e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home ఖమ్మం అన్నదాత సాగుబాట

అన్నదాత సాగుబాట

అన్నదాత సాగుబాట

ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా వ్యవసాయ పనులు
కర్షకుల చేతికి అందిన పెట్టుబడి సొమ్ము
విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు
ఖమ్మం జిల్లాలో 5,96,149, భద్రాద్రిలో 4,61,850 ఎకరాల్లో సాగు

ఖమ్మం వ్యవసాయం, జూలై 16 : వారం రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు, చెక్‌డ్యాంలకు జలకళ సంతరించుకున్నది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. సాగు కోసం పెట్టుబడి డబ్బులు చేతికి అందడం.. అనువైన వర్షాలు కురువడంతో కర్షకులు రెట్టింపు ఉత్సాహంతో పొలంబాట పట్టారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి రావడంతో సంబురంగా సాగులోకి దిగారు. ఈ ఏడాది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5,96,149 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4,61,850 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేశారు. ఈసారి రైతులు వరి సాగును తగ్గించి ఇతర పంటలను పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గడిచిన వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పొలం పనులను ముమ్మరం చేశారు. జూన్‌ ఆరంభంలోనే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా తొలుత ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. వారం రోజుల వ్యవధిలోనే విస్తారంగా వర్షాలు కురవడంతో వానకాలం సాగుకు అన్నదాతలు శ్రీకారం చుట్టారు. పంటల సాగు ప్రారంభం అవుతుండడంతో ఏటా సాగు రైతులకు అందించే రైతుబంధు పథకం సొమ్మును కేవలం పది రోజుల్లోనే 3 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో సాగు పనులను రైతులు ప్రారంభించారు. నకిలీలల బారిన రైతులు పడకుండా ఉండేందుకు పెద్దఎత్తున సర్కార్‌ చర్యలు చేపట్టింది. అంతేకాదు, విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులోకి రావడంతో సంబురంగా సాగు లోకిదిగారు.

- Advertisement -

38.13 శాతానికి చేరిన వానకాలం సాగు
వానాకాలం సాగుకు సంబంధించి నేటి వరకు 38శాతం సాగు జరిగినట్లు జిల్లా వ్యవసాయశాఖ గణంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే కొంత మేర ఎక్కువగానే సాగైంది. జిల్లాలో పత్తి, వరి సాగు మాత్రమే ప్రధాన పంటలుగా సాగవుతున్నది. ఏటా జూలైలో పత్తి సాగు శరవేగంగా జరుగుతున్నది. వరినాట్లు ఆగస్టులో ఊపందుకోనున్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 5,96,149 ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నేటి వరకు 2, 28,387 లక్షల ఎకరాల్లో సాగు పనులు ప్రారంభమయ్యాయి. మరో 85,046 ఎకరాల్లో వరిసాగు రైతులు నారుమళ్లు పోసుకొని నాట్లు వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వరినాట్లు 25,667 ఎకరాల్లో పూర్తి అయ్యాయి. చిరుధాన్యాలకు సంబంధించి 565 ఎకరాలు, అపరాల సాగు మరో 20,015 ఎకరాలు సాగైంది. పత్తిసాగు రికార్డు స్థాయిలో నేటి వరకు 1,79, 993 ఎకరాల్లో సాగైంది. చెరకు 1,965 ఎకరాలు, ఇతర పంటలు మరో 18వేల ఎకరాల్లో సాగు చేశారు.

అదునుకు అందిన సర్కార్‌ పంటల పెట్టుబడి
ఏటా పెట్టుబడికి అందించే రైతుబంధు పథకం సొమ్ము సకాలంలో రైతులకు అందడంతో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సారి సీఎం కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. కేవలం పదిరోజుల్లోనే లక్షలాది మంది రైతుల అకౌంట్లో సొమ్ము జమ అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.354.57 కోట్లు, 3,09 254 మంది రైతులకు అందజేశారు. జూన్‌ నెల 10 నుంచి 25వ తేదీ వరకు అర్హత కలిగిన ప్రతి రైతుకు అందించారు. సీజన్‌కు ముందుగానే సొమ్ము చేతికి రావడంతో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కలిగింది.

గ్రామాల్లోనే విత్తనాల పంపిణీ..
రైతులకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేయడం, ఆయా గ్రామాల్లోనే అందుబాటులో ఉంచడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సీజన్‌కు నెల రోజుల ముందుగానే జిల్లా వ్యవసాయశాఖ అవసరమైన విత్తనాలకు సంబంధించిన ఇండెంట్‌ను తెలంగాణ విత్తన కార్పొరేషన్‌కు పంపించారు. పత్తి, మిర్చి విత్తనాలకు సంబంధించి ఆయా కంపెనీలకు ఇండెంట్‌ను చేరవేశారు. టీ సీడ్స్‌ కార్పొరేషన్‌ జిల్లావ్యాప్తంగా ఉన్నటు వంటి 74 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మరో 20 రైతు సేవా కేంద్రాల ద్వారా వరి, పెసర, కంది తదితర విత్తనాలతోపాటు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేస్తారు. పత్తి, మిర్చి విత్తనాల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పోలీస్‌, వ్యవసాయశాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. రైతులు నకిలీల బారినపడకుండా, నిరంతరం నిఘా పెట్టడంతో నాణ్యమైన విత్తనాల సాగు జరిగింది.

సాధారణం మించి వర్షపాతం నమోదు
వానకాలం సీజన్‌ జూన్‌ ఆరంభం నుంచి ప్రారంభం అవుతుంది. జూన్‌ 1వ తేదీ నుంచి కురిసిన వర్షాలను పరిగణంలోకి తీసుకుంటే నేటి వరకు సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నేటి వరకు సాధారణంగా జిల్లా సరాసరి 189 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాలి. నేటి వరకు 375.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 188 మిల్లీ మీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 105 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా.. 160.3 మి.మీ, జూలైలో కలిపి 272 మి.మీ నమోదు కావాల్సి ఉండగా.. నేటి వరకు 215 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ సారి మొత్తం 24 రోజులపాటు వర్షాలు కురవడంతో నేటి వరకు సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం రూరల్‌ మండలంలో 531 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

అందుబాటులో ఎరువులు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సుమారు 6లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటల సాగు కావొచ్చనే ఉద్దేశంతో మందు కట్టలు (ఎరువులు) కొరత రాకుండా వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సారి వానకాలం సీజన్‌ (ఏప్రిల్‌-సెప్టెంబర్‌ వరకు) నెలల వారీగా ఆయా రిటైల్‌ కేంద్రాలకు ఎరువులను తరలించేలా కార్యాచరణ తయారు చేశారు. వానకాలం సీజన్‌కు అన్ని రకాల ఎరువులు కలిపి 2,86,740 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించి జిల్లాకు నేటి వరకు యూరియా, డీఏపీ, ఇతర ఎరువులు కలిపి 39,986 మెట్రిక్‌ టన్నుల దిగుమతి చేసుకున్నారు. మార్క్‌ఫెడ్‌, రైతు సేవాకేంద్రాలు, ఇతర ప్రైవేట్‌ ఎరువుల డీలర్ల ద్వారా రైతులకు 16,667 టన్నుల ఎరువులను సాగు రైతులకు పంపిణీ చేశారు.
జోరుగా వ్యవసాయ పనులు
గడిచిన నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన సాగు రైతులు మిర్చి, వరినారు మడులు పోసుకునే ప్రక్రియ చేపట్టారు. సత్తుపల్లి డివిజన్‌లోని ఆయా మండలాలకు చెందిన రైతులు పొలాలను దమ్ము చేసుకొని వరినాట్లు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పత్తి విత్తనాలను నాటుకున్న పాలేరు, వైరా, మధిర డివిజన్‌ ప్రాంత రైతులు చేలల్లో పాటు చేసుకునే పనిలో ఉన్నారు.

నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు
సాగు రైతులకు అవగాహన, సాగులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఏ ఒక్క రైతుకు విత్తనాలు, ఎరువుల కొరత రావొద్దనేది ప్రభుత్వ ధ్యేయం. ప్రస్తుతం అపరాల సాగు పనులు పూర్తి కావొస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే మిర్చితోటలు, వరినాట్ల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. పత్తిపంటను ఆశించే గులాబి పురుగు ఉధృత్తికి అడ్డుకట్ట వేసేందుకు రైతులకు, ఏఈవోలకు అవగాహన కల్పిస్తున్నాం.
-ఎం.విజయనిర్మల (జిల్లా వ్యవసాయశాఖ అధికారి)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నదాత సాగుబాట
అన్నదాత సాగుబాట
అన్నదాత సాగుబాట

ట్రెండింగ్‌

Advertisement