బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Jan 15, 2020 , 02:01:13

పకడ్బందీగా ఓటర్ల సంక్షిప్త సవరణ

పకడ్బందీగా ఓటర్ల సంక్షిప్త సవరణ
  • -స్టేట్‌ డెమోక్రసీ అవార్డు లభించడం అభినందనీయం
  • - నూతన ఓటర్లు, అభ్యంతరాల క్లయిమ్‌ల దరఖాస్తులకు నేటితో గడువు పూర్తి
  • - ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ జీ అశోక్‌
  • - ఓటు హక్కు కల్పించేందుకు ఆన్‌లైన్‌ ప్రక్రియ : కలెక్టర్‌ కర్ణన్‌

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఓటర్ల సంక్షిప్త సవరణ ఖమ్మం జిల్లాలో పటిష్టంగా, పకడ్బందీగా జరుగుతోందని ఎన్నికల పరిశీలకుడు డాక్టర్‌ జీ.అశోక్‌ పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను పరిశీలించేందుకు మంగళవారం నగరానికి చేరుకున్ను ఆయన.. ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవలే జరిగిన అన్ని ఎన్నికలనూ సమర్థంగా నిర్వహించినందుకు జిల్లాకు తెలంగాణ స్టేట్‌ డెమోక్రసీ అవార్డు లభించడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియ కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా జరుగుతోందన్నారు. రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని కోరారు. గత డిసెంబర్‌ 16న ప్రచురితమైన ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ నెల 15లోగా నూతన ఓటు నమోదుకు, అభ్యంతరాల క్లెయిములకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అనంతరం నగరంలోని రోటరీనగర్‌ మండల పరిషత్‌ పాఠశాలలోని మూడు పోలింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించి క్లెయిముల స్వీకరణను పరిశీలించారు. కొణిజర్ల మండలం పల్లిపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని నాలుగు పోలింగ్‌ కేంద్రాల బూత్‌ లెవల్‌ అధికారులతో పరిశీలించి స్వీకరించిన క్లెయిముల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాం: కలెక్టర్‌

కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత డిసెంబర్‌ 16న ప్రచురించిన ముసాయిదా జాబితా ప్రదర్శించామని అన్నారు. నూతన ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ, మార్పులు, చేర్పుల కోసం ఈ నెల 11, 12 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించామని తెలిపారు. ఐదు నియోజకవర్గాలలోని 1363 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 11 లక్షల 24 వేల 497 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. అలాగే ఈ ఐదు నియోజకవర్గాల పరిధిలో ఫారం-6కు 11,639, ఫారం-7 కు 16,260, ఫారం -8కు 11,039, ఫారం-8ఏకు 1732 క్లెయిములను పరిష్కరించినట్లు వివరించారు. రెండు చోట్ల ఓట్లు కలిగిన వారికి ఓటరు ఆప్షన్‌ ప్రకారం ఒకేచోట ఓటు హక్కు కల్పించడంలో భాగంగా ఆన్‌లైన్‌ ప్రక్రియ చేపట్టామన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 20,989 డబుల్‌ ఓట్లను తొలగించినట్లు చెప్పారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, బూత్‌ లెవల్‌ అధికారులను సంప్రదించి ఓటరు జాబితాను మరోసారి సరిచూసుకోవాలని ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్‌ కోరారు. సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ పాలేరు నియోజకవర్గంలోని గుదిమళ్ళ-ఎస్టీ తండాలో నూతన పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఓటరు కార్డును ఆధార్‌ అనుసంధానం చేయాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఈఆర్‌వోలు శివాజీ, దశరథ్‌, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ నుంచి ఎం.హన్మంతరెడ్డి, బోనాల లక్ష్మణ్‌, టీడీపీ నుంచి శేఖర్‌రావు, కాంగ్రెస్‌ నుంచి గోపాల్‌రావు, బీ.హరినాయక్‌, సీపీఎం నుంచి ఆర్‌.ప్రకాష్‌, సీపీఐ నుంచి జీ.లక్ష్మీనారాయణ, బీజేపీ నుంచి జీ.విద్యాసాగర్‌రావు, బీఎస్‌పీ నుంచి కే.శ్రీను, కలెక్టరేట్‌ ఏవో మదన్‌గోపాల్‌, ఎన్నికల డీటీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.logo