మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 21, 2020 , 01:01:46

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుమున్సిపల్‌ ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌


వైరా, నమస్తే తెలంగాణ : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌, భద్రాచలం ఐటీడీఏ పీవో వీడీ గౌతమ్‌ హెచ్చరించారు. వైరా మున్సిపాలిటీలో జరుగుతున్న ఇంటింటికి పోలింగ్‌ స్లిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడారు. బీఎల్‌వోలు తమ వార్డుల్లో ఇంటింటికి తిరిగి పోలింగ్‌ స్టేషన్‌ల వారీగా గుర్తించి పోలింగ్‌ స్లిప్‌లను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. స్లిప్‌ల పంపిణీ సమయంలో సంబంధిత ఓటర్లు లేకపోతే దానికి సంబంధించిన కారణాలను జాబితాలో తప్పకుండా పొందుపర్చాలన్నారు. ఇంటి వద్ద ఓటర్లు లేని స్లిప్‌లను భద్రంగా ఉంచాలని సూచించారు. పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఓటర్లు అక్కడి నుంచి బదిలీ అయినా, మృతి చెందినా, ఓటర్‌ లిస్ట్‌లో డబుల్‌ పేర్లు పొందుపర్చినా వాటన్నింటిని తొలగించాలని అధికారులు సూచించారు. ఓటర్‌ స్లిప్‌ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఎస్‌జేసీ, ఎంసీసీ, మోడల్‌ కోడ్‌ బృందాలు పార్టీల వారీగా ఎన్ని కేసులు నమోదు చేశాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా సరే కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి తనిఖీలు చేయాలని సూచించారు.

గోడల మీద పార్టీల వాల్‌ రైటింగ్‌లు, అభ్యర్థులకు సంబంధించిన స్టిక్కర్లన్నింటినీ తొలగించాలని వైరా మున్సిపాల్‌ కమిషనర్‌ విజయానంద్‌ను ఆదేశించారు. అనంతరం వైరాలోని పలు ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టులను ఆయన తనిఖీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విజయానంద్‌, వైరా డిప్యూటీ తహసీల్దార్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పంపిణీకి సిద్ధంగా పోలింగ్‌ సామగ్రి

వైరా, నమస్తే తెలంగాణ : ఈ నెల 22వ తేదీన జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికలకు అవసరమైన పోలింగ్‌ సామగ్రి పంపిణీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. వైరాలోని రైతు శిక్షణా కేంద్రంలో మంగళవారం సాయంత్రం పోలింగ్‌ సామగ్రిని అధికారులు పంపిణీ చేయనున్నారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీకి ప్రత్యేకంగా అధికారులు ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల ద్వారా ఆయా పోలింగ్‌ స్టేషన్‌ల ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందజేయనున్నారు. వైరా మున్సిపాలిటీలో మొత్తం 41 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా 21 వార్డులు ఉండగా, 3వ వార్డు సభ్యురాలిగా ఏదునూరి పద్మజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 19వ వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగతున్నాయి. ఈ 19 వార్డులకు సంబంధించి 39 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 53 మంది పీవోలు, 53 మంది ఏపీవోలు, 153 మంది ఓపీవోలు, ఏడుగురు రిటర్నింగ్‌ అధికారులు, ఏడుగురు సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ఆరుగురు జోనల్‌ అధికారులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. మొత్తం 167 బ్యాలెట్‌ బాక్సులను ఎన్నికలకు వాడనున్నారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీ ఏర్పాట్లను మున్సిపాలిటీ కమిషనర్‌ విజయానంద్‌ పర్యవేక్షిస్తున్నారు.


logo
>>>>>>