శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Jan 22, 2020 , 00:10:33

మున్సిపల్‌ ఎన్నికలను.. శాంతియుతంగా నిర్వహిస్తాం

మున్సిపల్‌ ఎన్నికలను.. శాంతియుతంగా నిర్వహిస్తాం
  • -ముగ్గురు అడిషనల్‌ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు
  • -మొత్తం 600 మంది సిబ్బందితో ఎన్నికల బందోబస్తు
  • -సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై దృష్టిసారించాలి
  • -పోలీసు అధికారులకు సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సూచన
  • -సత్తుపల్లి, మధిర, వైరా పోలింగ్‌ కేంద్రాల సందర్శన

ఖమ్మం క్రైం/ మధిర, నమస్తే తెలంగాణ, జనవరి 21: శాంతియుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పోలిస్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సూచించారు. వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో బుధవారం జరగనున్న ఎన్నికల సందర్భంగా పోలీస్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో చేయవలసిన పనులను తెలియజేసేందుకు మధిర, సత్తుపల్లిల్లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని, అదే తీరును ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ప్రదర్శించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. అడిషనల్‌ డీసీపీ మురిళీధర్‌ మధిర మున్సిపాలిటీ, అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) పూజ వైరా మున్సిపాలిటీ, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ మాధవరావు సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎన్నికలు జరిగే సమయంలో ఏ చిన్న ఘటనా జరిగిన వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకునే విధంగా రూట్‌ మొబైల్‌ పార్టీలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ మరింత వేగవంతంగా స్పందించాలన్నారు. ముఖ్యంగా విధినిర్వహణలో ఉన్న సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ప్రజలు గుంపులుగుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలింగ్‌ సరళిలో భాగంగా అప్పగించిన బాధ్యతలను మాత్రమే సమయస్ఫూర్తితో సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనవసరమైన విషయాల్లో కల్పించుకోవద్దని ఆదేశించారు. అతి సమస్యాత్మక పోలింగ్‌ లోకేషన్లలో పొలింగ్‌ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితులను, పోలింగ్‌ సరళిని పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలకు పోలీసు సిబ్బంది చేరుకున్నారన్నారు. అనంతరం సత్తుపల్లిలోని జేవీఆర్‌ కాలేజీలోని పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో అతి సమస్యాత్మకమైన ఐదు పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను, 31 సాధారణ పోలింగ్‌ కేంద్రాలను కూడా గుర్తించామన్నారు. జిల్లాలో జరిగే మూడు మున్సిపాలిటీ ఎన్నికలకు 600 మందితో పట్టిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ముగ్గురు అడిషనల్‌ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 15 మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 150 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్‌, 240 మంది కానిస్టేబుల్‌, మహిళా కానిస్టేబుళ్లు, 80 మంది ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, 70 మంది హోంగార్డులు, మహిళా హోంగార్డులను ఎన్నికల బందోబస్తుకు నియమించామని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ మాధవరావు, వైరా ఏసీపీ సత్యనారాయణ, ఎస్‌బీ ఏసీపీ ప్రసన్నకుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ రామోజీ రమేశ్‌, ఖమ్మం రూరల్‌ ఏసీపీ వెంకటరెడ్డి, కల్లూరు ఏసీపీ వెంకటేశ్‌, సీఐలు సంపత్‌కుమార్‌, వేణుమాధవ్‌, కరుణాకర్‌, రామాకాంత్‌, సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.logo