నగరంలో వీధి కుక్కలకు నిత్యం ఆహారం అందిస్తున్న శ్రీనివాస్
అతడు ఏ వీధిలో కన్పించినా ఆప్యాయంగా దగ్గరికొస్తున్న గ్రామ సింహాలు
ఖమ్మం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూగజీవాల పట్ల ఆయన ప్రేమ అపురూపం. తాను ఒకపూట తిన్నా, తినకపోయినా తన కోసం ఎదురూ చూసే వీధి కుక్కులకు మాత్రం కడుపు నింపకుండా ఉండడు. తనకు ఆకలైనట్లే వాటికీ ఆకలవుతుందని భావించే ఈ జంతు ప్రేమికుడే ఇతడు. ఖమ్మం నగరంలో ఉన్న వీధి కుక్కలకు పెద్ద దిక్కుగా నిలిచాడు. ఆయన కనబడితే చాలు.. ఏ వీధిలో ఉన్న శునకమైనా సరే ఎదురుగా వచ్చి వాలాల్సిందే. ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న బెజ్జంకి శ్రీనివాస్‌కు జంతువులంటే ప్రేమ. విశ్వాసానికి ప్రతీకగా భావించే కుక్కల పట్ల ఆయన గల ప్రేమ అంతా ఇంతా కాదు. చేసేది చిన్న వ్యాపారమే అయిన ఒక్కోసారి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోయినా వీధి కుక్కలకు ఆహ్వారం అందించడానికి ఏ మాత్రం వెనుకాడడు. తొలినాళ్లలో తన ఇంటి ముందుకు వచ్చే ఒకటి, రెండు కుక్కలు ఆకలితో అల్లాడుతుండడాన్ని గమనించిన ఆయన.. తన ఇంట్లో ఉన్న అన్నం తెచ్చి పెట్టేవాడు. అలా ప్రారంభమైన అలవాటు.. వందలాది కుక్కలకు కడుపు నింపేలా చేసింది. ఏ వీధిలో కుక్కలు ఉన్నా వాటి బాగోగులు చూడడం శ్రీనివాస్‌కు నాలుగేళ్లుగా అలవడింది.
రోజూ ఏదో ఒక వీధిలో కుక్కలతో కాలక్షేపం చేస్తాడు శ్రీనివాస్. ఎవరూ పట్టించుకోని వీధి కుక్కలకు అన్ని తానవుతాడు. వాటి ఆరోగ్యాన్ని పరిశీలించడం, గాయపడిన వాటికి కట్టుకట్టడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం, అయింట్మెంట్ రాయడం వంటివి శ్రీనివాస్ జీవితంలో భాగం. నగరంలోని పటేల్ స్టేడియం, కవిరాజ్‌నగర్, బ్యాంకు కాలనీ, వీడీవోస్ కాలనీ, ఖానాపురం, కరెంట్ ఆఫీస్, రోటరీనగర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, బుర్హాన్‌పురం, డిగ్రీ కళాశాల ప్రాంతాల్లో ఉండే వీధి కుక్కలు శ్రీనివాస్‌కు ఆత్మీయ నేస్తాలు. ఈ ప్రాంతాల్లోని వీధి కుక్కలకు రోజుకు మూడుసార్లు ఇంట్లో తానే స్వయంగా ఆహారం తయారు చేసి అందిస్తాడు. అవి ఆహారాన్ని తింటున్నంత సేపూ వాటి తల నిరుముతూ ఆప్యాయత చూపిస్తాడు. వాటికి ఏమైనా చర్మవ్యాధుల ఉన్నాయేమో గమనిస్తాడు. అవసరం అనుకుంటే పశువైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు. బ్లడ్ క్యాన్సన్ ఉన్న కుక్కకు, గాయపడిన కుక్కలకు సకాలంలో వైద్యం చేయించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కుక్కల అలవాట్లు, అభిరుచులపై శ్రీనివాస్ ఉన్న అవగహన అంతాఇంకా కాదు. కొన్ని కుక్కలు పప్పుతోపాటు ఇతర శాకాహారంతో తయారు చేసిన ఆహారాన్ని ఈ కుక్కలు అసలు మట్టుకోవు. మాంసాహారాన్ని మాత్రం ఇష్టంగా లాగించేస్తాయి.
హోటళ్లు, రెస్టారెంట్ల సమీపంలో ఉండే వీధి కుక్కలు అధికంగా శాకాహారాన్ని ఇష్టపడవంటాడు శ్రీనివాస్. అయితే నగరంలోని మరికొంత మంది కూడా శ్రీనివాస్‌కు సహకరిస్తూ తమవంతు సహయాన్ని అందిస్తున్నారు. ప్రతి పూట 5 కేజీల బియ్యాన్ని అన్నంగా వండి వీధి కుక్కలకు పెట్టడం దీనచర్యగా మార్చుకున్నాడు. శ్రీనివాస్ ఏదైనా పనిమీద ఏ ఊరు వెళ్లినా ఎంత రాత్రికైనా తిరిగి వస్తాడు. కుక్కలు ఆకలితో తనకోసం ఎదురు చూస్తాయన్న కారణంతో వెంటనే తిరుగుపయనమవుతాడు. ప్రతి రోజూ శాకాహారం పెట్టే శ్రీనివాస్.. ఆదివారం మాత్రం వీధి కుక్కలన్నింటికీ మాంసహారం అందిస్తుంటాడు. వీధి కుక్కల సంతానొత్పత్తి వల్ల వాటి సంఖ్య పెరుగుతోందని, వాటి సంరక్షణ పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తాడు శ్రీనివాస్. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని నిరంతరాయంగా ఆయన చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. నగరంలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వీరివీరిగా జరుగుతున్నాయి. వీధి కుక్కల సంరక్షణ కోసం శ్రీనివాస్ ఒక స్వచ్ఛంద సంస్థను సైతం రిజిస్ట్రర్ చేయించాడు శ్రీనివాస్.