e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home ఖమ్మం ఇంటింటి జ్వర సర్వేను కొనసాగిస్తాం

ఇంటింటి జ్వర సర్వేను కొనసాగిస్తాం

ఇంటింటి జ్వర సర్వేను కొనసాగిస్తాం

కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు
భద్రాద్రి జిల్లాకు జిల్లాకు మెడికల్‌ కాలేజీ రావడం హర్షనీయం
ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, అధిక ఫీజులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
భద్రాచలంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌, మధిరలో కొవిడ్‌, ఐసోలేషన్‌ కేంద్రాలు ప్రారంభం
భద్రాచలం, కొత్తగూడెం అధికారులతో మంత్రి సమీక్ష

కొత్తగూడెం, భద్రాచలం, మధిర రూరల్‌, మే 18:‘కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిసున్నాం.. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వేను కొనసాగిస్తాం. భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 13 వేల కిలో లీటర్ల ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా.. సీఎం కేసీఆర్‌ రాష్ర్టానికి ఆరు మెడికల్‌ కాలేజీలను మంజూరు చేశారు.. అందులో భద్రాద్రి జిల్లాకు చోటు దక్కడం అభినందనీయమని” రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో హై పవర్‌ కమిటీ సమావేశంలో కొవిడ్‌ పరిస్థితులపై సమీక్షించారు. కొత్తగూడెంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావుతో కలిసి సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో ఐసొలేషన్‌ వార్డును ప్రారంభించారు.

భద్రాచలం, మే 18: భద్రాద్రి జిల్లాలో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం భద్రాచలం వచ్చిన ఆయన.. ఏరియా ఆసుపత్రిలో ఆక్సీజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తరువాత సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో హై పవర్‌ కమిటీ సమావేశంలో కొవిడ్‌ పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ చికిత్సలకు అనుమతి పొందిన 21 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సీజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల వినియోగం, ఫీజుల వసూళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని వైద్యాధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్సలో ఏమైనా ఇబ్బందులుంటే తక్షణం కంట్రోల్‌ రూంకు సమాచారం అందించాలన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత లేకుండా ప్రభుత్వం విరివిగా సరఫరా చేస్తోందన్నారు. 6 డోసుల ఇంజెక్షన్లకు రూ.20,400కే విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటి జ్వర సర్వేలో 7041 మందికి కిట్లు పంపిణీ చేశామని, మరో 7వేల కిట్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వైరస్‌ నియంత్రణలోకి వచ్చే వరకు సర్వేను కొనసాగించాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. జిల్లాలో వైద్య సేవలు, నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. సింగరేణి ఆసుపత్రిలో ఆక్సీజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటుతోపాటు వైద్య సేవలు వినియోగించుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నియంత్రణలో, బాధితులకు వైద్యసేవల్లో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సేవలను కొనియాడారు. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు 1,16,214 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, వారిలో 10,794 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అన్నారు. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట ఆసుపత్రులతోపాటు జనాభా అధికంగా ఉన్న మేజర్‌ పంచాయతీల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు.

పల్లెల్లోనూ మెరుగైన వైద్యం
భద్రాచలం ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లోనూ కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని మంత్రి అజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 13 వేల కిలో లీటర్ల ఆక్సీజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. భద్రాచలంలో అద్భుతమైన ఆసుపత్రి ఉందని, 200 బెడ్లతో ఉన్న ఏరియా ఆసుపత్రికి 13వేల కిలో లీటర్ల ఆక్సీజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను, లిక్విడ్‌ ఆక్సీజన్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చే శామన్నారు. సెంట్రల్‌ ఆక్సీజన్‌ ద్వారా అన్ని బెడ్లకూ ఆక్సీజన్‌ కనెక్షన్‌ ఇచ్చినట్లు చెప్పారు. ఇంకా మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

ఆక్సీజన్‌ ప్లాంట్‌ ప్రారంభం
భద్రాద్రి జిల్లాకు ఆక్సీజన్‌ కష్టాలు తీరిపోయాయని మంత్రి అజయ్‌ అన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 13 వేల కిలో లీటర్ల ఆక్సీజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరియా వైద్యశాలలో ఇప్పటికే 100 ఆక్సీజన్‌ సిలిండర్లతో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. అలాగే నిమిషానికి 300 కిలో లీటర్ల ఆక్సీజన్‌ను తయారు చేసే జనరేటర్‌ ఇప్పటికే వినియోగంలో ఉందన్నారు. అదనంగా తాజాగా 13 వేల కిలో లీటర్ల లిక్విడ్‌ ఆక్సీజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భద్రాచలం ఏరియా వైద్యశాలలోని ఐసోలేషన్‌ వార్డులో 140 మందికి ఒకేసారి చికిత్స అందించేలా ఏర్పాట్లు ఉన్నాయమన్నారు. అనంతరం ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. ఆత్మైస్థెర్యం కల్పించారు. భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి, ఐటీడీఏ పీఓ గౌతమ్‌ పోట్రు, అదనపు కలెక్టర్‌ అనుదీప్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శిరీష, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, ఔషధ నియంత్రణ అధికారి బాలకృష్ణ, జడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్‌డీఓ మధుసూదనరాజు, భద్రాచలం ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ సుమన్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంటింటి జ్వర సర్వేను కొనసాగిస్తాం

ట్రెండింగ్‌

Advertisement