గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 08, 2020 , 14:58:35

గెలుపే లక్ష్యంగా..

గెలుపే లక్ష్యంగా..

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల సంగ్రామం ప్రారంభమైంది. నేడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రెండు రోజుల క్రితం వరకు రిజర్వేషన్ల కోసం ఎదురు చూసిన వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలలో ఎన్నికల హడావిడితో వేడెక్కింది. రిజర్వేషన్లు ప్రకటించడంతో అభ్యర్థులు తామంటే తామేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మూడు మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్ తన ప్రభంజనాన్ని చూపించే అవకాశం ఉండటంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి ఇద్దరి నుంచి నలుగురు చొప్పున కార్యకర్తలు పోటీ పడుతుండటంతో ఎవరిని ఎంపిక చేయాలో నాయకులకు తలనొప్పిగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిలను నియమించిన సంగతి తెల్సిందే. శాసనసభ్యులు ఉన్నచోట వారినే బాధ్యులను చేయగా ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో వైరా మున్సిపాలిటీ బాధ్యతలను ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాములునాయక్‌కు, సత్తుపల్లి బాధ్యతలు సండ్ర వెంకటవీరయ్యకు, మధిర బాధ్యతలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజులకు అప్పగించారు. ఈ మూడు చోట్ల వార్డులకు, చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు వెల్లడి కావడంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన కార్యకర్తలు రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూడు మున్సిపాలిటీలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీల బాధ్యతలను ఆయా నియోజకవర్గ శాసనసభ్యులకు ఇచ్చినప్పటికీ మొత్తం మీద సమన్వయ బాధ్యతలను ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అప్పగించారు. దీంతో ఆయన మంగళవారం ఖమ్మం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో సన్నాహక సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు మధిర, మధ్యాహ్నం 1 గంటలకు వైరా, సాయంత్రం 4 గంటలకు సత్తుపల్లి మున్సిపాలిటీలలో సమావేశాలు జరగనున్నాయి. వీటికి మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ఆనియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

మున్సిపాలిటీలలో విస్తృత ప్రచారం..

జిల్లాలోని మూడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత నెలలోనే షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపాలిటీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పట్టణంలోని 23 వార్డులలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయా వార్డులలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించి బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికలలో అనుసరించాల్సిన పద్దతులపై కార్యకర్తలకు హితబోధ చేశారు. రిజర్వేషన్లు రాకమునుపే రెండు దఫాలుగా సత్తుపల్లి పట్టణంలో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. మరోవైపు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వైరాలోని 20 వార్డులలో కమిటీలను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న వైరా పంచాయతీతో పాటు విలీనమైన గ్రామాలలో పర్యటించి ముఖ్య కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించారు. అభ్యర్థులు ఎవరైన వారి గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధిర మున్సిపాలిటీలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు పాదయాత్ర నిర్వహిస్తూ ప్రచారం ప్రారంభించారు. మధిరలోని 22 వార్డులలో వార్డు కమిటీలను నియమించారు. ముఖ్యకార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. మంగళవారం ఈ మూడు మున్సిపాలిటీలలో నిర్వహించబోయే సన్నాహక సమావేశాలకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హాజరుకానున్నారు. దీంతో ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్యమైన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల...

జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఆయా మున్సిపల్ కమిషనర్లు మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. బుధవారం నుంచి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది. 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్ల స్క్రూట్నీ ఉంటుంది.

ఇవి జత చేయాల్సి ఉంటుంది...

-మున్సిపాలిటీలలో వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేయనున్న అభ్యర్థులు మున్సిపాలిటీలో ఓటరై ఉండాలి.
-21 సంవత్సరాలు నిండి ఉండాలి.
-ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ప్రతిపాదకులు తప్పకుండా మున్సిపాలిటీకి ఎలాంటి పన్ను బకాయిలు ఉండరాదు.
-ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ స్థానాలలో పోటీ చేయనున్న అభ్యర్థులు తప్పనిసరిగా తహసీల్దారు నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఉండాలి.
-రోజువారి ప్రచారాల ఖర్చుల కోసం తప్పని సరిగా బ్యాంకు ఖాతా ఉండాలి.
-కౌన్సిలర్‌గా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.2500 డిపాజిట్ చేయాలి.
-కౌన్సిలర్‌గా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 1250 లను డిపాజిట్ చేయాలి.
-గ్రామ జనాభా 5000ల నుంచి పైన ఉన్నట్లయితే సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్ఢు సభ్యులు అయితే రూ. 50 వేలకు మించి ఖర్చు చేయడానికి వీలులేదు.
-కౌన్సిలర్‌గా పోటీ చేసే అభ్యర్థులు రూ.1 లక్షకు మించి ఖర్చు చేయడానికి వీలులేదని ఎన్నికల నియమావళిలో ఉంది.


logo