శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Jan 17, 2020 , 00:03:17

ప్రచార హోరు

 ప్రచార హోరు
  • -టీఆర్‌ఎస్‌ విజయం నల్లేరుపై నడకే..
  • -కేసీఆర్‌తోనే సుస్థిర పాలన
  • -మూడు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయాలి
  • -వైరా, మధిరలో ఎంపీ నామా విస్తృత ప్రచారం
  • -సత్తుపల్లిలో సండ్ర ప్రచారానికి విశేష ఆదరణ
  • -వైరాలో సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ‘కారు’ స్పీడ్‌ పెంచింది.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులకు యావత్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ పాలనకు జేజేలు పలుకుతున్నారు.. ప్రచారాలకు విశేష స్పందన రావడం.. ఏడు వార్డులు ఏకగ్రీవం కావడంతో టీఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరుపై నడకగా మారింది.. గురువారం ఎంపీ నామా నాగేశ్వరరావు మధిర, వైరా మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.. వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌ భారీ ర్యాలీలతో తన అనుచర గణంతో వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా సీపీఎం నుంచి 20 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరాయి.. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.. సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు..   -ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఖమ్మం జిల్లాలోని ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న మూడు మున్సిపాలిటీలపై గులాబీ జెండాను ఎగురవేసే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్ల వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం కార్యాచరణలోకి దిగింది. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో ప్రచారంలోకి వెళ్లారు. ఈ నెల 14వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ జరిగిన అనంతరం రంగంలో ఉన్న అభ్యర్థులను ప్రకటించారు. 15వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా అగ్ర నాయకులు ప్రచారంలో లేరు. గురువారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వైరా, మధిర మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో పర్యటించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో ప్రచారం నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లిలో ప్రచారం నిర్వహించగా, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ వైరా మున్సిపాలిటీలో, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు మధిర మున్సిపాలిటీలో ప్రచారం చేపట్టారు. వీరితో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

‘టీఆర్‌ఎస్‌' గెలుపుతో కేసీఆర్‌ పాలనకు మద్దతు తెలపండి :

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వార్డు సభ్యులను కౌన్సిలర్లుగా గెలిపించడం ద్వారా సీఎం కేసీఆర్‌ పాలనకు మద్దతు పలికిన వారవుతారని, టీఆర్‌ఎస్‌తోనే సుస్థిర పాలన అందుతుందని ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్‌ లోకసభా పక్షనేత నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం వైరా మున్సిపాలిటీలోని 1, 4, 7, 8, 13, 14, 20 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్‌ గుగులోత్‌ పాపాలాల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. నామా నిర్వహించిన రోడ్‌ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రానున్న రోజుల్లో పట్టణ ప్రణాళికను ప్రవేశపెట్టి పట్టణాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆరేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వలన అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు. ఇప్పటికే వైరా మున్సిపాలిటీకి ప్రభుత్వం వేల కోట్ల రూపాయాలను కేటాయించిందన్నారు. గత ప్రభుత్వాలు మున్సిపాలిటీలను పట్టించుకోకపోవడంతో మురికి కూపంగా మారాయన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మధిర మున్సిపాలిటీలోని అంబేద్కర్‌ సెంటర్‌, 7,13,14,15 వార్డుల్లో ఎంపీ నామా ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు  నల్లమల్ల వెంకటేశ్వరరావు ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ సందర్భంగా నామా ప్రసంగిస్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని గెలుపించడం ద్వారా నిధులు వస్తాయని, తద్వారా మధిర మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో శానిటేషన్‌, రహదారులు విస్తరణ అభివృద్ధి జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం సాయంత్రం సత్తుపల్లి మున్సిపాలిటీలోని 15వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కారు గుర్తుతో ముగ్గువేసిన వారిని అభినందించారు. టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉన్న అభిమానం, సీఎం కేసీఆర్‌ విధానాలు నచ్చిన సత్తుపల్లి నగర ప్రజలు ఇప్పటికే ఆరు వార్డులను ఏకగ్రీవం చేసిందని, మిగిలిని వార్డుల్లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు వీరపనేని రాధిక, గాదె సత్యం, చల్లగుండ్ల కృష్ణయ్య, నరసింహారావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, ఉమామహేశ్వరరావు, మహేష్‌, వీరపనేని బాబీ పాల్గొన్నారు.

వైరాలో సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు

వైరా మున్సిపాలిటీలోని హనుమాన్‌బజార్‌లో సీపీ ఎం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిలో సీపీఎం పార్టీకి చెందిన నాయకులు దండగిరి పెద్ద సైదులు, రాములమ్మ, నాగరాజు, ప్రసన్న, చిన్నసైదులు, గురవమ్మ, వెంకటేశ్వర్లు, గోపి, రమణ, భరత్‌, నాగమ్మ, వెంకటకృష్ణ, రామకృష్ణ, ఉప్పు వేణు, వేముల బాలస్వామి తదితరులున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతూ కేసీఆర్‌ అవలంభిస్తున్న విధానాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి మెచ్చి ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తమ వార్డును పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల రజిని విజయం నల్లేరుపై నడకే అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు బొర్రా రాజశేఖర్‌, మండల అధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, తట్ల కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
logo