గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 20, 2020 , 02:13:24

టీఆర్‌ఎస్‌కు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మద్దతు

టీఆర్‌ఎస్‌కు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మద్దతు
  • -ఉమ్మడి నాలుగు జిల్లాల్లో 9మున్సిపాలిటీల పరిధిలో దాదాపు లక్ష మంది ఓటర్లు
  • -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో భేటీ
  • -లిఖిత పూర్వకంగా వినోద్‌కు మద్దతు లేఖ అందజేత
  • -సింగరేణి ఉద్యోగులను అభినందించిన వినోద్‌కుమార్‌

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కేంద్ర సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ప్రతినబూనారు. టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అభ్యర్థుల విజయం కోసం సొంత ఖర్చులతో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను హైద్రాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్నట్లు ఆ సంఘం కేంద్ర కమిటీ లిఖితపూర్వకంగా లేఖను అందజేశారు. సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల బోయినపల్లి వినోద్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ ఉద్యోగ సంఘం కేంద్ర కమిటీ నాయకులను వినోద్‌కుమార్‌ అభినందించారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలో సింగరేణి ఎస్సీ, ఎస్టీలకు చెందిన 16వేల మంది ఉద్యోగులు, కుటుంబ సభ్యుల ఓట్లు కలిపి దాదాపుగా ఒక లక్ష వరకు ఉంటాయని, ఈ ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే పోల్‌ అవుతాయని ఆ సంఘం నాయకులు తెలిపారు.

ఓట్లు అన్ని టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులకే వేసి వారి గెలుపులో కీలకపాత్ర పోషిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గెలవడం ద్వారానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు మద్దతు తెలిపిన వారిమి అవుతామని వారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు సుఖసంతోషంగా ఉంటున్నారన్నారు. రైతులు, కూలీలు, ఉద్యోగులు, కార్మికులు వేతనాలు పెంచుకుని ఆనందంగా ఉండటం వెనుక కేసీఆర్‌ పాత్ర ఎంతో దాగివుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలలోను ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని, ఈ నెల 22వ తేదీన జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లోను అన్ని స్థానాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుస్తారని వారు దీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని అభివృద్ది, సంక్షేమ పథకాలను కేసీఆర్‌ అమలు చేయడం తెలంగాణ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు వినోద్‌కుమార్‌కు శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో సమావేశమైన వారిలో ఆ సంఘం కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోళ్ల రమేష్‌, ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బాణోత్‌ కర్ణ, నాయకులు మల్లేష్‌, వెంకటేశ్వర్లు, రాజేశ్వరరావు, పద్మారావు, రమేష్‌కుమార్‌ తదితరులున్నారు.
logo
>>>>>>