శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Jan 21, 2020 , 01:07:05

ఎన్నికలకు భారీ బందోబస్తు..

ఎన్నికలకు భారీ బందోబస్తు..
  • - సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీసు సిబ్బంది
  • - పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
  • - 115 ఎన్నికల సెంటర్లలో పటిష్ట భద్రత : సీపీ ఇక్బాల్‌

ఖమ్మం క్రైం : జిల్లాలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అవసరమైన భారీ బందోబస్తున్న పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది. జిల్లాలోని వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల పోలింగ్‌కు అధికారులు పట్టిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సారధ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. బుధవారం ఎన్నికల నిర్వహణకు చేపట్టనున్న చర్యల గురించి పోలీస్‌ సిబ్బందికి సీపీ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఆదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ఒకొక్క మున్సిపాలిటీకి ఒక అడిషనల్‌ డీసీపీ చొప్పున ముగ్గురు అడిషనల్‌ డీసీపీల ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 115 పోలింగ్‌ కేంద్రాల్లో ఐదుగురు ఏసీపీలు, 600 మంది సివిల్‌, ఏఆర్‌ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక వార్డులను గుర్తించి అల్లర్లకు పాల్పడే, నేరచరిత్ర ఉన్న వ్యక్తులు, రౌడీషీటర్ల జాబితాను తయారు చేసి బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. అనుమానం ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ పలు సందర్భాలలో పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 115 పోలింగ్‌ కేంద్రాల్లో 39 లోకేషన్లు, 22 క్రిటికల్‌ పోలింగ్‌, రెండు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. స్టాటిక్‌ సర్వే లైన్స్‌ టీమ్‌ బృందాలు, ఫ్లైయింగ్‌ స్కాడ్స్‌, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ టీమ్స్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లను అందుబాటులో ఉంచారు. ఎన్నికల సంఘం విధించిన నియమ నిబంధనల ప్రకారం చర్యలు చేపడుతున్నారు. ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న లైసెన్స్‌ తుపాకులను పోలీసుస్టేషన్లలో డిపాజిట్‌ చేయించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో 21 మద్యం బాటిల్స్‌లను సీజ్‌ చేశారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి సుమారు వంద మీటర్ల దూరం వరకు గుంపులుగుంపులుగా ఉండకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలింగ్‌ చిట్టీలను పరిశీలించి తరువాతనే కేంద్రాల్లోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికిప్పుడు పర్యవేక్షించే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన సిబ్బంది వంద, రెండు వందల లైన్లను పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో పోలీస్‌ సిబ్బంది వదిలి వెళ్లకుండా సీపీ ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ : వైరా ఏసీపీ

వైరా, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నిక సందర్భంగా వైరాలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల రోజు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఏసీపీ కే సత్యనారాయణ తెలిపారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సీఐ జట్టి వసంతకుమార్‌తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే బందోబస్తు గురించి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నామన్నారు. పోలింగ్‌ బందోబస్తు కోసం ఒక సీఐ, నలుగురు ఎస్సైలు, 11 మంది ఏఎస్సైలు, 11 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 60 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు, 23 మంది హోంగార్డ్‌లు ఎన్నికల విధుల్లో ఉంటారన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 6 రూట్‌ మొబైల్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. 9 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు.  కార్యక్రమంలో వైరా సీఐ జట్టి వసంతకుమార్‌, వైరా, కొణిజర్ల, చింతకాని, తల్లాడ ఎస్సైలు వీ సురేశ్‌, మొగిలి, ఉమ, తిరుపతిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo