e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home కరీంనగర్ మీ కండ్ల ముందే పెరిగినోన్ని..

మీ కండ్ల ముందే పెరిగినోన్ని..

  • ఒక్కసారి అవకాశం ఇవ్వండి
  • కష్టమొస్తే ఆదుకుంటా
  • ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌
  • సీతంపేట, గడ్డివానిపల్లిలో ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే సుంకెతో కలిసి విస్తృత ప్రచారం
  • గడపగడపకూ వెళ్లి ఓటు అభ్యర్థన
  • ఆదరిస్తూ అక్కున చేర్చుకుంటున్న ప్రజలు
  • ‘నువ్వే గెలుస్తవ్‌ బిడ్డా’ అంటూ దీవెనలు

‘నేను పేదింటి బిడ్డను. మీ మధ్యే.. కండ్ల ముందే పెరిగినోన్ని. మీ సాధక బాధకాలు తెలిసినోన్ని. మీ వాన్ని. ఆదరించండి.. ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటా.. గెలిచిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరిస్త’ అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మంగళవారం ఇల్లందకుంట మండలం సీతంపేట, గడ్డివానిపల్లిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి గడపగడపకూ కలియదిరిగారు. ప్రతి ఒక్కరినీ అమ్మా బాగున్నవా.. అక్కా ఏం చేస్తున్నవ్‌ అంటూ పలుకరిస్తూ.. ఓటేయాలని కోరుతూ ముందుకు కదిలారు.

ఇల్లందకుంట/ ఇల్లందకుంట రూరల్‌, సెప్టెంబర్‌ 21: ప్రజల కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని, తనకు ఓటేసి గెలిపించాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇల్లందకుంట మండలం సీతంపేట, గడ్డివానిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గెల్లుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డప్పుచప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలతో ఎదురేగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ప్రభుత్వం చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు తనను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పూరి గుడిసెలు, ఇండ్లల్లోకి వెళ్లి అమ్మ ‘ఎలా ఉన్నావ్‌.. ఏం పనిచేస్తున్నావ్‌.. తిన్నారా..? కాస్త దాహమైతుంది.. కొన్ని మంచినీళ్లు ఇస్తరా..’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు. అక్కడక్కడా ప్రజల ఇండ్లల్లో మంచినీళ్లు తాగి ముందుకుసాగారు.

- Advertisement -

నిరుపేదలందరికీ ఇండ్లు కట్టిస్తా..
‘తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి లోకంతో కలిసి ముందు వరుసలో నిలబడి లాఠీ దెబ్బలకు, కేసులకు సైతం భయపడకుండా పోరాటం చేసిన బిడ్డను. ప్రజల కష్ట, సుఖాలు తెలిసిన వాడిని. నన్ను గెలిపిస్తే మీలో ఒక్కడిగా ఉంటా. నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్‌ సహకారంతో అభివృద్ధి చేస్తా’ అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. నియోజకవర్గానికి కేటాయించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు పూర్తి కాకపోవడంతో నిరుపేదలు పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఆదరిస్తే సీఎం కేసీఆర్‌ సహకారంతో ఇప్పుడిచ్చిన ఇండ్లను పూర్తి చేయడమే కాకుండా నిరుపేదలందరికీ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని ఉద్ఘాటించారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలను చేరదీసి ఆర్థికంగా ఆదుకుంటున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో లక్షా 30వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు వివిధ కంపెనీలను నెలకొల్పి యువతకు జీవనోపాధి చూపిందని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని విమర్శించారు.

పెత్తందారు ఈటల: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
ఈటల రాజేందర్‌ ఒక పెత్తందారు అని, ఆయన ఓటమి ఖాయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. రాజేందర్‌ ఎందుకు రాజీనామా చేశారో ముందుగా ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని, ప్రజలంతా సీఎం కేసీఆర్‌ వెంట నిలువాలని కోరారు. గెల్లు శ్రీనివాస్‌ను అధిక మెజార్టీతో గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తారని చెప్పారు. ఇక్కడ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, ఎంపీపీ పావనీ వెంకటేశ్‌, సర్పంచులు మూడెత్తుల వెంకటస్వామి, చెవుల లలిత, ఎంపీటీసీ తెడ్ల ఓదెలు, ఉప సర్పంచులు సురేశ్‌, నాయకులు కుమారస్వామి, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ ఎండీ రహీం పాల్గొన్నారు.

బీజేపీకి ఓటెందుకు వేయాలి..
కేంద్రంలో గత ఏడేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది?.. ఆ పార్టీకి ఎందుకు ఓటు వెయ్యాలో చెప్పాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇల్లందకుంట మండలం సీతంపేట, గడ్డివానిపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీవి పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలని, ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ, ఉద్యోగాలను ఊడగొడుతున్నదని విమర్శించారు. ఇప్పుడు దొడ్డు వడ్లు కొనబోమంటున్నదని, దీని వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. అలాంటప్పుడు మనం బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలో ఆలోచించాలని ప్రజలను కోరారు. బీజేపీ రైతులకు అన్యాయం చేస్తుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం 24గంటల ఉచిత కరంటు, రైతుబంధు, బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని చెప్పారు. ఈ ప్రాంతం ఇన్నాళ్లూ అభివృద్ధిలో వెనుకబడి ఉందని, దానికి కారణం ఎవరో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని దళిత కుటుంబాలన్నింటికీ రూ.10లక్షలు దళితబంధు పథకం ద్వారా అందిస్తామని చెప్పారు.

చలించిన ‘గెల్లు’
సీతంపేటకు చెందిన మంతు సరోజన తన కష్టాలు చెప్పుకొంటూ బోరుమంది. తాను నిరుపేదనని, ఏ ఆధారం లేదని, మీరే ఆదుకోవాలంటూ రోదించడంతో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ చలించారు. తాను గెలిచిన తర్వాత కష్టాలన్నీ తీరుస్తానని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అటు సరోజన.. ఇటు గెల్లు ఇద్దరూ కంటతడి పెట్టిన దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ చలింపజేసింది.

నన్ను ఆదుకుంది కేసీఆరే..
మాది నిరుపేద కుటుంబం. నాకు ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లి. తల్లిదండ్రులు లేకపోవడంతో వాళ్లే ప్రాణంగా బతికిన. అందరినీ ఒక ఇంటి వారిని చేయడం కోసం పెళ్లికూడా చేసుకోలేదు. కేసీఆర్‌ సీఎం అయ్యాక నాకు ఒంటరి మహిళ పింఛన్‌ వస్తున్నది. నాకు ఇల్లు లేదు. తమ్ముడు శంకర్‌ ఇంట్లో ఉంటున్న. నాకు పింఛన్‌ ఇచ్చి ఆదుకుంది కేసీఆర్‌ సారే. సార్‌కే మద్దతిస్తా. గెల్లు శ్రీనివాస్‌ గెలవాలి.

  • మంతు సరోజన, సీతంపేట
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement