బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Jan 21, 2020 , 01:09:31

మధిరలో గులాబీ జెండా

 మధిరలో గులాబీ  జెండా
  • -అపవిత్ర కూటమికి ఓటేస్తే మురిగిపోయినట్లే..
  • -మధిరను మరుపురాని పట్టణంగా తీర్చిదిద్దుదాం..
  • -కారు గుర్తుకు ఓటేస్తేనే బ్రహ్మాండమైన అభివృద్ధి
  • -రాష్ట్రంలో సుస్థిరపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌
  • -మధిర రోడ్‌షోలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, మాజీ ఎంపీ పొంగులేటి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల, ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు తదితరులు

మధిర, నమస్తేతెలంగాణ, జనవరి20: మధిర మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మధిరలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, టీఆర్‌ఎస్‌ పార్టీ వార్డుల అభ్యర్థులతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అపవిత్ర పొత్తులతో ఏర్పడిన కూటమికి ఓటేస్తే మురిగినట్లేనని పేర్కొన్నారు. కారుగుర్తుకు ఓటేస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని, మధురమైన మధిరను మరుపురాని మధిరగా తీర్చిదిద్దుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఖమ్మం నగరానికి ధీటుగా మధిర మున్సిపాలిటీని అభివృద్ధి విషయంలో తీర్చిదిద్దుకుందామని పేర్కొన్నారు. ఇప్పటికే మధిరకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి డివైడర్‌, సెంట్రల్‌లైటింగ్‌, సిమెంట్‌రోడ్లు, తదితర పలుఅభివృద్ధి పనులను పూర్తిచేసుకోవడం జరిగిందని, ఇంకా మిగిలి ఉన్న పనులను పూర్తిచేయాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు.

ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి చేసుకోగలం అనేది ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సారధ్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రతి గుమ్మానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, అటు వ్యవసాయానికి ఇటు వ్యాపార వర్గాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ను అందించడంతో రైతులు, వ్యాపారవర్గాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలను  ప్రజలు నమ్మవద్దని సూచించారు. మధిర ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, టీఆర్‌ఎస్‌ గెలిస్తే మధిరకు ప్రతిష్ట అవుతుందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు మదిలో ఉన్నాయని, వాటన్నింటినీ ఆచరణలో పెట్టాలంటే మధిర మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి మధిర గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..

కారుగుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించుకోవాలని సూచించారు. మధిర మున్సిపాలిటీలో కూటమికి ఓటు వేస్తే ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కకు లాభమని, కారుగుర్తుకు ఓటేస్తే మధిర ప్రజలకు లాభమని తెలిపారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌, మంతి కేటీఆర్‌ సారధ్యంలో ప్రజలకు సుస్థిరపాలన అందిస్తున్నారని, ఈ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వంద కోట్ల రూపాయల నిధులతో మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టి అందమైన మధిరగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మధిర మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో పోటీల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సామాజిక సేవాస్పృహ కలిగి ఉన్నవారేనని, అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే మధిర మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, మరింత అభివృద్ధి జరగాలంటే మధిర మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలని, అందుకోసం ప్రజలంతా ఆలోచించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మధిరలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు.

 ఈ కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర, ఆర్‌జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, డాక్టర్‌ కోట రాంబాబు, టీఆర్‌ఎస్‌ పార్టీ మధిర పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, రావూరి శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, అరిగె శ్రీను, మొండితోక సుధాకర్‌, మొండితోక జయాకర్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు, యన్నం కోటేశ్వరరావు, తమ్మారపు బ్రహ్మం, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ చావా రామకృష్ణ, 22 వార్డుల టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
logo