మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 13, 2020 , 01:44:03

భక్తి శ్రద్ధలతో కూడారై ఉత్సవం

భక్తి శ్రద్ధలతో కూడారై ఉత్సవం


భద్రాచలం, నమస్తే తెలంగాణ జనవరి12: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలలో భాగంగా 27వ రోజు ఆదివారం కూడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా ఆలయ ప్రాంగణంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుప్పావై తిరుపళ్లెచ్చి అను ద్రవిడ ప్రబంధాలను నివేదన సమయంలో అనుసంధానం చేశారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథునితో తన వివాహం జరిగితే 108 గంగాళాలతో పాయసన్నం నివేదన చేస్తానని సుందర బహు స్వామికి మొక్కుకుందని వేద పండితులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో అమ్మవారితో శ్రీరంగనాథుని కల్యాణం జరగడం, ఆయనతో ఐక్యం అవడం జరిగిందని, ఈ క్రమంలో రామానుజుల వారు అమ్మవారి మొక్కును భక్తి ప్రపత్తులతో తీరుస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఏటా ధనుర్మాస మహోత్సవాల సమయంలో కూడారై ఉత్సవాన్ని అమ్మవారిని స్మరించుకుంటూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు, వేద పండితులు చెబుతున్నారు. అందులో భాగంగా రామాలయంలో 108 గంగాళాలతో పాయసన్నం (పరమన్నం) అమ్మవారికి ఎదురుగా ఏర్పాటు చేసి నివేదన చేశారు. ఈ సమయలో మహిళా ముత్తైదువులకు గోదాదేవి ప్రతిమలను ఇచ్చి షోడోపచారాలతో శ్రీకృష్ణ గోదా అష్టోత్తరాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. చివరిగా కూడారై అనే పాశురాన్ని నక్షత్ర హారతితో నీరాజనం చేసి పఠించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో జీ.నరసింహులు, స్థానాచార్యులు కేఈ స్థలసాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అర్చకులు, వైదిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్వామివారికి ఘనంగా రాపత్తు సేవ.....భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీవైకుంఠ అధ్యయన మహోత్సవాలలో భాగంగా స్వామివారికి వన విహార మండపంలో ఆదివారం ఘనంగా రాపత్తు సేవ నిర్వహించారు. ఈ సంద ర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పర్ణశాల దేవాలయంలో..

పర్ణశాల:పర్ణశాల ఆలయంలో ఆదివారం ఎంతో వైభవంగా కూడారై ఉత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉత్సవమూర్తులను నూతన వస్ర్తాలతో అలంకరించి వేదమంత్రాలతో, మేళతాళాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మూలవిరాట్‌లకు 108 గిన్నెలతో పర మాన్నం నైవేద్యంగా సమర్పించారు.


logo
>>>>>>