e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home ఖమ్మం ఎలమంద మురువంగ

ఎలమంద మురువంగ

  • మలి విడత జీవాల పంపిణీకి రంగం సిద్ధం
  • ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు,ఒక గొర్రెపోతు
  • కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాంగం
  • పారదర్శత కోసం ప్రత్యేక యాప్‌
  • హర్షం వ్యక్తం చేస్తున్న గొల్ల, కురుమలు

– ఖమ్మం, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):గొల్ల, కురుములకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు అందించారు. వారిని ఆదుకోవడానికి రాయితీపై రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. అనతి కాలంలోనే పంపిణీ జిల్లాలో ప్రారంభం కానున్నది. అర్హులైన 18 ఏళ్లు నిండిన ప్రతి గొల్ల, కురుమలకు త్వరలో యూనిట్లు అందనున్నాయి. జిల్లాలోని 330 సొసైటీల పరిధిలో 31,764 మంది పెంపకందారులు ఉన్నారు. మొదటి విడతలో 15,730 మంది లబ్ధిదారులకు సబ్సిడీ ధరకు 3.22 లక్షల జీవాలు అందాయి. మరో 314 మంది యూనిట్లు అందాల్సి ఉన్నది. ఎంపికైన లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు తీసి సబ్సిడీ గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు. రెండో విడతకు అధికారులు 16,180 మందిని ఎంపిక చేశారు. గతంలో యునిట్‌ విలువ రూ 1.25 లక్షలు ఉండగా రోజురోజు పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని యూనిట్‌ విలువను రూ.1.75 లక్షలకు పెంచింది. పెంచిన యూనిట్‌ ధర ప్రకారం 75శాతం రాయితీ పోను లబ్ధిదారులు మిగతా డబ్బును ఇప్పటికే డీడీ తీశారు. వీరికి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన నాణ్యమైన గొర్రెలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పారదర్శకత కోసం ప్రత్యేక యాప్‌..
రెండో విడత గొర్రెల పంపిణీని పారదర్శంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఈ యాప్‌లో గొర్రెల పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలు నిక్షిప్తమవుతాయి. పంపిణీ చేసిన లోకేషన్‌తో పాటు గొర్రెల ఫొటో ఫీచర్స్‌ తదితర వివరాలన్నీ దీనిలో ఉంటాయి. గొర్రెలు కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి వాటి రవాణా, లబ్ధిదారుడికి అందజేసే ప్రక్రియ వరకు ప్రతి సమాచారం యాప్‌లో నమోదు కానుంది. లైవ్‌లో ఉన్న ఫొటోలనే యాప్‌ స్వీకరించడం విశేషం.

- Advertisement -

వెల్లివిరిసిన ఆనందం..
సీఎం కేసీఆర్‌ గొర్రెల పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో గొల్ల, కురుమ కుటుంబాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. లబ్ధిదారులకు యూనిట్ల వారీగా లబ్ధి చేకూరనుంది. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక గొర్రెపోతు ఉంటుంది. జిల్లాలో తొలి విడతలో సుమారు 3,22 లక్షల జీవాలు గొల్ల కురుమలకు అందాయి. వాటి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ప్రభుత్వం ఉచిత బీమా సౌకర్యమూ కల్పించడంతో పెంపకందారులకు భరోసా లభిస్తున్నది. జీవాలకు అవసరమైన దాణాను 75శాతం రాయితీపై ఇస్తుండడంతో పోషణకు ఇబ్బంది లేదు.

జీవాల ఆరోగ్య భద్రతకు సంచార వైద్యశాలలు
ప్రభుత్వం పెంపకందారులకు రాయితీపై గొర్రెలు అందివ్వడమేకాక వాటి ఆరోగ్య సంరక్షణపైనా శ్రద్ధ వహిస్తున్నది. జీవాలకు వైద్యం అందించేందుకు సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేసింది. 108 తరహాలోనే ‘1962’ (టోల్‌ఫ్రీ నెంబర్‌) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున సేవలు అందిస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులకు 1962 ద్వారా జీవాలకు వైద్యం అందుతున్నది. గొర్రెల పెంపకందారులకు పైసా ఖర్చు లేకుండా ఈ సేవలు అందుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ చేసిన మేలు మరువం..
ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల, కురుమలను నాటి పాలకులు ఓటు బ్యాంకుగానే చూశారు. పెంపకందారులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనే లేదు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆలోచించి మా కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చారు. ఒక్కటికాదు రెండు కాదు ఏకంగా 75శాతం రాయితీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. ఆయన చేస్తున్న మేలు ఎప్పటికీ మరచిపోలేం. వలస బాట పట్టాల్సిన పరిస్థితులు ఉన్న ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారు. రాయితీ గొర్రెలు పొందిన వారంతా ఇప్పుడు సొంతూరిలోనే దర్జాగా బతుకుతున్నారు.-మేకల మల్లిబాబు యాదవ్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లా పెంపకందారుల సంఘం అధ్యక్షుడు

పూర్వవైభవం వచ్చింది..
గొర్రెలు కాస్తూ జీవనం సాగించే గొల్ల, కురుముల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. రాయితీపై అందిన యూనిట్లను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో గొర్రెల పెంపకానికి పూర్వవైభవం వచ్చినట్లయింది. జీవాలకు ఆరోగ్య సమస్యలు వస్తే సంచార వైద్యశాలల ద్వారా వాటికి వైద్య సేవలు అందుతున్నాయి.
-డాక్టర్‌ అనంతుల హరీశ్‌, పశువైద్యుడు,పశువైద్యల సంఘం జిల్లా అధ్యక్షుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana