e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home ఖమ్మం టీచర్లకు పాఠాలు

టీచర్లకు పాఠాలు

ఖమ్మం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 1: ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు పాఠాలు బోధించనున్నారు. సాంకేతిక నైపుణ్యం, కరోనా విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలను నడిపించడానికి కావాల్సిన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యం మెరుగు పరుచుకునేలా, బోధనలో మెళకువలు పాటించేలా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్ల బోధనా పద్ధతులకు పదును పెట్టడం ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందని విద్యాశాఖ భావిస్తోంది. తద్వారా విద్యార్థులు మరింత ప్రభావవంతంగా విషయాలను అర్థం చేసుకుంటారని, అంత సులువుగా మర్చిపోలేరని భావిస్తోంది. దీని ఫలితంగా అన్ని తరగతుల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని, సర్కారు బడులపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలతో నమ్మకం పెరుగనుంది. ఈ క్రమంలోనే టీచర్ల శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టింది. నిష్టా (నేషనల్‌ ఇన్షియేటివ్‌ ఫర్‌ స్కూల్‌ హెడ్స్‌ అండ్‌ టీచర్స్‌ హాలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1న ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం ఐదు నెలల పాటు ఆన్‌లైన్‌లో జరుగనుంది.

ఐదు నెలల పాటు నిర్వహణ..
జిల్లాలో ప్రాథమికోన్నత, ఉన్నత, ఎయిడెడ్‌, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, టీఆర్‌ఈఐఎస్‌ సహా అన్ని రకాల ఆశ్రమ, సాంఘిక, మైనారిటీ సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) అన్ని సబ్జెక్టులు, లాంగ్వేజ్‌ పండిట్లు, సీఆర్టీలు, పీజీటీలు, టీజీటీలు, పీఈటీలు, పీడీలు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం)కు ఆన్‌లైన్‌ శిక్షణను ఐదు నెలల పాటు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతులకు ఆటంకం కలుగకుండా ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించేలా షెడ్యూల్‌ రూపొందించారు.

- Advertisement -

రిజిస్ట్రేషన్‌ ఇలా..
నిష్ట శిక్షణ పొందేందుకు తొలుత అధికారిక వెబ్‌సైట్‌ www.diksha.gov.in/telangana సైట్‌లో లాగ్‌ ఇన్‌ కావాలి. గూగుల్‌ ప్లే స్లోర్‌లో దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రిజిస్టర్‌ చేసుకోవాలి. హోం పేజీలో సైన్‌ ఇన్‌ పై క్లిక్‌ చేయగానే రిజిస్ట్రేషన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. డోన్ట్‌ హ్యవ్‌ యాన్‌ అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ఉపాధ్యాయుల వివరాలను నమోదు చేయాలి. మొబైల్‌ నెంబర్‌ నమోదు చేయగానే ఓటీపీ జనరేట్‌ అవుతుంది. ఓటీపీ ఎంటర్‌ చేశాక యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ కన్ఫర్మ్‌ అవుతుంది. లాగిన్‌ అయ్యాక సెలక్ట్‌ యూవర్‌ రోల్‌ పై క్లిక్‌ చేస్తే ఆప్షన్లు కనిపిస్తాయి. టీచర్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసి రాష్ర్టాన్ని, జిల్లాను నమోదు చేయాలి.

మెళుకువలే ప్రధాన అంశాలు..
పాఠ్యాంశాల బోధనా విధానం, సాంకేతిక నైపుణ్యం, కరోనా విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలను నడిపించడానికి కావాల్సిన నైపుణ్యాలు, మెళకువలను పీడీఎఫ్‌లు, వీడియోల ద్వారా నేర్పిస్తారు. పాఠ్య ప్రణాళికను రూపొందించడం, వాటిని సకాలంలో అమలుచేయడం, నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో ఏటా పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నల సరళిని పరిచయం చేయనున్నారు. విద్యార్థులకు ప్రాజెక్టులు అప్పగించి వారితో స్వయంగా చేయిస్తారు. ప్రయోగశాల నిర్వహణ తీరును వివరిస్తారు. అలాగే విద్యావిధానంలో చోటుచేసుకుంటున్న మార్పుల్లో భాగంగా గణితంలో నూతన పోకడల గురించి వివరిస్తారు. సాంఘిక, సమకాలిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. సబ్జెక్టులను అర్థవంతంగా బోధించే స్థాయిలో ఈ శిక్షణ ఉండనుంది.

ఉత్తీర్ణత సాధిస్తే డిజిటల్‌ సర్టిఫికెట్‌..
13 మాడ్యూల్స్‌తో ఆగస్టు 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు ఎన్‌సీఈఆర్‌టీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రతి నెలా వారి కోర్సులో మూడు జనరల్‌ మోడళ్లను వెబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. టీచర్లు వాటిని ఎంపిక చేసుకొని పీడీఎఫ్‌లు, వీడియోలు చూసి ప్రతి నెలలో అడిగే క్విజ్‌లో 20 ప్రశ్నలకు సమాధానాలు చేసి 70 శాతం ఫలితాల్ని పొందాలి. క్విజ్‌లో 70 శాతం ఫలితాలు సాధించేందుకు మూడు అవకాశాలు ఇస్తారు. ఈ మూడు ప్రయత్నాల్లోనూ ఫలితం రానివారికి నెల కోర్సు పూర్తి చేసినట్లుగా సర్టిఫికెట్‌ రాదు. ప్రతి నెలా కోర్సు పూర్తి కాగానే అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను ప్రొఫైల్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 15 రోజుల్లో డిజిటల్‌ సర్టిఫికెట్‌ వస్తుంది. ప్రతి నెలా వారి కోర్సును పూర్తి చేసి.. ఆ కోర్సును అదే నెలలో పూర్తి చేయాలి. వేరే నెలలో పూర్తి చేయడానికి అవకాశం లేదు. కోర్సు పూర్తి చేసిన వారు నిష్ట 2.0 డిజిటల్‌ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana