e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home ఖమ్మం పండుగ వేళ పరేషాన్‌

పండుగ వేళ పరేషాన్‌

  • గుదిబండగా మారిన ‘గ్యాస్‌బండ’
  • భగ్గుమంటున్న పెట్రోల్‌ ధరలు
  • ప్రజలకు దసరా ‘ధరా’ఘాతం
  • కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి

కొత్తగూడెం, అక్టోబర్‌ 13: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు, ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన ఆరు నెలల్లో డీజిల్‌పై రూ.13.40 పెరిగింది. ఈ ఏడాది మార్చిలో లీటరు డీజిల్‌ రూ.87.47 కాగా.. ప్రస్తుతం రూ.100.87కు చేరింది. పెట్రోల్‌ ధర గతేడాది లీటరుకు రూ.63 కాగా.. ఇప్పుడు రూ.108.27కు చేరుకున్నది. గడిచిన 16 నెలల్లో రూ.46 పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక పెరిగిన గ్యాస్‌ ధరలు ఇంటింటా మంట పుట్టిస్తున్నాయి. ఈ నెల 6న ఒకేసారి రూ.15 పెరగడంతో సిలిండర్‌ ధర రూ.969.50కు చేరుకున్నది. దీంతో మహిళలకు మళ్లీ వంటింటి కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్‌ ధరల పోటుతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కు అంటూ నిట్టూరుస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ రంగంపై ఆధారపడి రవాణా అయ్యే అన్ని వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో కేంద్రం తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఊరి నుంచి వలస వెళ్లిన వారు, ఉద్యోగ రీత్యా వెళ్లిన వారంతా సొంతూరికి చేరుకుని పిల్లాపాపలతో జరుపుకొనే పండుగ. కానీ.. కేంద్రం పెంచిన ధరలతో పండుగ వేళ పరేషాన్‌ మొదలైంది. ఒకవైపు పెరిగిన నిత్యావసర ధరలు మరోవైపు వంట గ్యాస్‌ ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల సెగ.. ఇలా సామాన్యుడికి పెరిగిన ధరలు చుక్కలుచూపిస్తున్నాయి. అప్పులు చేసి పండుగ జరుపుకోవాలా? ఉన్నదంతా ఇప్పుడే ఖర్చు పెట్టాలా? అన్న సందిగ్ధంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. నిత్యావసరాల ధరల పెరుగుదల గతేడాది కంటే ఈ ఏడాది కిలో లేదా లీటరుకు కనిష్ఠంగా రూ.20 గరిష్ఠంగా రూ.80 వరకు పెరిగిందని ఓ అంచనా. ఇబ్బడి ముబ్బడిగా నిత్యావసరాలు, వంట గ్యాస్‌ ధరల పెంపుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అనేక సార్లు నిరసనలు వ్యక్తం చేశాయి. అయినా..కేంద్ర సర్కార్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు.

- Advertisement -

ట్రాన్స్‌పోర్ట్‌ రంగం అతలాకుతలం..
రవాణా రంగంలో అత్యంత కీలకపాత్ర పోషించేది లారీ యాజమాన్యాలు. డీజిల్‌ ధరల పెంపు, పన్నుల భారంతో యాజమాన్యాలను కుంగదీస్తున్నాయి.. పరిస్థితి ‘లారీలను రోడ్డుపై తిప్పితే మూడు లాభం.. ఆపితే ఆరు లాభం..’ అన్న చందంగా తయారైందని లారీ యజమానులు ఉసూరుమంటున్నారు. ఇవేకాక ఆటో, ట్యాక్సీ, మినీ లారీ యాజమానులదీ ఇదే పరిస్థితి. వ్యవసాయరంగానికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల సెగ తగులుతున్నది. ట్రాక్టర్‌, హార్వేస్టర్‌.. ఇలా రైతు ఏది వినియోగించుకోవాలన్నా అధికంగా అద్దెలు చెల్లించాల్సిందే.

భగ్గుమంటున్న వంట గ్యాస్‌..
గ్యాస్‌ సిలిండర్‌ ధరలు నెలనెలకూ మారుతున్నాయి. ఈ నెల 6న ఒకేసారి రూ.15 ధర పెరిగి సిలిండర్‌ ధర రూ.969.50 కు చేరుకున్నది. ఇక సబ్బిడీ అంతే సంగతి. ఒకవైపు ధరలు పెరుగుతున్నా కేంద్రం సబ్సిడీ మాత్రం పెంచడం లేదు. గతేడాది సిలిండర్‌ ధర రూ.663.50 ఉండగా ఏడాది తిరిగే లోపు రూ.306 పెరిగింది. ఈ నెల లో పెరిగిన రూ.15 ధరతో ఒక్క భద్రాద్రి జిల్లాలోనే నెల కు రూ.45లక్షల అదనపు భారం పడుతుందని ఓ అంచనా.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల సెగ..
కేంద్రం పెంచిన డీజిల్‌ ధరలతో అన్ని రంగాలు ప్రభావితమవుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో డీజిల్‌పై రూ.13.40 పెరిగింది. ఈ ఏడాది మార్చిలో లీటరు డీజిల్‌ రూ.87.47 కాగా, ఇప్పుడు రూ.100.87కు చేరింది. గతేడాది మార్చిలో డీజిల్‌ ధర రూ.67.71 ఉండగా ఏడాదిన్నరలోనే రూ.33.16 పెరిగింది. ఒక్క ఈ నెలలోనే ఆరుసార్లు ధరలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. పెట్రోల్‌ ధర గతేడాది ఒక లీటరుకు రూ.63 కాగా ఇప్పుడు రూ.108.27కు చేరుకున్నది. గడిచిన 16 నెలల్లో రూ.46 ధర పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పౌర సరఫరాలశాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో రోజుకు 7.87 లక్షల లీటర్ల పెట్రోల్‌, 12.05 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తుండగా పెరిగిన ధరలతో వాహనదారులపై అదనపు భారం పడనున్నది. ఒక్కో నెలకు డీజిల్‌పై రూ.119.70 కోట్లు, పెట్రోల్‌పై రూ.108 కోట్ల ఆదనపు భారం పడుతుందని అధికారుల అంచనా.

మారుమూల మండలం దుమ్ముగూడేనికి చెందిన రాజు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ప్రతి దసరాకు ఆయన తన సొంత కారులో ఇంటికి వస్తారు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలతో ఆయనకు ప్రయాణం భారంగా మారింది. గతేడాది లీటరుకు రూ.63 ఉండగా.. ఇప్పుడు రూ.108.27కు చేరుకోవడంతో ఈసారి పండుగ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. పెట్రోల్‌కు వెచ్చించే డబ్బులతో ఇంటి అవసరాలు తీరతాయనుకుని ఆగిపోయాయని చెబుతున్నారు రాజు..

కామేపల్లి మండలానికి చెందిన సుశీల కొన్నేళ్లపాటు కట్టెల పొయ్యి కష్టాలు అనుభవించింది. ఇటీవల వంటగ్యాస్‌ తీసుకొన్నది. పొగసూరిన బతుకులకు కాలం చెల్లిందని సంబురపడింది. కానీ, ఆమె ఆనందం ఎంతో కాలం నిలువలేదు. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర ఆమెకు గుదిబండగా మారింది. మళ్లీ కట్టెల పొయ్యిపైనే వంట చేయడం ప్రారంభించింది. కాయకష్టం చేసుకునేవాళ్లం.. గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇంతగనం పెంచితే ఎట్లా కొనేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారామె.

గ్యాస్‌సిలిండర్‌ కొనేటట్లు లేదు..
గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఒకే నెలలో రెండు, మూడు సార్లు పెరిగాయి. సిలిండర్‌ ఖాళీ అయితే సామాన్యుడి చమురు వదులుతున్నది. మోడీ ప్రభుత్వం ఇలా గ్యాస్‌ ధరలు పెంచుకుంటే పోతే మళ్లీ నిరుపేదలు కట్టెల పొయ్యి వాడతారు. గ్యాస్‌బండ మా పాలిట గుదిబండలా మారింది.

  • తన్వీర్‌ సుల్తానా, గృహిణి, కొత్తగూడెం

సంతోషంగా జరుపుకోలేం..
అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఉప్పు, పప్పు, నూనె ఇలా అన్ని ధరలకూ రెక్కలు వచ్చాయి. కూలి చేసుకొని బతికే మాలాంటి నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గుదిబండలా మారింది. కనీసం పిండి వంట చేసుకుందామన్నా సరుకులు కొనలేని పరిస్థితి.

  • మాలోత్‌ అరుణ, వికలాంగులకాలనీ, పాల్వంచ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement