సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Jan 18, 2020 , 04:45:39

సెక్టోరల్‌, జోనల్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలి

సెక్టోరల్‌, జోనల్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలి
  • -సెక్టోరల్‌, జోనల్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలి
  • -పటిష్ట బందోబస్తు, వెబ్‌ కాస్టింగ్‌ చేపట్టాలి
  • -ఎన్నికల అధికారులకు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆదేశం

ఖమ్మం, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల సెక్టోరల్‌, జోనల్‌ అధికారులు ముందస్తుగానే తమ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలు తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలకు ఈ నెల 22న జరగనున్న పోలింగ్‌ ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రజ్ఞాసమావేశ మందిరంలో నోడల్‌ అధికారులు, సెక్టోరల్‌, జోనల్‌ అధికారులతో కలెక్టర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. సెక్టోరల్‌, జోనల్‌ అధికారులు తమకు కేటాయించిన రూట్లలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలను శనివారం తప్పనిసరిగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నోడల్‌ అధికారులకు కేటాయించిన విధులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే చేయాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన వాహనాలను సమకూర్చాలని రవాణాశాఖ అధికారిని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ లోకేషన్లతో పాటు రూట్లవారీగా మొబైల్‌ టీమ్‌కు అవసరమైన పోలీసు సిబ్బందిని నియమించాలని పోలీసు శాఖ నోడల్‌ అధికారి ప్రసన్నకుమార్‌కు సూచించారు.

129 పోలింగ్‌ కేంద్రాలకు గాను ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత 115 పోలింగ్‌ కేంద్రాల్లో 39 పోలింగ్‌ లొకేషన్లు 18 రూట్లు గుర్తించడం జరిగిందని, అన్ని పోలింగ్‌ కేంద్రాలకు, రూట్లకు భద్రతా సిబ్బందిని నియమించాలని కలెక్టర్‌ తెలిపారు. సమస్యాత్మక, సున్నిత పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు వెబ్‌ కాస్టింగ్‌ చేపట్టాలని కలెక్టర్‌ సంబంధిత శాఖ నోడల్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ సాయంత్రం వరకు, 24, 25 తేదీలలో ఎన్నికలు జరిగే మూడు మున్సిపాలిటీలలో మద్యం దుకాణాలు మూసివేయాలని, పరిసర గ్రామాలల్లోని అన్ని బెల్టు షాపులను మూసివేయాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వాహనాలు, విద్యుత్‌, పోలీస్‌ శాఖల అనుమతులు జారీచేసేందుకు ఆయా శాఖల నుంచి సీనియర్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్నారు. రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ సిబ్బంది అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఎక్స్‌పెండీచర్‌ మానిటరింగ్‌ టీమ్‌ అబ్జర్వర్‌ నోడల్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు తమ విధులను బాధ్యాతాయుతంగా నిర్వర్తించే విధంగా సంబంధిత నోడల్‌ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

పోలింగ్‌ రోజున ప్రిసైడింగ్‌ అధికారులు పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులను తప్పనిసరిగా సీల్‌ చేసి, ప్రిసైడింగ్‌ అధికారి డైరీ, బ్యాలెట్‌ పేపర్‌ అకౌంట్‌ సరిచూసుకొని, స్టాట్యూటరీ కవర్స్‌తో పాటు రిసెప్షన్‌ సెంటర్‌కు చేరుకునే విధంగా సెక్టోరల్‌ అధికారులు చూడాలని, బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్‌వేసే వరకు సెక్టోరల్‌ అధికారులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. నోడల్‌, సెక్టోరల్‌, జోనల్‌ అధికారులందరూ బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించి పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, శిక్షణా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, నోడల్‌ అధికారులు కే.శ్రీరామ్‌, ప్రసన్నకుమార్‌, కృష్ణారావు, మదన్‌మోహన్‌, భాస్కర్‌రావు, జనార్థన్‌, ప్రకాష్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావు, ఖాసీం, అప్పారావు, సభిత, సెక్టోరల్‌ అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.   logo