరా వీరూనాయక్‌, ఆత్మ చైర్మన్‌ బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్‌, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  
logo