శనివారం 28 మార్చి 2020
Khammam - Jan 23, 2020 , 00:10:59

వైరాలో ఓటింగ్‌ ప్రశాంతం..

వైరాలో ఓటింగ్‌ ప్రశాంతం..
  • -ఓటింగ్‌ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే రాములునాయక్‌
  • -వైరాలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏసీపీ కే సత్యనారాయణ
  • -పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

వైరా, నమస్తే తెలంగాణ, జనవరి22: నూతనంగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. 20 వార్డులకు గాను 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వైరాలోని 3వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఏదునూరి పద్మజ ఏకగ్రీవమైన విషయం పాఠకులకు విధితమే. బుధవారం ఉదయం 7గంటల నుంచి మున్సిపాలిటీలోని 39 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ను ప్రారంభించారు. ఉదయాన్నే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చారు. మొత్తం 22009 మంది ఓటర్లు ఉన్నారు. బుధవారం ఉదయం 11గంటలకు 8422 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11గంటల వరకు 38.27% పోలింగ్‌ నమోదైంది. ఒంటిగంట వరకు 14320 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా, 65.06% పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 3గంటల వరకు 17370 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, పోలింగ్‌ శాతం 78.92% నమోదైంది. ఎన్నికలను ముగించే సమయం 5గంటలకు మొత్తం 19029 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


వైరా మున్సిపాలిటీలో 86.46% పోలింగ్‌ నమోదైంది. వైరా మున్సిపాలిటీలోని 16వ వార్డులో 91.23% అత్యధికంగా పోలింగ్‌ నమోదైంది. 6వ వార్డులో అత్యల్పంగా 60.58% పోలింగ్‌ నమోదైంది. 16వ వార్డులో మొత్తం 1128 ఓటర్లు ఉండగా, 1108మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6వ వార్డులో మొత్తం 1139మంది ఓటర్లు ఉండగా, కేవలం 690 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22009 మంది ఓటర్లకు గాను 19029 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల నుంచి పోలింగ్‌ ఊపందుకుంది. మధ్యాహ్నం 3గంటల వరకు అత్యధిక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. 19 వార్డుల్లోని 39 పోలింగ్‌ కేంద్రాల్లో చిన్న చిన్న ఘటనాలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. వైరాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను మున్సిపల్‌ ఎన్నికల స్పెషల్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ జయంతి, ఖమ్మం సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌, అడిషనల్‌ సీపీ పూజ తదితరులు పరిశీలించారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. 


ఓటు హక్కు వినియోగించుకున్న ఏసీపీ

మున్సిపాలిటీ ఎన్నికల్లో వైరా ఏసీపీ కే సత్యనారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైరాలోని 8వ వార్డులో ఉన్న బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 15వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఏసీపీ  కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వైరాలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైరా ఏసీపీ కే సత్యనారాయణ పర్యవేక్షణలో వైరా సీఐ జట్టి వసంతకుమార్‌ ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తును నిర్వహించారు. 
వైరా మున్సిపల్‌ ఎన్నికల వివరాలు

మొత్తం ఓట్లు-22009

పోలైన ఓట్లు-19029

పురుషులు -10563

పోలైన ఓట్లు -9160

మహిళలు -11444

పోలైన ఓట్లు-9867

ఇతరుల ఓట్లు-2

పోలైన ఓట్లు-2

ఓటింగ్‌ పర్సంటేజీ-86.46%

మొత్తం వార్డులు-20

ఎన్నికలు జరిగిన వార్డులు-19

ఏకగ్రీవమైన వార్డులు-1
logo