e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home ఖమ్మం ఆరోగ్యానికి భరోసా

ఆరోగ్యానికి భరోసా

ఆరోగ్యానికి భరోసా

నిరుపేదలకు వరం.. డయాగ్నస్టిక్‌ సెంటర్లు
ఉమ్మడి జిల్లాలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేంద్రాలు
ఉచితంగా 57 రకాల టెస్టులు
ఖమ్మంలో 43,599, కొత్తగూడెంలో 9,600 మందికి పరీక్షలు

ఖమ్మం సిటీ జూలై 12: ఆరోగ్య తెలంగాణ దిశగా వైపు రాష్ట్రం అడుగులు వేస్తున్నది.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న సేవలపై దృష్టి సారించారు.. వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స వరకు నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి డయాగ్నస్టిక్‌ సెంటర్‌ కేటాయించారు. కొత్తగూడెం, ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.. ఖమ్మం కేంద్రంలో 57, కొత్తగూడెం కేంద్రంలో 40 రకాల పరీక్షలకు సేవలు అందుతున్నాయి. గడిచిన 30 రోజుల్లో ఉభయ జిల్లాల్లో 50 వేల మందికి బాధితులు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు..

సర్కారు దవాఖానలను సీఎం కేసీఆర్‌ బలోపేతం చేశారు. కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో అత్యాధునిక వైద్య వసతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలను నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు ఒకటి చొప్పున దేశానికే తలమానికంగా నిలిచే రీతిలో నెలకొల్పిన తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాలు నిరుపేదలకు వరంగా మారాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మంజూరైన సెంటర్లను జూన్‌ 9న మంత్రి అజయ్‌కుమార్‌ లాంఛనంగా ప్రారంభించారు. గడిచిన 30 రోజుల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ సర్కారు ఆలోచన వేలాది మంది వేతన జీవులకు వెన్నుదన్నుగా నిలిచిందని రుజువవుతోంది.

- Advertisement -

24 గంటల్లోనే ఫలితాలు..
తెలంగాణ సర్కారు ఆదేశానుసారం ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలనే సంకల్పంతో జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఖమ్మం జిల్లాను మూడు రూట్లుగా విభజించారు. మొదటి విభాగంలో వల్లభి, ముదిగొండ, నేలకొండపల్లి, బోదులబండ, కూసుమంచి, సుబ్లేడు, తిరుమలాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను చేర్చారు. రెండో రూట్లో బోనకల్లు, వైరా, కొణిజర్ల, పెద్దగోపతి, చింతకాని పీహెచ్‌సీలతోపాటు ముస్తాఫానగర్‌, శ్రీనివాసనగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. మూడో రూట్లో సింగరేణి, కామేపల్లి, మంచుకొండ, మామిళ్లగూడెం, ఎంవీ పాలెం పీహెచ్‌సీలు, నగరంలోని వెంకటేశ్వరనగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఉన్నాయి. ఈ 20 కేంద్రాలకు 377 కిలోమీటర్ల దూరాన్ని పరిగణనలోకి తీసుకొని మూడు ప్రత్యేక వాహనాలను కేటాయించారు. వాటి ద్వారా ప్రతిరోజూ ఉదయం ప్రజల నుంచి నమూనాలు సేకరించి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ హబ్‌కు తీసుకొస్తున్నారు. కేవలం 24 గంటల్లోపు వాటి ఫలితాలను సంబంధిత వ్యక్తులకు, పీహెచ్‌సీ, యూహెచ్‌సీలకు ఆన్‌లైన్‌, సెల్‌ఫోన్‌లలో పంపిస్తున్నారు.

30 రోజుల్లో 43,599 పరీక్షలు..
రోగం ఏదైనా, బాధితుడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళితే అక్కడి వైద్యులు మొదటగా రకరకాల వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ జబ్బులకు సైతం రక్త, మూత్ర పరీక్షలతోపాటు ఎక్స్‌రే, ఈసీజీ వంటివి చేయిస్తున్నారు. వాటి ఖర్చును భరించడం సామాన్య ప్రజలకు పెద్ద సవాలుగా మారింది. ఆయా పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్‌ యావత్‌ తెలంగాణ ప్రజలకు నయాపైసా ఖర్చు లేకుండా అత్యాధునిక పద్ధతుల ద్వారా 57 రకాల వైద్య పరీక్షలను నిర్వహించే మహత్తర ప్రక్రియను ప్రారంభించారు. రక్త, మూత్ర పరీక్షలతోపాటు ఎక్స్‌-రే, అల్ట్రాసౌండ్‌, ఈసీజీ వంటివి కూడా ఉన్నాయి. ఫుల్లీ ఆటోమేటిక్‌ క్లినికల్‌ కెమిస్ట్రీ అనలైజర్‌, ఫుల్లీ ఆటోమేటిక్‌ ఇమ్యూనోఅస్సే అనలైజర్‌, ఫైవ్‌పార్ట్స్‌ సెల్‌కౌంటర్‌, ఎలీసా రీడర్‌ అండ్‌ వాషర్‌, ఫుల్లీ ఆటోమేటిక్‌ యూరిన్‌ అనలైజర్‌, ఈసీజీ, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్‌, డిజిటల్‌ ఎక్స్‌-రే వంటి ఇమేజింగ్‌ పరీక్షా యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లాలో జూన్‌ 9 నుంచి నేటి వరకు 5,535 మంది రోగుల నుంచి 12,924 శాంపిల్స్‌ సేకరించారు. వివిధ రకాలు కలిపి 43,599 పరీక్షలు నిర్వహించారు. మొత్తం కలిపితే 1,40,710 పారామీటర్స్‌ కౌంట్‌ నమోదయ్యింది. కాగా.. ఆయా వైద్య పరీక్షలన్నీ తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో ఉచితంగా జరిపించడం వల్ల దాదాపు 5వేల పైచిలుకు కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అయ్యాయి.

భద్రాద్రి జిల్లాలో 9,600 మందికి..
మూడు నెలలు క్రితం ప్రారంభమైన డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో ఇప్పటి వరకు 9,600 మందికి పరీక్షలు చేశారు. దీని వల్ల వారందిరకీ కలిపి మూడు నెలలకు గాను రూ.80 లక్షలు ఆదా అయ్యాయి. సగటున ప్రతి రోజూ ప్రజలకు రూ.20 వేలు విలువ గల పరీక్షలు చేస్తున్నట్లయింది.

రోగులకు తగ్గిన ఆర్థిక భారం..
తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటుతో సామాన్య రోగులపై ఆర్థిక భారం తగ్గింది. ఎవరి చేతిలో చూసినా రక్త పరీక్షలు, ఎక్స్‌రే, స్కానింగ్‌ రిపోర్టులు తప్ప వేరేవి కనబడటం లేదు. మూడు నెలల నుంచి ప్రైవేటు టెస్టింగ్‌ సెంటర్ల వద్ద తాకిడి తగ్గింది. ఆయా పీహెచ్‌సీల వద్దనే రోగులు బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.

అద్భుతమైన సేవలు..
నిరుపేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం అద్భుతం. ఈ తరహా సేవలు దేశంలో ఎక్కడా లేవు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ స్వీయ ఆలోచన మేరకే తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. కేవలం 30 రోజుల్లో 5వేల మంది పైచిలుకు నిరుపేదలకు నయాపైసా ఖర్చు లేకుండా రకరకాల వైద్యపరీక్షలు నిర్వహించాం. మంత్రి అజయ్‌, కలెక్టర్‌ కర్ణన్‌ చొరవతో కొవిడ్‌ వైద్య పరీక్షలు కూడా చేస్తున్నాం.
-డాక్టర్‌ మాలతి, డీఎంహెచ్‌వో, ఖమ్మం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆరోగ్యానికి భరోసా
ఆరోగ్యానికి భరోసా
ఆరోగ్యానికి భరోసా

ట్రెండింగ్‌

Advertisement