శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Jan 19, 2020 , 00:29:55

గడపగడపకూ టీఆర్‌ఎస్‌..

గడపగడపకూ టీఆర్‌ఎస్‌..ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీ అభ్యర్థులు


పురపోరులో కారు జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోంది.. టీఆర్‌ఎస్‌ ప్రచార హోరులో కూటమి  ఖల్లాస్‌ అవుతోంది. అధికార పార్టీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.. అంతర్గత కుమ్ములాటలతో కూటమి అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ప్రచారానికి వెళ్లిన వారికి జనం నుంచి స్పందన కనిపించక పోవడంతో నైరాశ్యంలో ఉన్నారు. గులాబీ దండు ఇంటింటికీ వెళ్లి గత ఐదేండ్లలో రాష్ర్టాభివృద్ధికి చేపట్టిన         కార్యక్రమాలతో పాటు ప్రధానంగా మున్సిపాలిటీల అభివృద్ధిని ప్రజలకు       వివరిస్తున్నారు.  శనివారం వైరాలో  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే రాములునాయక్‌, సత్తుపల్లిలో ఎంపీ నామా నాగేశ్వరరావు,  ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మధిరలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, సీడీసీ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి మున్సిపాలిటీలను గెలిపించి మంత్రి కేటీఆర్‌కు బహుమతిగా     ఇద్దామని పిలుపునిచ్చారు.
- ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరో ఒక్క రోజు మాత్రమే ప్రచారానికి సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రజల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, ప్రధానంగా పురపాలకాల అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించిన నిధులను ప్రజలకు ప్రజలకు వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వార్డుల్లో ప్రతి గడపగడపకు తిరిగి ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రజల్లోకి వెళ్లలేక గ్లోబల్‌ ప్రచారాలకు తెరలేపుతున్నారు. ఇప్పటి వరకు ఆయా పురపాలకాలలో ప్రతి పక్ష పార్టీలు వ్యవహరించిన తీరును ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించడంతో ముఖం చాటేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకోసం శనివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వైరా మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు. వైరా మున్సిపాలిటీలో 20కి 20 వార్డులు గెలుచుకుని టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని వైరాలో టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే అభివృద్ధి ముందుకు పోతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో వైరా శాసనసభ్యుడు రాములు నాయక్‌ మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని అభివృద్ది, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో అభ్యర్థుల గెలుపుకోసం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు,  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిరలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు మున్సిపాలిటీలో స్థానిక శాసనసభ్యురాలు బాణోత్‌ హరిప్రియా నాయక్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్యలు ప్రచారాన్ని నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రచారం నిర్వహించారు.

ఏ ఎన్నికైనా గెలుపు కారుదే


సత్తుపల్లి ఎన్నికల ప్రచారంలో ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర
ఏ ఎన్నికైనాగెలుపు కారుదేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.45వేల కోట్లతో బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని కొనియాడారు. సత్తుపల్లి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడుతూ.. మాయమాటలు చెప్పే పార్టీలను నమ్మొద్దన్నారు. రాష్ట్రం, జిల్లా మునిసిపాలిటీలో ప్రస్తుతం అభివృద్ధి ఎలా ఉందో ఓటర్లు గమనించాలని కోరారు. జిల్లా కేంద్రమైన ఖమ్మానికి దీటుగా సత్తుపల్లిని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నామని, ఇప్పటికే రూ.50కోట్లతో పట్టణంలో వివిధ రకాల అభివృద్ధి పనులు నడుస్తున్నాయన్నారు.  నాయకపోడు గిరిజనులతో జాతీయ పార్టీ నాయకులు పోడు భూములకు పట్టాలిప్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ్యుల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి వారి సమస్యలను అతిత్వరలో పరిష్కరిస్తామని ప్రకటన చేశారని గుర్తు చేశారు. 23 వార్డుల్లో పోటీచేయలేని ప్రతిపక్షాల వారు చైర్మన్‌ ఎలా అవుతారు... కనీసం వార్డుల్లో అభ్యర్థ్ధులు లేని వారు సైతం పోటీలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. రానున్న 20 రోజుల్లో మట్టి రోడ్లు లేని సత్తుపల్లిని చూస్తారని, ఇప్పటికే రూ.50కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం సాగుతుందని, మరో రూ.30కోట్లతో సైడ్‌డ్రైన్ల ఏర్పాటు ప్రారంభిస్తామన్నారు. సత్తుపల్లిలోని 23 వార్డుల్లో ఇప్పటికే ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 17 వార్డుల్లో ప్రతిపక్షాల అభ్యర్థులు నామమాత్రపు పోటీగానే మిగులుతారని, మున్సిపాలిటీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కారు గుర్తుకు ఓటేసి ప్రతి వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ చేకూర్చాలని ఓటర్లను అభ్యర్ధించారు.

బొగ్గుట్టలో దూసుకుపోతున్న కారు...

గడపగడపకూ తిరుగుతున్న

ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌,
జెడ్పీ చైర్మన్‌, తాతా మధు
ఇల్లెందు (బొగ్గుట్ట) పురపాలక ఎన్నికల ప్రచారంలో కారు దూసుకుపోతుంది. టీఆర్‌ఎస్‌ ప్రచార హోరులో కూటమి అభ్యర్థులు ఖల్లాస్‌ అవుతున్నారు. పదవీ వ్యామోహంతో ప్రజాభివృద్ధిని మరిచిన నాయకులకు గుణపాఠం చెప్పేందుకు పోరుగడ్డ ఇల్లెందు బిడ్డలు సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారానికి గడపగడపకు తిరుగుతున్న ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌, జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, ఇల్లెందు పురపాలక ఎన్నికల ఇన్‌చార్జ్‌ తాతామధుకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.  ఆయా వార్డుల్లో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ఇల్లెందు మున్సిపాలిటీ మరింత అభివృద్ధ్ది జరుగుతుంద

న్నారు. ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగుర వేస్తే స్వయానా మున్సిపల్‌ శాఖమంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకుంటారన్నారు. కేటీఆర్‌ దత్తత తీసుకుంటే ఇల్లెందు మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందనుందో అందరూ ఊహించాలన్నారు. విద్య, వైద్యంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు ఇల్లెందుకు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. సింగరేణి సంస్ధకు జన్మనిచ్చిన ఇల్లెందుకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. కాని ఇప్పటి వరకు ఇల్లెందులో ప్రభుత్వ ఐటీఐ, పాల్‌టెక్నిక్‌, బీఈడీ, ఇంజనీరింగ్‌ కళాశాలలు లేకపోవడం దారుణమన్నారు. అదే విధంగా బస్‌డిపో, రైల్వే సర్వీసుల పునరుద్ధరణ నోచుకోలేకపోతుందన్నారు. ఇవన్నీ జరుగాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు. 

కొత్తగూడెం పురపాలకం టీఆర్‌ఎస్‌దే...

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొత్తగూడెం పురపాలకం మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు కొత్తగూడెం పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో మున్సిపాలీటీల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు వదిలేసిన సమస్యలను సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రాన్ని ఖమ్మం జిల్లా కేంద్రానికి దీటుగా అభివృద్ధి చెందాలంటే ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కొత్తగూడెం ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు కొనసాగిస్తుందని మరిన్ని నిధులు రావాలంటే టీఆర్‌ఎస్‌ గెలుపు అనివార్యమన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి మరింత చేయూతనిచ్చేందుకు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో అన్ని వార్డులను కైవసం చేసుకొని ప్రతి పక్షాలకు బుద్ధి చెప్పాలన్నారు.

అన్ని మున్సిపాలిటీల్లో

టీఆర్‌ఎస్‌దే విజయం...

 మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల ఆశీస్సులతో అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధిస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం వైరా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్‌షో, సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రజల అశీస్సులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పుష్కలంగా ఉన్నాయని, ఇది ప్రజల కోసం పనిచేస్తున్న  ప్రభుత్వ కాబట్టే ఈ పురపాలక ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలలో మెజార్టీ వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుని విజయకేతనం ఎగరవేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు పురపాలకాలలో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికార దాహంతో అపవిత్ర పొత్తులను పెట్టుకుని ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కేవలం పురపాలక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన వారికి అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రతి ప్రక్ష పార్టీలు వారి ప్రచారంలో కూటమి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని చిలకపలుకులు పలుకుతున్నారని వివరించారు.  వారు నిధులు ఏ రాష్ట్రం నుంచి తెస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్‌ చేశారు. జిల్లాలోని 60 ఏండ్లు పాలించిన ప్రతిపక్ష పార్టీలు ఏనాడు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే జిల్లాలో అభివృద్ధి ప్రజల ముందు కనిపిస్తుందన్నారు.  నేడు పల్లెల్లో ప్రగతి ప్రణాళిక పనులతో పల్లెలు అభివృద్ధితో కళకళలాడుతున్నాయని చెప్పారు. ఇదే పద్ధతిలో ఎన్నికలు ముగిసిన వెంటనే పురపాలకలల్లోనూ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికను చేపట్టిందని, ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రచారంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు బొర్రా రాజశేఖర్‌, స్థానిక జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మధిర పురపాలక అభివృద్ధి

టీఆర్‌ఎస్‌కే సాధ్యం..

 ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు,
విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల
మధిర పురపాలక సంస్థ అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావులు అన్నారు. ఇప్పటికే మధిరలో కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని, వాటిని మరింత ముందుకు తీసుకుపోవాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు అవసరం ఉందని అన్నారు. దీనిని ప్రజలు గుర్తించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 
logo