శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Jan 13, 2020 , 01:46:18

క్రీడాకారులు జాతీయస్థాయి రాణించాలి..

క్రీడాకారులు జాతీయస్థాయి రాణించాలి..


మయూరి సెంటర్‌ : విద్యార్థులు చదువులకు, క్రీడలకు రెండింటికీ సమయాన్ని కేటాయించి, ఈ రెండు రంగాలలో రాణించి జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగి రాష్ర్టానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ కోరారు. టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీక్లబ్‌లో జరిగిన ముగింపు పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, విజేతలకు బహుమతులు ప్రధానం చేసి మాట్లాడారు. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లి క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతూ తెలంగాణ రాష్ర్టానికి ఉన్నత స్థానాన్ని చేకూర్చాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలో తమ ప్రావీణ్యాన్ని చూపడం, సీనియర్‌ క్రీడాకారుడు డాక్టర్‌ శశికుమార్‌ ఆటతీరు తనను ఎంతో అబ్బుర పరిచిందని, తాను చదువుకున్న కాలేజీ రోజులను గుర్తు చేసిందన్నారు. ఈ అసోసియేషన్‌లో ప్రముఖంగా వైద్యులు, విద్యావేత్తలుండటం సంతోషదాయకమన్నారు. అనంతరం డాక్టర్‌ సునీల్‌కుమార్‌ జంగాల మాట్లాడుతూ.. క్రీడాకారులను ఉన్నతస్థానానికి తీసుకెల్లడమే తమ అసోసియేషన్‌ లక్ష్యమని, ఇందులో భాగంగానే ఫిజికల్‌ డైరెక్టర్‌ కిట్స్‌ సాంబమూర్తిని కోరడం జరిగిందని, ఈ క్రీడల నిర్వహణలో కిట్స్‌ సాంబమూర్తి శ్రమ, కృషి అద్వితీయమని కితాబిచ్చారు. అనంతరం సీఐ అంజలి, ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ బొలికొండ శ్రీనివాస్‌, డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌, రెజోనెన్స్‌ కళాశాల అధినేత శ్రీధర్‌లు మాట్లాడుతూ.. ఈ క్రీడాభ్యున్నతి కోసం తమవంతు సహయసహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ పోటీలలో ఓరాల్‌ ఛాంపియన్‌ ఓఏవీ పాల్వంచ ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో గోకినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిలిచింది. సీనియర్స్‌ విభాగంలో డాక్టర్‌ శశికుమార్‌ ప్రథమ బహుమతి సాధించారు. అనంతరం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, సీనియర్‌ ప్లేయర్‌,  వైద్యులు శశికుమార్‌లను అసోసియేషన్‌ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కిట్స్‌ సాంబమూర్తి, అసోసియేషన్‌ నేతలు డాక్టర్‌ కరీమ్‌, డాక్టర్‌ ఆరీఫ్‌, పీడీ శ్రీనివాస్‌, రవి, యాకయ్య, డీఏవీ పీఈటీ శ్రీధర్‌గౌడ్‌, రవి, రాష్ట్ర సంఘం బాధ్యులు పాల్గొన్నారు.

పలు విభాగాల్లో జరిగిన క్రీడలు..

టేబుల్‌ టెన్నిస్‌ క్రీడా విభాగంలో అండర్‌-14 ఓపెన్‌ సింగిల్స్‌లో ప్రేమ్‌ ఆశిష్‌ విన్నర్‌గా, సందీప్‌ రన్నర్‌గా తృతీయ స్థానంలో రాథాకృష్ణలు నిలిచారు. అండర్‌-14  ఓపెన్‌ సింగిల్స్‌ బాలికల విభాగంలో శ్రావ్య విన్నర్‌గా, నాగమణి రన్నర్‌గా, తృతీయ స్థానంలో మేఘా, నాల్గో స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గగణలు నిలిచారు. అండర్‌-17 బాలుర ఓపెన్‌ సింగిల్స్‌ విభాగంలో బీ శ్రీనివాస్‌ విన్నర్‌గా, నరేందర్‌ రన్నర్‌గా, తృతీయ స్థానంలో చరణ్‌, నాల్గో స్థానంలో కేసీఎస్‌ రాణా, ఐదో స్థానంలో నర్సింహలు నిలిచారు. అండర్‌-19 బాలుర విభాగంలో ఖమ్మం కిట్స్‌ కళాశాల విద్యార్థి ఎంఎల్‌ఈ నైన్‌ కుమార్‌ విన్నర్‌గా, సాయి గాంధీ రన్నర్‌గా, తృతీయ స్థానంలో భువనచంద్రలు నిలిచారు. అండర్‌-19 బాలికల విభాగంలో ఉషశ్రీ విన్నర్‌గా, రన్నర్‌గా కే నవ్య, తృతీయ స్థానంలో బీ నవ్యలు నిలిచారు. అండర్‌-11 బాలుర, బాలికల విభాగాలలో విన్నర్‌లుగా ఖమ్మంకు చెందిన అనిరుద్‌, పాల్వంచకు చెందిన దీపిక, రన్నర్‌లుగా సమీర్‌, నిఖిత, తృతీయ స్థానంలో దయాకర్‌, ఖమ్మం రెజోనెన్స్‌ పాఠశాలకు చెందిన తేజస్విని, నాల్గో స్థానంలో ముస్తఫా, శరుణ్‌ సాధ్విక, ఐదో స్థానంలో ఖమ్మంకు చెందిన చైతిరకలు నిలిచారు. అండర్‌-7 బాలికల విభాగంలో క్రితిక కుమారిలు నిలిచారు. సీనియర్స్‌ ఉమెన్స్‌ ఓపెన్‌ సింగిల్స్‌లో విన్నర్‌గా రవీనా రాజేంద్ర దాహత్‌, రన్నర్‌గా ఉషశ్రీలు నిలిచారు.  ఈ పోటీలలో ఓరాల్‌ చాంపియన్‌ ఓఏవీ పాల్వంచ ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో గోకినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిలిచింది. సీనియర్స్‌ విభాగంలో డాక్టర్‌ శశికుమార్‌ ప్రథమ బహుమతి సాధించారు. సీనియర్స్‌ పురుషుల ఓపెన్‌ సింగిల్స్‌ విభాగంలో విన్నర్‌గా ఖమ్మంకు చెందిన డాక్టర్‌ శశికుమార్‌, రన్నర్‌గా పాల్వంచకు చెందిన సోందు, తృతీయ స్థానంలో హుస్సేన్‌లు నిలిచారు. గత రెండు రోజులుగా ఖమ్మం జూబ్లీక్లబ్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు విశేషస్పందన లభించింది.


logo