మామిళ్లగూడెం, సెప్టెంబర్ 23: ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఆర్థికంగా వృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే దళిత బంధు పథకం ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ వర్గంలో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీ వర్గాలకు 10 శాతం, గిరిజనులకు 5 శాతం దుకాణాలు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు మంజూరు చేసే విషయంలో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేదా? అనే అంశంపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉన్నది. వైన్స్‌ల విషయంలో రిజర్వేషన్స్ పక్కాగా అమలు కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 37 బార్ అండ్ రెస్టారెంట్లు, 89 వైన్ షాపులతో ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం సమకూరుతున్నది. వీటి ద్వారా ప్రతి నెలా రూ.125 కోట్ల నుంచి రూ.140 కోట్ల వరకు ఆదాయం లభిస్తుందని ఆబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ తర్వాత పాత వైన్‌షాపులతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మరో 15- 20 మద్యం దుకాణాలకూ దరఖాస్తులను ఆహ్వానించే అవకాశం ఉన్నది. దీంతో జిల్లా నుంచి ఆదాయం మరింత పెరుగనున్నది. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న మండలాల్లో అదనపు దుకాణాలు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది.
బార్ అండ్ రెస్టారెంట్స్‌కు ట్యాక్స్‌లో రాయితీలు..
జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్లు నడుపుతున్న యాజమాన్యాలకు కొన్నినెలల పాటు లాక్డౌన్ అమలైన కారణంగా ప్రభుత్వం ట్యాక్స్‌లో కొంత మినహాయింపు ప్రకటించింది. సాధారణంగా యాజమాన్యాలు ఏటా రెన్యువల్‌కు ఫీజు రూపంలో రూ.లక్ష చెల్లిస్తాయి. ఇవికాక ఏడాదికి రూ.42 లక్షల చొప్పున ట్యాక్స్ చెల్లించాల్సి ఉన్నది. ఈమొత్తాన్ని యాజమాన్యాలు ఏడాదిలో రెండు విడతల్లో చెల్లిస్తాయి. ఆరు నెలలకు ఒకసారి రూ.21 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. కరోనా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యాలు రెన్యువల్ ఫీజును ఈనెల 30లోపు చెల్లిస్తే బార్ ఎక్సైజ్ ట్యాక్స్‌లో రూ.3.50 లక్షల రాయితీని ప్రభుత్వం కల్పించింది. బార్ అండ్ రెస్టారెంట్ల గడువు ఈ నెల 30న ముగుస్తున్న నేపథ్యంలో ట్యాక్స్‌లు చెల్లించే పనిలో యాజమాన్యాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు వైన్స్ దుకాణాలకు అక్టోబర్ 30తో గడువు ముగియనున్న నేపథ్యంలో వారు ప్రస్తుతం ఉన్న లైసెన్స్‌తోనే నవంబర్ 30 వరకు మద్యం విక్రయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.