e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home ఖమ్మం దళిత కాలనీల్లో సందడి

దళిత కాలనీల్లో సందడి

  • సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు సమకూర్చుకునే పనిలో బిజీబిజీ
  • ఎస్సీలు కోరిన యూనిట్లు అందించే పనిలో యంత్రాంగం
  • దిశానిర్దేశం చేయనున్న గ్రామ, మండల కమిటీలు
  • దళితబంధు ప్రత్యేక అధికారిగా గ్రామానికో జిల్లా ఆఫీసర్‌

చింతకాని, సెప్టెంబర్‌ 19: చింతకాని మండలంలోని దళిత కాలనీల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉపాధి కోసం ఎప్పుడో వలస పోయిన కుటుంబాలు దళితబంధు కోసం ఇప్పటికే స్వగ్రామాలకు చేరుకుంటున్నాయి. దళితబంధుకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అధికారులు కూడా లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తున్న యూనిట్లను అందించేందుకు పరిశీలన చేస్తున్నారు. గ్రామానికి ఒక జిల్లాస్థాయి అధికారిగా నియమించనున్నారు. మండలానికి, గ్రామాలకు కమిటీలను నియమించనున్నారు. లబ్ధిదారులు ఏయే యూనిట్లు నెలకొల్పాలనే అంశంపై ఈ కమిటీలు దిశానిర్దేశం చేయనున్నాయి.

ప్రాథమిక ప్రక్రియ మొదలు..
నెలాఖరులోగా జిల్లా కలెక్టర్‌ ఖాతాలో పథకం నిధులు జమ అయ్యే అవకాశం ఉన్నందున ఈ లోపు ప్రాథమిక పక్రియను పూర్తి చేయాలని మండలాధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13న సీఎం కేసీఆర్‌ సారథ్యంలో హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్ష అనంతరం పథకం కోసం జిల్లా, మండల స్థాయిలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ చింతకాని మండలంలో పలు గ్రామాల్లోని దళితవాడల్లో పర్యటించారు. త్వరలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌, ఇతర మంత్రులు సైతం చింతకాని మండలంలోని దళితవాడల్లో పర్యటించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ఇప్పటికే నిత్యం రోజుకో గ్రామంలో పర్యటిస్తున్నారు.

- Advertisement -

వచ్చే వారంలో కమిటీల ఏర్పాటు..
బస్వాపురం మినహా మిగిలిన 25 గ్రామాల్లో ఒక్కో గ్రామానికి ఒక జిల్లా స్థాయి అధికారిని దళితబంధు ప్రత్యేక అధికారిగా వచ్చే వారంలో నియమించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకు కమిటీలను నియమించనున్నారు. మండలానికి కూడా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. గ్రామ కమిటీలో ఆరుగురు, మండల కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది మహిళలు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. అన్ని కమిటీల్లో అందరూ దళితులే ఉంటారు. లబ్ధిదారులు నెలకొల్పాలనుకునే వివిధ రకాల యూనిట్లపై ఈ కమిటీలు అవగాహన కల్పించనున్నాయి. ఒకే యూనిట్‌పై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తే వారిని ఇతర యూనిట్ల వైపు మళ్లించేలా దిశానిర్దేశం చేయనున్నాయి.

ఎక్కువగా ఆసక్తి కనబరిచే యూనిట్లు..
డెయిరీ ఫాం, పౌల్ట్రీ, ఆటోలు, ట్రాక్టర్లు, ట్యాక్సీలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, వ్యవసాయ భూమి కలిగిన వారు పందిరి కూరగాయాల సాగు, వరినాటు యంత్రాలు, యంత్ర పరికరాల తయారీ యూనిట్లు, ఇటుకల తయారీ కేంద్రాలు, సరుకు రవాణా వాహనాలు, ఎరువులు, ఫెర్టిలైజర్‌ దుకాణాలు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, మెడికల్‌ షాపులు, బార్లు, వివిధ మిల్లులు, ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలు, సెంట్రింగ్‌, కాంక్రీట్‌ మిశ్రమం తయారీ యంత్రాలు, మార్బుల్‌, టైల్స్‌ వ్యాపారం, హోటల్‌, ఐరన్‌ దుకాణం, మినీ సూపర్‌బజార్‌, ఫొటో స్టూడియో, బిల్డింగ్‌ నిర్మాణ సామగ్రి దుకాణాలు వంటివి నెలకొల్పేందుకు మండలంలోని దళిత యువకులు, మహిళలు అత్యధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు. చింతకాని మండలం ఖమ్మం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉండడంతో తమ యూనిట్లను సొంత గ్రామంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. దళితుల వద్ద ఉన్న నైపుణ్యంతో వారు ఏ వ్యాపారం చేయాలనే వివరాలను అధికారులు సూచిస్తారని ఓ మండలాధికారి తెలిపారు.

ప్రాథమికంగా ఉండాల్సిన ధ్రువపత్రాలు..
ఇప్పటి వరకు తమ వద్ద లేని పలు ధ్రువపత్రాల కోసం మండలంలోని దళితులు సమీప మీసేవ కేంద్రాలకు వెళ్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రం, చిరునామా, రేషన్‌, ఆధార్‌, ఓటర్‌ ఐడీ కార్డులు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ఫోన్‌ నంబర్‌, బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌ వంటివి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్‌కార్డు లేని కుటుంబాలు ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు.

మౌలిక వసతుల కల్పనకు రూ.30 కోట్లు
మండల వ్యాప్తంగా దళిత కాలనీల్లో మౌలిక వసతుల కోసం సీఎం కేసీఆర్‌ ఇప్పటికే రూ.30 కోట్లు కేటాయించారు. వాటితో 26 గ్రామాల్లో దళిత కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నారు. సాగు, తాగునీటి బోర్లు ఏర్పాటు చేయనున్నారు. కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను కూడా
నిర్మించనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement