ఆదివారం 29 మార్చి 2020
Khammam - Jan 12, 2020 , 02:19:17

పండుగ పయనం..

పండుగ పయనం..
  • -ప్రయాణికులతో కిక్కిరిస్తున్న ఆర్టీసీ బస్టాండ్లు..
  • -రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సుల ఏర్పాటు
  • -సంక్రాంతి సెలవులతో ఇంటి బాట పట్టిన హాస్టల్‌ విద్యార్థులు..


(ఖమ్మం కమాన్‌బజార్‌)సంక్రాంతి పండుగకు ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వంతో విద్యార్థులు అధిక సంఖ్యలో ఇళ్లకు బయలుదేరారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయాణాలు కూడా మొదలయ్యాయి. ప్రైవేటు సెక్టారు ఉద్యోగుల ప్రయాణాలు మొదలవుతున్నాయి. దీంతో శనివారం నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ఉమ్మడి ఖమ్మం రీజియన్‌ పరిధిలో ఉన్న సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, మధిర, ఖమ్మం డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఖమ్మానికి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం జిల్లాకు రావడానికి ప్రయాణికుల రద్దీ శనివారం రాత్రి నుంచి ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్లిన బస్సులు హైదరాబాద్‌ నుంచి బస్సులు నిండుగా ఖమ్మానికి చేరుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సులు దొరక్క కొంతమంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు జిల్లా కేంద్రంలో ఉండి బస్సుల రాకపోకలను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి బస్టాండ్‌లలో ప్రయాణికులను ఎప్పటికప్పుడు వారివారి బస్సులను ఎక్కించేందుకు ఆర్టీసీ సిబ్బంది సహాయ పడుతున్నారు.

ప్రత్యేక బస్సులు..

సంక్రాంతి పండుగ సెలవులు దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఎక్కువగా రద్దీ ఎక్కువగా ఉందని ఆర్టీసీ అధికారులు ప్రణాళికబద్ధంగా అధికారులను ఆయా స్థానాలకు కేటాయించారు. ఎంజీబీఎస్‌లో ఉంటూ జిల్లా బస్సులను ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో ప్యాసింజర్‌ గైడ్లను ఏర్పాటు చేసి ఖమ్మానికి వచ్చే ప్రయాణికులను ఆయా బస్సుల్లో ఎక్కించేందుకు ఆర్టీసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పండుగను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించుకుని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రయాణికులే పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో రిజర్వేషన్‌ సౌకర్యాలు కల్పిస్తూ బస్సు సమయవేళలు, సర్వీసు నెంబర్లను ప్రయాణికులకు అర్థమయ్యే విధంగా బస్సుల ముందు భాగంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా స్థానాల్లో కేటాయించిన అధికారులు ఈ నెల 14 వరకు అక్కడే ఉంటూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నారు.   

శనివారం రోజున ఖమ్మం నుంచి వివిధ ప్రాంతాలకు, వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మానికి సుమారు 15 వేల నుంచి 18 వేల వరకు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొనసాగించారని. సోమ, మంగళవారాలలో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పండుగ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 725 బస్సులను నడుపుతున్నారు. ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనవు చార్జీలను వసూలు చేస్తున్నారు. పండుగ మరుసటి రోజు నుంచి అంటే ఈ నెల 16 నుంచి 21 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6 డిపోల పరిధిలోని 745 బస్సులను వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు నడుపనున్నారు.

బస్సుల వివరాలు ఇలా..

ఆర్టీసీ బస్సులు ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు రెగ్యులర్‌గా వెళ్లేవి 123.
అదనంగా శనివారం రోజు 40.
ఆదివారం రోజున 50 ప్రత్యేకంగా బస్సులు.


logo