మంగళవారం 07 జూలై 2020
Khammam - Jan 21, 2020 , 01:08:31

మున్సిపల్‌ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్‌ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
  • -ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
  • -48 కేసుల్లో 206 మంది బైండోవర్‌
  • -సమావేశంలో కలెక్టర్‌ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌
  • -ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు
  • -మున్సిపల్‌ ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌, ఐటీడీఏ పీవో గౌతమ్‌

ఖమ్మం, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. రేపు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు జరగనున్న పోలింగ్‌ ఏర్పాట్లపై పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌తో కలిసి సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ఏర్పాట్ల వివరాలను ఆయన వివరించారు. సత్తుపల్లిలో 23, మధిరలో 22, వైరాలో 20 వార్డులకు ఈ నెల 22న పోలింగ్‌ జరుగనుందని చెప్పారు. సత్తుపల్లిలో 6 వార్డులు, మధిరలో 1 వార్డు ఏకగ్రీవ ఎన్నిక జరిగినందున మిగిలిన వార్డుల్లో పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో 79 సమస్యాత్మక, 5 హైపర్‌ సెన్సిటీవ్‌ పోలింగ్‌ కేంద్రాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లతో పాటు అన్ని పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌క్యాస్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణకుగాను 32 మంది మైక్రో అబ్జర్వర్లు, 156 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 156 సహాయ ప్రిసైడింగ్‌ అధికారులతో పాటు 314 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఈ నెల 20 సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార గడువు ముగిసిందని, మంగళ, బుధవారాల్లో బహిరంగ ప్రచార కార్యక్రమాలు నిషేధమన్నారు.

సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూడు మున్సిపాలిటీల పరిధిలోని మద్యం షాపులన్నింటిని మూసివేస్తామని చెప్పారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోకి మొబైల్‌ ఫోన్లు అనుమతించబడవని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 17 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని తమతో పోలింగ్‌ కేంద్రానికి తీసుకువెళ్లాలని కలెక్టర్‌ సూచించారు. సత్తుపల్లిలో జ్యోతినిలయం పాఠశాల, మధిరలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, వైరాలో వెటర్నరీ హస్పిటల్‌లో డిస్ట్రీబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ.. మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో మూడు ైస్టెకింగ్‌ పోలీసు ఫోర్స్‌, మరో మూడు  స్పెషల్‌ ైస్టెకింగ్‌ ఫోర్స్‌తో పాటు 20 గస్తీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తణీఖీలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు  48 కేసుల్లో 206 మందిని బైండోవర్‌ చేసినట్లు పోలీసు కమిషనర్‌ తెలిపారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు  సంబంధించి ఇప్పటి వరకు 5 కేసులను నమోదు చేసినట్లు ఆయన వివరించారు. పోలీసు బందోబస్తుతో పాటు మొబైల్‌ టీమ్స్‌ నిరంతరాయంగా పనిచేస్తున్నాయని ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్‌ కమిషనర్‌ వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.logo