e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఖమ్మం మాటే లక్ష్మణ రేఖ

మాటే లక్ష్మణ రేఖ

మాటే లక్ష్మణ రేఖ

గడపదాటని గూడెంవాసులు
యంత్రాంగం పర్యవేక్షణ లేకుండానే కరోనా కట్టడి
గ్రామపెద్దల మాటే వారికి వేదవాక్కు..

కొత్తగూడెం, మే 16: అది అతి చిన్న గిరిజన గూడెమే.. చూడడానికి ఒక మారుమూల పల్లే.. కానీ ‘కరోనా’ చైతన్యంలో మాత్రం ముందంజలో నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతునిస్తూ గడప దాటడం లేదు గ్రామస్తులు.. గ్రామంలో కొవిడ్‌కు స్థానం ఉండకూడదని పనులకు సైతం వెళ్లడం లేదు.. పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దల మాటను జవ దాటకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు.. అనాది నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.. మరి కరోనా కట్టడికి గ్రామస్తులు పాటిస్తున్న నియమాలు ఏమిటో తెలుసుకుందామా..!

లక్ష్మీదేవిపల్లి మండలంలో అది ఒక మారుమూల గిరిజన గూడెం. పేరు గట్టుమళ్ల. గూడెంలో 350 కుటుంబాల నివాసం. ఊరి పెద్దలు ఒక కట్టుబాటు పెట్టారంటే ఇక ఆ నిర్ణయానికి తిరుగుండదు. గూడెం ప్రజలంతా కట్టుబాటుకు కట్టుబడి ఉంటారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి విదితమే. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ కలిపి ఇప్పటివరకు ఒకటి, అర కొవిడ్‌ కేసులు తప్ప పెద్దగా ఏమీ నమోదు కాలేదు. కరోనా బారిన పడిన వారూ బయట ఉద్యోగం చేసే వారే కావడం గమనార్హం. ఇక మిగిలిన వారంతా లాక్‌డౌన్‌ను పాటిస్తుండడంతో కొత్త కేసులేవీ నమోదు కావడం లేదు.

ఎవరి పర్యవేక్షణా లేకుండానే..
అంతటా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి విదితమే. అప్పటి నుంచి ఒక్క పోలీసూ గూడేనికి వెళ్లలేదు. పోలీస్‌ బండి హారన్‌ మోగలేదు. అధికారుల పర్యటనల్లేవు. పర్యవేక్షణలు లేవు. చెక్‌పోస్టులు లేవు. మందలింపులు లేవు. గూడెంవాసులు ఎవరూ అధికారులతో చెప్పించుకోలేదు. ‘బంద్‌ చేయండి.. గ్రామపెద్దలు, పంచాయతీ పాలకవర్గం నిర్ణయించిన నియమాలకు తొలి నుంచి ఇదే గౌరవం ఇస్తారు గూడెంవాసులు. పోలీసులు విధించే జరిమానాల జాబితాలో ఈ గూడెంవాసుల పేరే ఉండదు.

స్వచ్ఛందంగా అమలు..
అందరూ ఇంటికే పరిమితం అవుతున్నారంటే బలవంతంగా ఉంటున్నారనుకుంటే పొరపాటే. గూడెంవాసులంతా స్వచ్ఛందంగా నియమాలు పాటిస్తారు. ఎవరూ వీరిపై జులుం చేయరు. బలప్రయోగం చేయరు. నిర్బంధమేమీ లేదు. కొన్ని పనులకు వెసులుబాటు ఉన్నప్పటికీ గ్రామస్తులంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే కొన్నిరోజులు ఇలా ఉండాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌నున ఎత్తివేస్తే తప్ప తిరిగి పనులకు వెళ్లమని వారికి వారే తీర్మానించుకున్నారు. గూడెంలో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారే ఎ క్కువ. కరోనా నేపథ్యంలో ఒక్కరూ కూడా కూలికి వెళ్లడం లేదు. ఆ తర్వాత సమీప బస్తీల్లో తాపీ పని చేసే వారు, ఇతర పనులు చేసే వారుంటారు. వీరంతా ఇంటికే పరిమితమవుతున్నారు.

నిత్యావసరాలకు మాత్రమే బయటకు..
రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు గ్రామస్తులు. నిత్యావసర సరుకులను స్థానిక దుకాణాల్లోనే కొనుగోలు చేస్తారు. గ్రామంలో దొరికే కూరగాయలు, తినుబండారాలనే తింటారు. ఇక 10 గంటల తర్వాత బయట ఎవరూ కనిపించరు. ద్విచక్రవాహనంపై ఏ పనీ లేకుండా బయట తిరిగే వారు కనిపించరు. ఇరుగింటి వారు పొరుగింటి వారితో కలిసి ముచ్చట్లు పెట్టుకునే సన్నివేశాలేవీ కనిపించవు.

ఉదయం మాత్రమే కొనుగోళ్లు..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేమంతా పక్కాగా లాక్‌డౌన్‌ నియమాలను పాటిస్తున్నాం. గ్రామం నుంచి ఎవరూ పనులకు వెళ్లడం లేదు. అందరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. పంచాయతీ వారు చెప్పిన విధంగా నడుచుకుంటున్నాం. పొద్దున మాత్రమే షాపులు తెరిచి ఉంటున్నాయి. ఆ సమయంలోనే బయటకు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నాం.

  • కేపరి ఆదినారాయణ, గ్రామస్తుడు, గట్టుమళ్ల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాటే లక్ష్మణ రేఖ

ట్రెండింగ్‌

Advertisement