భద్రాద్రి కొత్తగూడెం, జూలై 5 (నమస్తే తెలంగాణ) : జనం భయం అనే ఫోబియోతో పాములంటే బెంబేలెత్తుతున్నారు. నిజంగా పాములు కావాలని ఎవరినీ కరవవు. చూడకుండా వాటిమీద కాలు వేస్తే తప్ప కరిచే పరిస్థితి ఉండదు. పాములు విషప్రాణులు కాబట్టి జాగ్రత్తగా ఉండడమే శ్రేయష్కరం అంటున్నారు వైద్యనిపుణులు. ఎంతటి వ్యక్తికైనా భయం సహజం.. భయం అధికంగా ఉన్నప్పుడు ఏ వ్యాధినుంచైనా కోలుకునే అవకాశాలు తక్కువ. కరోనా సమయంలో కూడా భయంతోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అదేకోవలోనే పాము భయంతో చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పాముకాటు మరణాలు సర్వసాధారణం అయిపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చీకటి ప్రదేశాల్లో సేదతీర్చుకునే విషసర్పాలు కాటు వేసి ప్రాణాలను తీస్తున్నాయి. దీంతో ప్రతి సీజన్లో పిల్లలు, రైతులు అనేకమంది మృత్యువాత పడుతున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకోక నిండు ప్రాణాలు కోల్పోతున్నారు.
అధికశాతం విషం లేనివే…
ప్రపంచంలో న్యూజిలాండ్, ఐర్లాండ్‌లో తప్ప మిగిలిన దేశాల్లో పాములు ఉన్నాయి. ఇవి అధికంగా ఉష్ణమండల దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్పాల్లో అధికశాతం విషం లేనివే. చాలా తక్కువ శాతం మాత్రమే విష సర్పాలు. విష సర్పాల్లో ముఖ్యమైనవి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర, చిన్నపింజర ఇలాంటివి ప్రస్తుతం డేంజర్ పాములు. ఇవి నిత్యం అడవుల్లో ఉన్నప్పటికీ రానురాను అవి జనారణ్యంలోకి రావడం పుట్టల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని వానకాలం సీజన్లో పొలాలు, చేనుగట్లు, వరిగడ్డి వాములు, చెట్టు తొర్రల్లో కనబడుతున్నాయి. ఇంటి ఆవరణలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల గుబురు చెట్లమాటున ఉండి ఇండ్లలోకి చేరుతున్నాయి. చీకటిని ఆవాసంగా చేసుకొని వ్యక్తులను కాటేస్తున్నాయి.. దీంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
పాముకాటుకు ప్రథమ చికిత్స…
విషసర్పం కరిచిన ప్రదేశంలో రెండు రంధ్రాలు ఉండి రక్తం కారుతూనే ఉంటుంది. విషంలేని పాము కరిస్తే అనేక రంధ్రాలుంటాయి. కాటుకు గురైన వెంటనే అవయవం పైభాగం నీటితో తుడిస్తే సరిపోతుంది. ఎలాంటి నాటువైద్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకే మందులు తీసుకోవాలి. కరిచిన చోట గుడ్డలు కట్టడం, బ్లేడుతో రంధ్రం చేయడం చేయకూడదు. ఎలాంటి ద్రవపదార్థాలు, ఘనపదార్థాలు కూడా తీసుకోకూడదు. శ్వాసక్రియ ఆగిపోతే కృత్రిమ శ్వాస అందించాలి. ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా ఉంటే వైద్యంతో సరిపోతుంది.
మరణాలు నిల్..
జిల్లాలో పాముకాటుకు గురైన వారు 2021లో 155మంది ఉన్నారు. 2022లో ఇప్పటివరకు 54 మంది ఉన్నారు. 2021 నుంచి ఇప్పటివరకు పాముకాటుకు గురై ఎవరూ మరణించలేదు. 90శాతం పాములు విషపూరితం కాదు. కేవలం 10శాతం పాములు మాత్రమే విషపూరితమైనవి. పాము కరిచిన వ్యక్తులు ఎడ్వటం, అటుఇటు పరుగెత్తుతూ భయాందోళనకు గురికావొద్దు. ధైర్యంగా ఉండాలి. నాటు వైద్యం కోసం ప్రయత్నం చేయకుండా వెంటనే పీహెచ్‌సీకి తరలించాలి. పాము ఎక్కువగా చేతులు, కాళ్లకు కాటు వేస్తుంది. ఒకవేళ ముఖం మీద కనుక కాటువేస్తే ప్రమాదం. రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మోకాళ్ల వరకు బూట్లు తొడుక్కోవాలి. చేతిలో కర్ర ఉంచుకోవాలి. అన్ని పీహెచ్‌సీల్లో పాముకాటుకు యాంటీ స్నేక్ వినమ్ అందుబాటులో ఉంది. ఒకవేళ బ్లీడింగ్, క్లాటింగ్ టైం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే త్వరగా జిల్లా ఏరియా ఆస్పత్రులకు వెంటిలేటర్ సౌకర్యం కలిగి ఉన్న దగ్గరకు పంపాలి.
విషపాములను గుర్తించండిలా..
విషపూరిత, విషరహిత పాములను గుర్తించడం కొంచెం కష్టమైన పనే… ముందుగా తోకను పరిశీలించాలి. తోక ఉభయ పార్శాలు నొక్కబడి తెట్టు లాగా ఉంటే విషసర్పంగా గుర్తించవచ్చు. తోక పొడవుగా ఉదరతలంలో సన్నని, చిన్న పొలుసులు ఉంటే అవి విషరహిత సర్పాలు. ఉదరతలంలోని పొలుసులు అడ్డంగా పెద్దవిగా ఉంటే అవి విషరహితం లేదా విష సర్పాలు కావచ్చు. తోక గుండ్రంగా ఉండి పోనుపోను సన్నగా ఉదరతలంలో పొలుసులు ఒక చివరి నుంచి రెండో చివరకు వ్యాపించినప్పుడు తలమీద పొలుసులను లేదా ఫలకాలను పరిశీలించాలి. తల త్రిభుజాకారంలో ఉండి చిన్న చిన్న పొలుసులతో కప్పబడి ఉండిన వాటిని పొడ పాము లేదా రక్తపింజరగా గుర్తించవచ్చు. ఇవి రెండు రకాలు. ఒకటి గుంత ఉన్న పొడ పాము. రెండు గుంత లేని పొడపాము. తలపైన చిన్న పొలుసులు ఉండి గుంత లేకపోతే అథోపుచ్చయ పొలుసులను పరిశీలించాలి. అథోపుచ్చయ పొలుసులు ఒక వరుసలో ఉండి దాని తలపైన బాణం గుర్తు ఉండిన దాన్ని విషసర్పంగా గుర్తించవచ్చు.
అందుబాటులో వ్యాక్సిన్
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సీజన్‌కు ముందుగానే స్టాక్ తెప్పించుకొని ఉంచాం. భయం లేకుండా వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అనుమానాలు ఉండకూడదు. పాములు ప్రమాదమే అందుకే అన్ని ప్రదేశాలను మనం గమనించి జాగ్రత్తపడాలి. వర్షాకాలం అవి ఆహారం కోసం పొలంగట్ల వద్ద, అపరిశుభ్ర ప్రదేశాల్లో తిరుగుతుంటాయి. కోళ్లు నివశించే ప్రదేశాల్లోకి పాములు వస్తాయి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.
– డాక్టర్ దయానందస్వామి. డీఎంహెచ్‌వో
పాములు హాని చేయవు
పాములు కావాలని ఎవరికీ హాని చేయవు. వాటికి చాలా భయం. మనం తెలియక వాటిపై కాలు వేసినప్పుడు తప్ప అవి కాటు వేయవు. పాములు ఎక్కడ కనబడినా నాకు ఫోన్ చేస్తే వాటిని పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలి వేస్తాను. వాటిని చంపకూడదు. పాము కాటు వేసినప్పుడు మనం భయం లేకుండా ఉంటే మందులతో మృత్యువు నుంచి బయటపడొచ్చు. అన్నిచోట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
– సంతోష్, ప్రాణధార రెస్య్యూ టీం