శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Jan 22, 2020 , 00:15:00

టీఆర్‌ఎస్‌దే విజయం

టీఆర్‌ఎస్‌దే విజయం
  • -సంక్షేమ పథకాల కొనసాగింపు టీఆర్‌ఎస్‌కే సాధ్యం
  • -కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలి
  • -వైరా అభివృద్ధికి మరో రూ.15కోట్లు మంజూరు చేయనున్న ప్రభుత్వం
  • -ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌

వైరా, నమస్తే తెలంగాణ, జనవరి 21: వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ స్పష్టం చేశారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో సహకరించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటర్లు ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సుమారు 9 లక్షల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని అన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016, వికలాంగులకు రూ.3016 పింఛన్‌ ఇస్తున్న ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా పేద యువతుల వివాహాలకు రూ.1,00,116 సాయంగా అందజేస్తున్నట్లు వివరించారు. అందువల్ల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో ప్రభుత్వం మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మౌలిక సదుపాయాలు కల్పించనుందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి మరో రూ.15 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను విజ్ఞప్తి చేశానన్నారు. అందుకు స్పందించిన సీఎం కేసీఆర్‌ ఆ నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఆ నిధులతో వైరా మున్సిపాలిటీని మోడల్‌ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులతో వైరా రిజర్వాయర్‌ వద్ద ట్యాంకుబండ్‌ నిర్మిస్తుందని చెప్పారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సహాయ సహకారాలతో వైరా నియోజకవర్గాన్ని, వైరా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. వైరాలోని 20 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఓటర్లు గెలిపించాలని కోరారు.

ఓటు హక్కును ఉపయోగించుకోవాలి

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుదే కీలకపాత్ర అన్నారు. ఓటు వజ్రాయుధం లాంటిదని చెప్పారు. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోతే ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించే ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబోరని అన్నారు. ఓటర్లే ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ నిర్ణేతలని వివరించారు. బుధవారం జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఫొటో ఓటర్‌ స్లిప్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని సూచించారు. అమూల్యమైన ఓటు హక్కును విచక్షణాయుతంగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, టీఆర్‌ఎస్‌ నాయకులు పోట్ల శ్రీను, నామా రాజేశ్‌, పాసంగులపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.logo