మంగళవారం 07 జూలై 2020
Khammam - Jan 18, 2020 , 04:47:35

టీఆర్‌ఎస్‌ జోరు..

టీఆర్‌ఎస్‌ జోరు..
  • -ప్రచారంలో దూసుకుపోతున్న లాబీ దండు
  • -మూడు మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు..
  • -ప్రత్యర్థుల గుండెల్లో పరుగెడుతున్న రైళ్లు
  • -ప్రచార ఊసేలేని ‘హస్త’వాసులు..
  • -సత్తుపల్లి, వైరాలో ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్‌ ప్రచారం
  • -మధిరలో జడ్పీచైర్మన్‌ లింగాల ఇంటింటి ప్రచారం
  • -ఇల్లెందు సింగరేణి మర్చంట్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి అజయ్‌

పురపోరులో టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది.. ప్రచారానికి మరో రెండు రోజులే గడువు ఉండడంతో గులాబీ దండు గడప గడపకూ వెళ్తోంది.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతే గీటురాయిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో ముందుకెళ్తున్నారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి టీఆర్‌ఎస్‌ పాలనలోనే పట్టణాలు ప్రగతి పథంలో నడుస్తాయని ప్రజలకు తెలియజేస్తున్నారు.. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరాలో ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములునాయక్‌ విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, మధిరలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణతో ప్రత్యర్థులు కకావికలం అవుతున్నారు.. కారు స్పీడును అందుకోలేని ప్రతిపక్షాల్లో ప్రచారం ఊసే కనిపించడం లేదు.. ఓటర్లు మాత్రం సంపూర్ణ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇంటి పార్టీ అభ్యర్థులనే గెలిపించుకుంటామని తమ మనసులోని మాటను తెలియబరుస్తున్నారు.
- ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఖమ్మం జిల్లాలో ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. టీఆర్‌ఎస్‌ ప్రచారంతో ప్రతిపక్ష పార్టీలు కుదేలవుతున్నాయి. ఆ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు ఎవరూ ప్రచారంలో లేకపోవడం ఆశ్చర్యకరం. ఓటమిని నైతికంగా ముందుగానే అంగికరించడంతో నామ మాత్రంగానే పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పట్టణ ఓటర్లు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతుండటంతో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ప్రచారం చేయడానికి జంకుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్‌, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఒక దఫా ప్రచారం పూర్తి చేశారు. శనివారం నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వివిధ మున్సిపాలిటీల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర  ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలకే ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర నాయకులు ఎవరూ ప్రచారం చేసే అవకాశం లేదు. దీంతో జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్‌, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలో నిమగ్నం కానున్నారు. నేటి నుంచి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల్లో మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. వీరికి సహకారంగా స్థానిక నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కమిటీల్లో వీరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచా రం నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ముందంజలో ఉన్నారు.

మూడు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురడం ఖాయం

ఈ ఏడాది తెలంగాణలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరవేసిన టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో అదే ప్రభంజనాన్ని కొనసాగించనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని గెలిపించడం ద్వారా తమ మున్సిపాలిటీలు అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని పట్టణ ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపిస్తే ఉపయోగం ఏమీ ఉండదని, నిధులు వచ్చే అవకాశం కూడా లేదని, అలాంటప్పుడు వారికి ఓటు వేయడం వ్యర్థమని నగర ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది. దీంతో ఖమ్మం జిల్లాలో మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తున్నది. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను ఇప్పటికే ఆరు వార్డులు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వచ్చాయి. మరో ఆరు వార్డుల్లో విజయం సాధిస్తే చైర్మన్‌ స్థానం గెలవడం సునాయసంగా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై ఉన్న  నమ్మకంతో ఏకగ్రీవం అయినవి కాకుండా మిగిలిన అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధించే వాతావరణం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
అదే విధంగా వైరా మున్సిపాలిటీలోనూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రధాన చైర్మన్‌ అభ్యర్థి ఎవరూ లేకపోవడంతో టీఆర్‌ఎస్‌  విజయం సునాయాసంగా గెలిచే అవకాశముంది. ఈ రెండు చోట్ల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే కావడంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నిధులను రాబట్టే విషయంలో ఎమ్మెల్యేలు ముందు వరుసలో ఉంటారు కనుక మున్సిపాలిటీల అభివృద్ధి ప్రజలు ఆశించిన స్థాయిలో జరిగే అవకాశముంది. మధిర మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ పార్టీ నుంచి నామినేషన్లు వేసిన రెబల్‌ అభ్యర్థులు కూడా ఉప సంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ విజయం నల్లేరుపై నడకలా మారింది. మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ పార్టీలు కూటమిగా ఏర్పడి రంగంలో ఉన్న విషయం తెల్సిందే. అయితే కూటమిని గెలిపిస్తే ఉపయోగం ఉండద ని, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించడం ద్వారా అభివృద్ధిని ఆహ్వానించినవారం అవుతున్నామని భావిస్తున్నారు.  
 

మున్సిపాలిటీల్లో ఇంటింట ప్రచారం

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వైరాలో స్థానిక ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ శుక్రవారం 15,16,17 వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్‌ అమలు చేసే పథకాలను వివరించారు. టీఆర్‌ఎస్‌ గెలవడం ద్వారా రాబోయే రోజుల్లో వైరా పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మధిర మున్సిపాలిటీలోని 18వ వార్డులో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ సందర్భంగా లింగాల మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే మధిర పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారా నిధులు వచ్చే అవకాశం లేదన్నారు. మధిరలో సెంట్రల్‌ లైటింగ్‌, రోడ్ల విస్తరణ, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలోని 2,13,14 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు మట్టా దయానంద్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. వారితో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు కూడా ఉన్నారు.  ఈ మూడు వార్డుల్లో  విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, రంగంలో ఉన్న అభ్యర్థులు పలువురు పాల్గొన్నారు.logo