సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Jan 13, 2020 , 01:47:03

పుర పోరులో టీఆర్‌ఎస్‌ బోణి..

పుర పోరులో టీఆర్‌ఎస్‌ బోణి..


వైరా, నమస్తే తెలంగాణ, జనవరి12: వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. వైరాలోని పలు వార్డుల్లో ఆదివారం టీఆర్‌ఎస్‌ నాయకులు, అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక 12వ వార్డులో ఎమ్మెల్యే రాములునాయక్‌కు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనమా విశ్వేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ వారు ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వైరా మున్సిపాలిటీలోని 20 వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు.

టీఆర్‌ఎస్‌ గెలుపు వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి మలుపు అవుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మున్సిపాలిటీలోని ప్రజలదని, వైరా అభివృద్ధి మాత్రం తన బాధ్యత అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గెలుపుపై ధీమాను ప్రదర్శించకుండా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారిని గుర్తించి వారిని కలిసి ఓట్లు అభ్యర్థించాలన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20కోట్ల నిధులను ఒకే విడతలో కేటాయించిందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మున్సిపాలిటీల అభివృద్ధికి ఒకే విడతలో ఇన్ని నిధులు కేటాయించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు.

ఇటీవల తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి మున్సిపాలిటీ అభివృద్ధికి మరో రూ.15కోట్ల నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. అందుకు స్పందించిన కేసీఆర్‌ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 20 వార్డులను క్లీన్‌ స్వీప్‌ చేస్తే ప్రభుత్వం మరిన్ని నిధులు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టిక్కెట్టు ఆశించి భంగపడిన వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. నామినేషన్‌లు వేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవాలని కోరారు. భవిష్యత్తులో పార్టీ, నామినేటెడ్‌ పదవుల్లో వీరందరికీ సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. వైరాలోని 12వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వనమా విశ్వేశ్వరరావు కారు గుర్తుపై ఓటర్లు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్‌, సూతకాని జైపాల్‌, కట్టా కృష్ణార్జున్‌రావు, వనమా విశ్వేశ్వరరావు, వైరా జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, టీఆర్‌ఎస్‌ వైరా మండల అధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, నాయకులు నూకల ప్రసాద్‌, మిట్టపల్లి సత్యంబాబు, కొణతాలపల్లి వెంకటసుబ్బారావు, వజినేపల్లి చక్రవర్తి, నంబూరి మధు, నాళ్ల నాగేశ్వరరావు, మచ్చా రామారావు తదితరులు పాల్గొన్నారు.


logo