బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Jan 20, 2020 , 02:16:05

ఓపీవోలకు షోకాజ్‌ నోటీసులివ్వండి

ఓపీవోలకు షోకాజ్‌ నోటీసులివ్వండి


వైరా, నమస్తే తెలంగాణ, జనవరి 19 : శిక్షణ తరగతులకు గైర్హాజరైన 45మంది ఆదర్శ్‌ పోలింగ్‌ ఆఫీసర్లు(ఓపీవో)లకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ వైరా మున్సిపాల్‌ కమిషనర్‌ విజయానంద్‌ను ఆదేశించారు. షోకాజ్‌ నోటీసులు అందుకున్న ఓపీవోలు ఇచ్చే సంజాయిషీని బట్టి ఒకరోజు వేతనాన్ని కట్‌ చేయాలని సంబంధిత అధికారుకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం జోనల్‌ అధికారులు, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలకు శిక్షణా తరగతులు నిర్వహించిన తరగతులను కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించాల్సిన 45 మంది ఓపీవోలు గైర్హాజరు కావడంతో కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పై విధంగా ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్‌ సమయంలో టెండర్‌ ఓటు వేస్తే అక్కడ విధులు నిర్వహించే పోలింగ్‌ అధికారులు, సిబ్బంది మొత్తాన్ని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. గతంలో మాదిరిగా పోలింగ్‌ విధుల్లో ఉన్న ఒక్కరినో, ఇద్దరినో కాకుండా పీవో, ఏపీవో సహా అందరిని సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల మాదిరిగానే మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో కీలక ఘట్టం ఎన్నికలు అని స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల్లో సైనికులు మాదిరిగానే పోలింగ్‌ అధికారులు, సిబ్బంది ఎలాంటి నిబంధనలకు తావు లేకుండా పకడ్భందీగా ఎన్నికల విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.logo
>>>>>>