e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఖమ్మం ఉపాధికి బాసట

ఉపాధికి బాసట

  • ఖమ్మం జిల్లాకు తలమానికంగా గ్రానైట్‌ పరిశ్రమలు
  • భద్రాద్రికి వన్నెతెస్తున్న కేటీపీఎస్‌, బీటీపీఎస్‌లు
  • విస్తరిస్తున్న వివిధ పరిశ్రమలు
  • పెరుగుతున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఇల్లెందు, ఆగస్టు 3 : భద్రాద్రి, ఖమ్మం జిల్లాలు పారిశ్రామికీకరణలో దూసుకెళ్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి పథంలో పయనిస్తున్నది. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అంచుల్ని పారిశ్రామిక కారిడార్‌ చుట్టేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పరిశ్రమలు విస్తరించాయి. భద్రాద్రి జిల్లాకు కేటీపీఎస్‌, బీటీపీఎస్‌లు వన్నె తెస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

తలమానికంగా గ్రానైట్‌ పరిశ్రమలు
ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వందలాది గ్రానైట్‌ ఫ్యాక్టరీలున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి జపాన్‌, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు గ్రానైట్‌ను తరలిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశ్రమలో సుమారు 10 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నిరుద్యోగ యువత పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, రాజస్థాన్‌ నుంచి వలసొచ్చిన కార్మికులు గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు.

- Advertisement -

ఉమ్మడి పాలకుల కుట్ర
భద్రాద్రి జిల్లా ఉమ్మడి పాలకుల కుట్రలకు బలైంది. పాల్వంచ మండలంలో స్టీల్స్‌ లిమిటెడ్‌ను 1974లో నెలకొల్పారు. మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజం ఆధారంగానే ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. 1976 వరకు ఉత్పత్తి కొనసాగింది. స్టీల్స్‌ పరిశ్రమ రెండుసార్లు ఉత్తమ స్టీల్స్‌ కర్మాగారంగా అవార్డును అందుకున్నది. క్రమంగా ముడి సరుకు కొరత, ఇతరత్ర కారణాలతో పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయింది. ఉమ్మడి పాలకులు స్టీల్‌ప్లాంట్లపై కక్ష గట్టారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టిసారించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బైలడిల్లా, కర్ణాటక రాష్ట్రం ఓబులాపురం నుంచి ముడిఖనిజం తీసుకొచ్చి వైజాగ్‌స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడారు. ఫలితంగా పక్కనే ఉన్న బయ్యారం ముడి ఖనిజాన్ని క్వాలిటీ లేదనే సాకుతో పాల్వంచ స్టీల్‌ పరిశ్రమను 1994లో లాకౌట్‌ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమ మూతపడే ఉంది.

భద్రాద్రి పరిశ్రమల కారిడార్‌
భద్రాద్రి జిల్లా పరిశ్రమల కారిడార్‌గా రూపుదిద్దుకున్నది. . సీతారామ, మిషన్‌ భగీరథ, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులకు ఊతమిచ్చిన జిల్లా ఇప్పుడు పరిశ్రమలకు పుట్టినిల్లుగా మారింది. సింగరేణి సంస్థకు భద్రాద్రి జిల్లా జన్మనిచ్చింది. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి కొనసాగుతున్నది. పాల్వంచ కేటీపీఎస్‌, నవభారత్‌, మణుగూరులో భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, అశ్వాపురంలో భారజల కర్మాగారం, సారపాకలో ఐటీసీ తదితర పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌ ఫ్యాక్టరీలతోపాటు సత్తుపల్లిలో బొగ్గు వెలికితీత, మాదారంలో డోలమైట్‌ పరిశ్రమలున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 వేల మంది సంఘటిత కార్మికులు, నాలుగున్నర లక్షల మంది వరకు అసంఘటిత కార్మికులున్నారు.

నాణ్యమైన తునికాకు లభ్యం
భద్రాద్రి జ్లిలాకు బీడీ పరిశ్రమ చిరకాల కోరిక. జిల్లాలోని ఏజెన్సీలో అరుదైన తునికాకు లభిస్తున్నది. రాష్ట్రంలో మరెక్కడా దొరకని నాణ్యమైన తునికాకు భద్రాచలంలో లభించడం విశేషం. ఇక్కడ బీడీ పరిశ్రమ నెలకొల్పితే కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం కల్పించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అవకాశం ఇచ్చినా సీమాంధ్ర పాలకుల కుట్రలతో వెనక్కి పోయింది. మూడు కాంట్రాక్టు డివిజన్లు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లో తునికాకు కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు తునికాకు కార్మికులు ఆకును సేకరించి కాంట్రాక్టర్లకు విక్రయించడమే తెలుసు. పరిశ్రమ ఏర్పడితే ఆకు సేకరించడమే కాదు బీడీ చుట్టడంలోనూ కార్మికుల పాత్ర ఉండేది.

మైన్స్‌కు పూర్వవైభవం
చర్ల, గుండాల మండలాల్లో భూగర్భ గనులకు ప్రాధాన్యం ఉన్నా.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో గుండాల మండలంలో మైన్స్‌ ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు లభించలేదు. ఇటీవల సింగరేణి సంస్థ ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లో బ్లాకులను ఓపెన్‌ చేసింది. రానున్న కాలంలో సింగరేణి సంస్థ విదేశాల్లో బ్లాకులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో సుమారు 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana