బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Jan 22, 2020 , 00:12:36

నేడే పురపోరు..

నేడే పురపోరు..
  • -ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
  • -పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
  • -నేటి సాయంత్రం వరకు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో మద్యం దుకాణాలు బంద్‌
  • -ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,63,737 మంది ఓటర్లు...
  • -పురుషుల కంటే 6,245 మంది మహిళా ఓటర్లు అధికం

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తైయ్యాయి. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపల్‌ పోలింగ్‌ బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ మేరకు రెండు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మరోవైపు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పట్టిష్ట భద్రతా చర్యలను చేపట్టారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో 144 సెక్షన్‌ విధించారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో 23, మధిరలో 22, వైరాలో 20 వార్డులకు నేడు పోలింగ్‌ జరుగనుంది. సత్తుపల్లిలో 6 వార్డులు, వైరాలో 1 వార్డు ఏకగ్రీవం కాగా మిగిలిన వార్డులలో పోలింగ్‌ జరగనుంది. మూడు మున్సిపాలిటీల పరిధిలో 79 సమస్యాత్మక, 5 హైపర్‌ సెన్సిటీవ్‌ పోలింగ్‌ కేంద్రాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లతో పాటు అన్ని పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌క్యాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణకుగాను 32 మంది మైక్రో అబ్జర్వర్లు, 156 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 314 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు.

ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూడు మున్సిపాలిటీల పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూసివేశారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోకి మొబైల్‌ ఫోన్లుకు అనుమతిలేదు. ప్రతి మున్సిపాలిటీలో మూడు ైస్టెకింగ్‌ పోలీసు ఫోర్స్‌, మరో మూడు  స్పెషల్‌ ైస్టెకింగ్‌ ఫోర్స్‌తో పాటు 20 గస్తీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి మున్సిపాలిటీలో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తణిఖీలు కొనసాగించారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో 144 సెక్షన్‌ను విధించారు. పోలింగ్‌కు హాజరయ్యే ఆయా అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల ఏజెంట్లు ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని వారికి సంబంధించిన పాసులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది.

ఉమ్మడి జిల్లాలో 1,63,737  ఓటర్లు...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో మొత్తం 1,63,737 మంది ఓటర్లు బుధవారం ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 78,743 మంది ఓటర్లు కాగా మహిళా ఓటర్లు 84,988 మంది, ఇతరులు ఆరుగురున్నారు. పోలింగ్‌ కోసం మధిరలో 44 పోలింగ్‌ స్టేషన్లు, సత్తుపల్లిలో 46, వైరాలో 41, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో 48, కొత్తగూడెంలో 85 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 125 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో ఏడు వార్డులు ఏకగ్రీవం కాగా 118 వార్డులకు పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 6,245 మంది అధికంగా ఉన్నారు.

ఈ గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు..

ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, సర్వీస్‌ గుర్తింపు కార్డులు, పాన్‌కార్డు, బ్యాంక్‌ పాసు పుస్తకాలు, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్‌కార్డు, హెల్త్‌ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌కార్డు, పెన్షన్‌ బుక్‌, డివిడెండ్‌ సర్టిఫికెట్‌, వృద్ధాప్య పింఛన్‌ ఆర్డర్‌, రేషన్‌కార్డు, స్వతంత్ర సమరయోధుల కార్డు, ఆయుధ లైసెన్స్‌, శారీరక వికలాంగుల సర్టిఫికెట్‌లలో ఏది ఉన్న ఓటు వేయవచ్చు. logo