e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home ఖమ్మం తేనె ఆదాయం పట్టు

తేనె ఆదాయం పట్టు

  • సాధారణ పంటల మధ్య యూనిట్‌ ఏర్పాటు సాధ్యమే..
  • రైతులు అదనపు ఆదాయం పొందేందుకు చేయూత
  • ప్రభుత్వం నుంచి 30శాతం రాయితీలు
  • గరిమెళ్లపాడు జిల్లా నర్సరీలో వారం రోజుల పాటు శిక్షణ

చుంచుపల్లి, సెప్టెంబర్‌ 24: ఉద్యాన పంటలు, నూనె గింజలు, అపరాలు, కూరగాయలు సాగు చేస్తున్న రైతులు అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తేనెపట్టు తయారీ కేంద్రాల ఏర్పాటుపై రైతులకు శిక్షణ ఇచ్చి యూనిట్లు నెలకొల్పేందుకు దోహదం చేస్తున్నది. దీనిలో భాగంగా ఇటీవల కొత్తగూడెం జిల్లాకేంద్రం సమీపంలోని గరిమెళ్లపాడులోని జిల్లా ఉద్యాన నర్సరీలో వారం రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించింది. కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన నిపుణులు ఆసక్తి ఉన్న రైతులు, యువకులకు తేనెపట్టు తయారీపై శిక్షణ ఇచ్చారు. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ ఆర్‌.ఉమారెడ్డి శిక్షణ ఇచ్చారు. ఏపీలోని ఏలూరు గిరిజన వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు లైవ్‌ డెమో (తేనె పెట్టలు, ఈగల ప్రదర్శన) ద్వారా తేనెపట్టు పెంపకంపై అవగాహన కల్పించారు. మార్కెట్‌లో తేనె, వాటి ఉప ఉత్పత్తులకు డిమాండ్‌ను వివరించారు. ప్రభుత్వం తేనెపట్టు పెంపకంపై 30 శాతం రాయితీలు ఇస్తున్నదన్నారు.

యాజమాన్య పద్ధతులు ఇవీ..
వేసవిలో తేనెపట్టును నీడ బాగా ఆవరించి ఉన్న ప్రదేశంలో ఉంచాలి. తడి గోనెపట్టాను తేనెపట్టుపై మూతలా ఉంచాలి. మధ్యాహ్నం తేనెపెట్టె చుట్టూ చల్లి, ఆ ప్రదేశం చుట్టూ చల్లని వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పుప్పొడి, పువ్వులు లేని కాలంలో చక్కెర ద్రావణం ద్వారా పట్టును బతికించుకోవాలి. వర్షాకాలంలో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, జీడిమామిడి, అరటి, దానిమ్మ, పుచ్చ, రేగు, చింత, జామ, ఉసిరి, నేరెడు, వెలగ, కుంకుడు, మునగ, కొబ్బరి, దోస, గుమ్మడి, బీర, పొట్ల, కాకర, వంగ, మిరప, టమాటా కూరగాయలు, ధనియాలు, ఉల్లి సుగంధ ద్రవ్యాలు, పొద్దు తిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదం, పెసర, మినుము, కంది, బఠాణి, ఉలవ, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర, కలుపు మొక్కలు సమీపంలో ఉంటే తేనెపట్టు యూనిట్‌కు ప్రయోజనం. తేనెటీగలు మొక్కలు, వృక్ష జాతుల పుష్పాలలో దొరికే పుప్పొడి, మకరందాన్ని ఆహారంగా తీసుకొని తేనె తయారు చేస్తాయి. పుట్టు తేనె పట్టు నుంచి సంవత్సరానికి 5-6 కిలోల తేనె వస్తుంది. ఐరోపా తేనె పట్టు నుంచి 15- 20 కిలోల తేనె లభిస్తుంది. తేనెపట్టు పెంచే ప్రాంతాల్లో 37 సెల్సియస్‌ డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి.

- Advertisement -

ఏడాదికి రూ.4 లక్షలకు పైగా ఆదాయం
ఒక్కో యూనిట్‌(కాలనీ)కి రూ. 60 వేల నుంచి రూ.80 వేలు ఖర్చు అవుతుంది. యూనిట్‌ ఏర్పాటు చేసే రైతులు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందేందుకు పరిశ్రమల శాఖ, ఖాదీ బోర్డులకు దరఖాస్తు చేసుకోవాలి. అప్రూవల్‌ అయితే ప్రభుత్వం పెట్టుబడిలో 30శాతాన్ని భరిస్తుంది. ఒక్క యూనిట్‌ను పది బాక్సులుగా పరిగణిస్తారు. ఒక్కో బాక్సులో 5 నుంచి 10 ట్రేలను ఏర్పాటు చేసుకోవచ్చు. ట్రేలను పెంచుకునే కొద్దీ ఖర్చు ఎక్కువ అవుతుంది. తేనెతో పాటు ఉప ఉత్పత్తులతో కలిపి మొత్తం ఏడాదికి ఒక్కో యూనిట్‌కు రూ.4 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఈ ఉప ఉత్పత్తులు, తేనెను గిరిజన వికాస స్వచ్ఛంద సేవా సంస్థతో పాటు ఇతర సంస్థలు కొనుగోలు చేస్తాయి. దీంతో మార్కెటింగ్‌కూ పెద్ద ఇబ్బందులు ఉండవు.

తేనెటీగల్లో జాతులు ఇవీ..
తేనెటీగల్లో ముఖ్యంగా నాలుగు జాతులు ఉన్నాయి. ‘కొండ తేనెటీగలు – ఎఫిస్‌ డార్సెటా, చిన్న విసనకర్ర తేనెటీగలు – ఎఫిస్‌ ఫ్లోరియా, పుట్ట తేనె తీగలు – ఎఫిస్‌ సెరినా ఇండికా, ఐరోపా తేనెటీగలు – ఎఫిస్‌ మెల్లిపెరా’ తేనెటీగలు గుంపులుగా జీవిస్తాయి. ప్రతి తేనెపట్టులో ఒక రాణి ఈగ, కొన్ని వందల పోతు టీగలు, కొన్ని వేల కూలీ ఈగలు కలిసి జీవిస్తాయి.

రాణి ఈగ : ఇది సంపూర్ణంగా వృద్ధిచెందిన ఆడ ఈగ. జీవిత కాలంలో ఒకసారి మాత్రమే పోతు టీగతో సంపర్కం జరుపుతుంది. రాణి ఈగ ముఖ్య కర్తవ్యం గుడ్లను పెట్టడం, పట్టు అభివృద్ధిలో కీలకపాత్ర వహించడం.

పోతు టీగలు : రాణి ఈగతో సంపర్కం, పట్టు ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం. పోతు టీగలు రాణి ఈగతో సంపర్కం తర్వాత చనిపోతాయి. వీటి జీవిత కాలం 2- 3 నెలలు.

కూలీ ఈగలు : ఇవి సంపూర్ణంగా ఎదగని ఆడ ఈగలు. పునరుత్పత్తి తప్ప తేనె పట్టులోని పనులన్నీ ఇవే చేస్తాయి. ఇవి ఆరు వారాలు జీవిస్తాయి.

సొంతంగా కేంద్రం ఏర్పాటు చేస్తా..
శిక్షణలో తేనెపట్టు యాజమాన్య పద్ధతులను తెలుసుకున్నా. సొంతంగా యూనిట్‌ సిద్ధం చేసుకోవడానికి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నా. మాకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఉత్తమ శిక్షణ అందింది. ఈ అనుభవంతో సొంతంగా తేనె తయారీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నా.

  • సాయిభరత్‌, పాల్వంచ

మెళకువలు తెలుసుకున్నా..
తేనెపట్టు పెంపకంలో ప్రతికూల పరిస్థితులు అధిగమించడంపై మెళకువలు నేర్చుకున్నా. వీటి పెంపకం లాభసాటి అని అర్థమైంది. పట్టు తేనె, చిన్న తేనె అనే రకాలు, వాటి ఉప ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ గురించి తెలుసుకున్నాం. మార్కెటింగ్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తేనెపట్టు పెంపకంపై 30 శాతం రాయితీలు ఇస్తున్నది.
-నర్సింహారెడ్డి, బంగారుజాల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement