మంగళవారం 07 జూలై 2020
Khammam - Jan 14, 2020 , 03:57:54

టీఆర్‌ఎస్‌ జోష్‌

టీఆర్‌ఎస్‌ జోష్‌

వైరా, నమస్తే తెలంగాణ, జనవరి 13: నూతనంగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది. ఈ మున్సిపాలిటీలోని 3వ వార్డుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా ఎన్నికల బరిలో ఉన్న ఏదునూరి పద్మజ ఆ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డుకు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏదునూరి పద్మజ, టీడీపీ నుంచి బొర్రా రాణి, టీఆర్‌ఎస్‌ రెబల్‌గా కారుకొండ లక్ష్మీహిమజ నామినేషన్‌లను దాఖలు చేశారు. అయితే టీఆర్‌ఎస్‌ రెబల్‌గా నామినేషన్‌ వేసిన కారుకొండ లక్ష్మీహిమజతో సోమవారం ఎమ్మెల్యే రాములునాయక్‌ ఆదేశానుసారం టీఆర్‌ఎస్‌ నాయకుడు బొర్రా రాజశేఖర్‌ ప్రత్యేకంగా చర్చించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం, వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అందరమూ ఒకే తాటిపైకి రావాలని బొర్రా రాజశేఖర్‌ లక్ష్మీహిమజను కోరారు. 3వ వార్డు అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏదునూరి పద్మజను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరారు. దీంతో కారుకొండ లక్ష్మీహిమజ నామినేషన్‌ ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థిని బొర్రా రాణి కూడా అనూహ్యంగా తమ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధి జరగాలని ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. దీంతో 3వ వార్డు సభ్యురాలిగా ఏదునూరి పద్మజ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లయింది. దీంతో వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. పద్మజకు ఎమ్మెల్యే రాములునాయక్‌ మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని అన్నారు. వైరా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు బొర్రా రాజశేఖర్‌, సూతకాని జైపాల్‌, ఏదునూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


సత్తుపల్లిలో మరో ఏకగ్రీవం

6వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని తోట సుజలారాణి వశం

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, జనవరి 13: సత్తుపల్లి మునిన్సిల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మరో వార్డు ఏకగ్రీవమైంది. ఇంతకుముందే 17వ వార్డు టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం కాగా.. సోమవారం ఆరో వార్డు కూడా ఇనానమస్‌ అయింది. సత్తుపల్లి మున్సిపాలిటీలోని 23 వార్డులకు వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశా రు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా 6వ వార్డు నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థుల్లో తోట గణేష్‌ (టీఆర్‌ఎస్‌), తుర్లపాటి సాయిచంద్రవర్ధన్‌ (బీజేపీ), ఎస్‌కే మహ్మద్‌అలీ (టీడీపీ), చిమటా రమేష్‌ (స్వతంత్య్ర) అనే నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా తోట సుజలారాణి ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే అధికారికంగా ఈ ఎన్నికను అధికారులు ప్రకటించాల్సి ఉంది.


మూడోసారి ముచ్చటగా..

తొలిసారిగా సత్తుపల్లి పంచాయతీ నగర పంచాయతీగా ఏర్పడిన క్రమంలో కాంగ్రెస్‌ తరఫున 5వ వార్డు నుంచి తోట సుజలారాణి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. తిరిగి 2014లో వైసీపీ తరఫున అదే వార్డు నుంచి రెండోసారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి 2020లో వార్డుల పునర్విభజనలో భాగంగా 6వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా ఏకగ్రీవంగా ఎన్నికకావడం విశేషం.


logo