సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Jan 19, 2020 , 00:28:54

నిండు జీవితానికి రెండు చుక్కలు..

నిండు జీవితానికి రెండు చుక్కలు..
  • -పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
  • -కార్యక్రమంలో సిబ్బంది విధిగా బాధ్యతలు నిర్వర్తించాలి
  • -ఖమ్మంలో ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్‌వో

మయూరి సెంటర్‌, జనవరి 18: పోలియో రహిత సమాజం కోసం వైద్యారోగ్యశాఖ కృషి చేస్తుందని, ప్రభుత్వం నిర్థేశించిన విధివిధానాలను అనుసరిస్తూ నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో జిల్లాలో 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ పోలియో చుక్కలను వేసే కార్యక్రమం నేటినుంచి జరగనుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాలతి అన్నారు. శనివారం స్థానిక పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి జిల్లా ఆసుపత్రి వరకు జరిగిన భారీ ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో విధలు నిర్వర్తిస్తారని ఆమె అన్నారు. జిల్లాలో 950 పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి, 3800 మంది సిబ్బందితో పోలియో చుక్కలు వేయటానికి ఏర్పాట్లు చేశామని, సిబ్బంది విధులను పర్యవేక్షించటానికి 95 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. 30 సంచార బృందాలు, 40 కేంద్రాలు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లలో కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొదటి రోజు పోలియో కేంద్రంలో, రెండు, మూడు రోజులలో ఇంటింటి సర్వే నిర్వహించి మిగిలిన పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించనున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ఐఎంఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాస్‌, డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌లు మాట్లాడుతూ.. పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు పూర్తి సహకారం ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో డీఐవో డాక్టర్‌ అలివేలు, పీవో ఎంసీహెచ్‌ డాక్టర్‌ రామారావు, డీఎంవో డాక్టర్‌ సైదులు, డీఎన్‌ఎంవో డాక్టర్‌ ప్రేమీల, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యాధికారులు, డిప్యూటీ డెమో సాంబశివరెడ్డి, సీహెచ్‌ రమణ, నర్సింగ్‌ స్కూల్‌ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
logo