సోమవారం 30 మార్చి 2020
Khammam - Jan 23, 2020 , 00:14:19

కనుల పండువగా విశ్వరూప సేవ..

కనుల పండువగా విశ్వరూప సేవ..సర్వదేవత అలంకారాన్ని వీక్షించి తరించిన భక్తజనం భద్రాద్రిలో ముగిసిన శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాలు


భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం సకల దేవతా అలంకారం (విశ్వరూప సేవ)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే బహుళ ద్వాదశి ఘడియల్లో ఉత్సవ మూర్తులన్నింటిని ఒకే చోట చేర్చి ఆరాధన నిర్వహించడం భద్రాద్రి రామాలయంలో ప్రత్యేకత. ఈ సమయంలో ఆలయంలోని 108 దేవతామూర్తులను ఒకే చోటకు చేర్చి ప్రత్యేక అలంకరణ చేయడంతో భద్రాద్రి కలియుగ వైకుంఠంగా మారింది. అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం అన్న రామదాసు కీర్తనలలో భాగంగా రాముడి విశ్వరూపునిగా భావించి ఆలయంలోని వరాహస్వామి, వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు తదితర ఉత్సవ మూర్తులతో పాటు ఆళ్వార్ల ఉత్సవ విగ్రహాలను సర్వదేవతా అలంకారంలో అలంకరించారు. గరుడ వాహనంపై రాములవారు ఆశీనులు అయ్యారు. సాయంకాలం సమయంలో రాముని సన్నిధిలో ఇతర ఉత్సవమూర్తులకు ఆరాధన నిర్వహించి కదంబం అనే ప్రత్యేక ప్రసాదాన్ని నివేదన చేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి దేవస్థానం ఈవో జీ నరసింహులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సాగిన ఈ అపురూప వేడుక భక్తులను మైమరపించింది. ఈ కార్యక్రమంలో ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సురేష్‌, ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్‌, డీఈ రవిందర్‌, సీసీ అనిల్‌, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాలు విశ్వరూప సేవతో విజయవంతంగా ముగిశాయి. ఈ మహోత్సవాలలో భాగంగా అతి ప్రధాన వేడుకలైన స్వామివారి తెప్పోత్సవం జనవరి5న జరగగా, జనవరి6న స్వామివారి ఉత్తర ద్వారదర్శనం వేడుక జరిగింది. వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాలలు ఘనంగా నిర్వహించడంతో ఈ వేడుకల విజయవంతానికి కృషి చేసిన అందరికి దేవస్థానం ఈవో కృతజ్ఞతలు తెలిపారు.  

logo