గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 12, 2020 , 05:42:47

మున్సిపాలిటీలన్నీ గెలుస్తాం..

మున్సిపాలిటీలన్నీ గెలుస్తాం..
  • బీఫామ్‌లు కేటాయింపులో ఎమ్మెల్యేలకే సర్వాధికారాలు
  • బీఫామ్‌ రాని అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవాలి..
  • విప్‌ జారీ చేసే అధికారం ఎమ్మెల్యేదే..
  • రెబల్‌గా పోటీ చేస్తే వేటు తప్పదు
  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జి తాతా మధు

వైరా, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమని రాష్ట్ర కార్యదర్శి, వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జి తాతా మధు స్పష్టం చేశారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్‌లు టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్నారు. ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీ వైపు ఆకర్షితులయ్యారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు అధికంగా రావడంతో ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బీఫామ్‌లు ఆశించే వారి సంఖ్య పెరిగిందన్నారు. పార్టీలోని నాయకులు టిక్కెట్లు ఆశించడం, పదవులను ఆశించడం తప్పుకాదన్నారు. అయితే బీఫామ్‌లు ఇచ్చే అధికారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు అప్పగించారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే లేని చోట నియోజకవర్గ ఇన్‌చార్జిలే రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంత అధికారం ఉందో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు అంతే అధికారం ఉందన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. వైరాలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఐకమత్యంగా ఉండి టిక్కెట్లు కేటాయించుకోవడం హర్షనీయమన్నారు. వైరాలో టీఆర్‌ఎస్‌లోని వర్గాలు తమకు అంతర్గతంగా మద్దతు తెలుపుతాయని ప్రతిపక్షాలు ఆశపడ్డాయన్నారు. అయితే టీఆర్‌ఎస్‌లోని అందరూ కలిసి ఐకమత్యంతో ఉండటంతో ప్రతిపక్షాల ఆశలు అడియాశలయ్యాయన్నారు. బీఫామ్‌ రాని టీఆర్‌ఎస్‌ పార్టీలోని అభ్యర్థులు వెంటనే పోటీ నుంచి విరమించుకొని పార్టీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. టిక్కెట్టు రాని వారికి పార్టీ పదవుల్లో, ఇతర పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విప్‌ జారీ చేసే అధికారం ఎమ్మెలేకే ఉందన్నారు. పార్టీలో ఉంటూ అందుకు భిన్నంగా ఎన్నికల్లో పోటీ చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. అలాంటి అభ్యర్థులు ఒకవేళ వార్డు సభ్యులుగా గెలిచినప్పటికీ పార్టీలోకి తీసుకునే ప్రశక్తే లేదన్నారు. పార్టీలో ఉంటున్న నాయకులు, కార్యకర్తలు రెబల్‌, ప్రతిపక్షాల అభ్యర్థులకు సహకారం అందిస్తే వారిపై కూడా వేటు వేస్తామన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ.. టిక్కెట్టు రాని వారికి పార్టీ పదవుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామన్నారు. బీఫామ్‌లు రాని వారు నామినేషన్‌లను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్‌, సూతకాని జైపాల్‌, కట్టా కృష్ణార్జున్‌రావు, వనమా విశ్వేశ్వరరావు, వైరా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, వైరా జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, వైరా, కొణిజర్ల మండలాధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, కోసూరి శ్రీనివాసరావు, ఏన్కూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లాలు, ఏన్కూరు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు సురేష్‌, నాయకులు మిట్టపల్లి నాగి, రాయల పుల్లయ్య, ముళ్లపాటి సీతారాములు పాల్గొన్నారు. 


logo
>>>>>>