e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home ఖమ్మం సహకార సంఘాలకు మహర్దశ

సహకార సంఘాలకు మహర్దశ

సహకార సంఘాలకు మహర్దశ

బహుళ సేవా కేంద్రాలుగా మారనున్న పీఏసీఎస్‌లు
ఒక్కో సంఘానికి రూ.2 కోట్ల రుణం ఇవ్వనున్న నాబార్డ్‌
జిల్లాలో ఏర్పాటుకానున్న అగ్రి అవుట్‌లెట్స్‌

ఖమ్మం, జూలై 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సహకార సంఘాలకు మహర్దశ పట్టనున్నది. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేయడంతోపాటు రైతులకు మరిన్ని సేవలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. గోదాముల నిర్మాణం, మినీ రైస్‌మిల్లులు, సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, కట్టె కోతమిషన్లు, మినీ దాల్‌మిల్లులు, వేబ్రిడ్జిలు, వ్యవసాయ అనుబంధ పరికరాలు, మిషన్లు వంటి వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నది. ఇందుకోసం ఆర్థిక తోడ్పాటు అందించేందుకు నాబార్డు ముందుకొచ్చింది. ఎంపిక చేసిన సంఘాలకు నాబార్డ్‌ అతితక్కువ వడ్డీతో రూ.2 కోట్ల్ల రుణం ఇవ్వనున్నది. టెస్కాబ్‌, డీసీసీబీ పర్యవేక్షణలో రుణాలను పంపిణీ చేయనుంది. ఈ రుణాలతో జిల్లాలో అగ్రి అవుట్‌ లెట్స్‌ ఏర్పాటు కానున్నాయి.

రైతులకు మెరుగైన సేవలందించడంతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలో పౌర సేవలందించేందుకు ప్రత్యేకంగా ప్రాథమిక సహకార సంఘాలను గుర్తించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు వ్యాపారాలు నిర్వహించుకోవడం ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. నాబార్డు సహకార సంఘాలకు రుణాలు ఇవ్వడానికి అంగీకరించింది. ఎంపిక చేసిన సహకార సంఘాలకు నాబార్డు రూ.2 కోట్లు అతితక్కువ వడ్డీతో వ్యాపార రుణం ఇవ్వనున్నది. నాబార్డు మంజూరు చేసిన రుణాలను రైతులకు ఉపయోగపడేలా ఎరువులు, పురుగు మందుల దుకాణాలు, గోదాములను నిర్మించేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. ప్రాథమిక సహకార సంఘాలకు సొంత స్థలం ఉండి గోదాములు నిర్మించడానికి అవకాశం ఉన్నవారికి తక్షణం రుణాలు మంజూరు చేయడానికి నాబార్డు అంగీకరించింది. ఖమ్మం జిల్లాలో 28 ప్రాథమిక సహకార సంఘాలను ఈ తరహా వ్యాపారాలను నిర్వహించేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రతిపాదనలు పంపించగా.. నాబార్డు ఆమోదించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు ప్రాథమిక సహకార సంఘాలకు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఉండి ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో ఉన్న రెండు ప్రాథమిక సహకార సంఘాలకు రుణాలు అందించేందుకు నాబార్డు సంసిద్ధత వ్యక్తం చేసింది.

- Advertisement -

ఇవీ ఏర్పాటు చేయవచ్చు..
ఆయా ప్రాథమిక సహకార సంఘాలు నాబార్డు ఇచ్చిన రుణాలతో గోదాముల నిర్మాణం, మినీ రైస్‌మిల్లులు, సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌బంకులు, కోతమిషన్లు, కట్టె కోతమిషన్లు, మినీ దాల్‌మిల్లులు, వేబ్రిడ్జిలు, వ్యవసాయ అనుబంధ పరికరాల, అనుబంధ మిషన్లు వంటి వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. దీని ద్వారా సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు నాబార్డు ఇచ్చిన రుణాన్ని తక్కువ వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. ఆయా సంఘాలు నిర్వహించే వ్యాపారాల నిర్వహణ, గోదాముల నిర్మాణం వంటి పనులను పర్యవేక్షించేందుకు ప్రాథమిక సహకార సంఘం ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. పీఏసీఎస్‌ అధ్యక్షుడు, సీఈవో, ఒక డైరెక్టర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉండి వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించనున్నారు. ప్రాథమిక సహకార సంఘాలు నాబార్డు నుంచి తీసుకున్న రుణాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తే తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీలో రాయితీ సైతం ఇవ్వాలని సంకల్పించింది. దీంతో ప్రాథమిక సహకార సంఘాలకు అతితక్కువ వడ్డీతో రుణాలు లభించనున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఆయా ప్రాథమిక సహకార సంఘాలు నిర్వహించే వ్యాపార, వాణిజ్య లావాదేవీలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. రైతులకు కావాల్సిన అన్నిరకాల ఎరువులు, పురుగు మందులు, ఇతర సామగ్రి సహకార సంఘాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో రైతులు వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ యంత్ర సామగ్రి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సొసైటీలోనే నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. ప్రాథమిక సహకార సంఘాలకు నాబార్డు ఇచ్చే రుణానికి సంబంధించి టెస్కాబ్‌, డీసీసీబీల పర్యవేక్షణలో రుణాలను పంపిణీ చేయనుంది.

అగ్రి అవుట్‌ లెట్స్‌ నిర్వహణకు ప్రణాళికలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల లావాదేవీలు, పారదర్శకత, ప్రగతి నివేదిక ఆధారంగా సంఘాలను నాబార్డు ఎంపిక చేసింది. రుణ చెల్లింపులో డీఫాల్ట్‌ కాని సంఘాలకు తమ పనితీరు ద్వారా నాణ్యమైన సేవలు అందించి సురక్షిత ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సహకార సంఘాలకు రుణాల మంజూరులో తొలి ప్రాధాన్యమిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల పనితీరు, బ్యాంకులకు చెల్లించే రుణాలకు సంబంధించి గ్రేడులుగా విభజించి మొదటి, రెండో గ్రేడ్‌లో ఉన్నవారికి రుణాలను పంపిణీ చేసింది. నాబార్డు ఇచ్చే రుణంతో అనేక ప్రాథమిక సహకార సంఘాలు అగ్రి అవుట్‌లెట్స్‌ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సహకార సంఘాలకు మహర్దశ
సహకార సంఘాలకు మహర్దశ
సహకార సంఘాలకు మహర్దశ

ట్రెండింగ్‌

Advertisement