ఆదివారం 29 మార్చి 2020
Khammam - Jan 12, 2020 , 02:24:59

మరింత బలోపేతం చేయాలి

మరింత బలోపేతం చేయాలి


మామిళ్లగూడెం, జనవరి 11: గ్రామాల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఎంపీటీసీల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. చాంబర్‌ అనుబంధ సంఘమైన ఎంపీటీసీల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఎంపీటీసీల సదస్సు ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ మీటింగ్‌ హాల్లో శనివారం జరిగింది. ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్‌ కొండపల్లి శ్రీనివాసరావు (వాసు) అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన పంచాయతీరాజ్‌ హక్కులు, విధులు, నిధులను రాజకీయాలకు ఆతీతంగా అమలు చేయాలని కోరారు. పంచాయతీల అభివృద్ధికి సర్పంచ్‌లతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండి కృషి చేస్తున్నప్పటికీ ఎంపీటీసీలకు నిధుల కేటాయింపు లేకపోవడంతో గ్రామాల్లో వారు ఉత్సవ విగ్రహాల్లా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు కూడా ఎంపీటీసీలను చిన్న చూపు చూస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు రూ.5 వేలకు పెంచి గుర్తింపులు ఇచ్చారని గుర్తుచేశారు. ఎంపీటీసీల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని అన్నారు. కొన్ని సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వెళ్లగా వాటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. మండల పరిషత్‌ నుంచి వస్తున్న నిధులకు పంచాయతీల తీర్మానం లేకుండా ఎంపీటీసీల తీర్మానంతో గ్రామాల అభివృద్ధికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ రాజ్‌ చాంబర్‌ గౌరవాధ్యక్షుడు పుసులూరి నరేంద్ర మాట్లాడుతూ ఎంపీటీసీల సమస్యల పరిష్కారానికి సంఘం ముందుండి పని చేస్తోందని అన్నారు. సంఘం బాధ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అశోక్‌రావు, సామినేని హరిప్రసాద్‌, కార్యదర్శి వెంకట్‌, బెల్లం శ్రీను, కంకనాల సౌభాగ్యం, పూర్ణయ్య, ఆరెం వరలక్ష్మీ, బీరవల్లి రఘు, వజ్జ రమ్య, బోడా మంగిలాల్‌, పగట్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


logo