e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home కరీంనగర్ పథకాలను ఊడగొట్టెటోళ్లా..ఆత్మగౌరవం కాపాడెటోళ్లా.. మీరే ఆలోచించాలి

పథకాలను ఊడగొట్టెటోళ్లా..ఆత్మగౌరవం కాపాడెటోళ్లా.. మీరే ఆలోచించాలి

  • ధరల భారం మోపిన బీజేపీ వైపా?
  • రూ.వేల కోట్ల రుణాలిచ్చిన టీఆర్‌ఎస్‌ వైపా..?
  • బీజేపీది రద్దు విధానం.. ఆ పార్టీకి ఓటు వద్దు..
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

హుజూరాబాద్‌/ జమ్మికుంట/వీణవంక/ ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్‌, సెప్టెంబర్‌ 14 : “బీజేపీ నేత ఈటల సెంటిమెంట్‌, మొసలికన్నీరు కారుస్తున్నాడు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు గమనించాలి. ఒక వ్యక్తి ప్రయోజనం కావాలో? అందరి ప్రయోజనాలు కావాలో? ఆలోచించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. అన్నం పెట్టి ఆదుకుంటున్న ప్రభుత్వానికి మద్దతియ్యాలి అని కోరారు. మంగళవారం మొదట ఇల్లందకుంటలో రేణుకా ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.27 లక్షలతో భూమిపూజ చేశారు. అంతకు ముందు సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో సుధాకర్‌ శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల సమావేశంలో మంత్రి ప్రసంగించారు. తర్వాత జమ్మికుంటకు వెళ్లి కాటన్‌ మార్కెట్‌ యార్డులో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి హాజరై, బ్యాంకు లింకేజీ కింద రూ.10 కోట్లు, స్త్రీనిధి కింద రూ.కోటి, వడ్డీ లేని రుణాలు రూ.4కోట్ల 18లక్షలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. అనంతరం ఎంపీఆర్‌ గార్డెన్స్‌లో ‘చేనేత పారిశ్రామికులకు వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చెక్కుల పంపిణీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. శత్రంజి సంఘానికి రూ.1,16,73,940, బాలాజీ సంఘానికి రూ.32,90,109, వినాయక మ్యాక్స్‌కు రూ.18,91,601, వాసవి మ్యాక్స్‌ సంఘానికి రూ.13,49,960 యార్న్‌కు సంబంధించిన సబ్సిడీ చెక్కులు, ఇటీవల ముగ్గురు చేనేత కార్మికులు మృతి చెందగా, బాధిత కుటుంబాలకు రూ.12,500 చొప్పున చెక్కులు అందజేశారు. వీణవంక మండలం దేశాయిపల్లి పీఎస్‌కే గార్డెన్స్‌లో నాలుగు చేనేత సొసైటీలకు రూ.2 కోట్ల 81 లక్షల 29 వేల 91 విలువైన చెక్కులు అందజేశారు. చేనేత సంఘంలోకి వెళ్లి కార్మికులు చేస్తున్న పనిని పరిశీలించి, వారితో మాట్లాడారు. సాయంత్రం హుజూరాబాద్‌ పట్టణంలోని సిటీ సెంట్రల్‌ హాల్‌లో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ప్రసంగించారు.

- Advertisement -

గౌడ కులస్తుల ఉసురు తగుల్తది
గతంలో పనిచేసిన ప్రభుత్వాలైన కాంగ్రెస్‌, టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి గౌడ కులస్తుల ఉసురు తగులుతుందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో గౌడ కులస్తులను హైదరాబాద్‌లో కల్లు అమ్ముకోకుండా ఇబ్బంది పెట్టాడని, కాంగ్రెస్‌ సైతం ఎక్సైజ్‌ ఆదాయం తగ్గిపోతుందని కల్లు అమ్మనివ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టిందని గుర్తు చేశారు. కానీ, సీఎం కేసీఆర్‌ గీత కార్మికుల ప్రయోజనం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. అంతేకాకుండా, నీరా పాలసీ తెచ్చి కూల్‌ డ్రింక్స్‌ మాదిరిగానే నీరా ప్యాకెట్లను విక్రయించడం, లూనా(ద్విచక్ర వాహనం)లు అందించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. రైతుబీమా మాదిరిగా గీత, చేనేత, మత్స్యకారులకు సైతం రూ.5 లక్షల బీమా పాలసీ ప్రవేశపెడుతామని చెప్పారు.

నేతన్నలను రుణ విముక్తి చేసిన సీఎం
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేనేత కార్మికులను రుణ విముక్తులను చేశాడని, చేనేత మిత్ర, పావలా వడ్డీ, టెస్కో, ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందిస్తున్నామని వెల్లడించారు. పాత భవనాల స్థానంలో కొత్తవి కట్టుకునేందుకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఇన్ని రోజులు మీకు నేరుగా సేవ చేసే అవకాశం రాలేదని, ఇప్పుడు ఇనుప కంచె తొలిగిపోయిందన్నారు. అన్నంపెట్టి ఆదుకుంటున్న ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. బీజేపీ కార్మికుల నోటికాడి బువ్వను లాక్కుంటున్నదని, గుణపాఠం చెప్పాలన్నారు. నేతన్నల కోసం కోకాపేటలో రూ.100 కోట్ల విలువైన రెండున్నర ఎకరాల భూమి, భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ చేనేత కార్మికుల బీమా రద్దు చేస్తే.. అలాంటి పథకాన్ని మళ్లీ తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని తెలిపారు. కేంద్రం రద్దు.. అంటే మనం వద్దు వద్దు అనాలని పిలుపునిచ్చారు. వీణవంకలో అడుగగానే వారంలో 24 గంటల పని వేళల దవాఖానను ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్‌లో చేనేత కార్మికుల కూలి రేట్లు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
‘మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ రూ.3 వేల కోట్లు కేటాయించిండు. మహిళలకు ఆర్థిక భరోసానిస్తున్నడు. ఆదుకుంటున్నడు. దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలు అమలు చేస్తున్నడు. అభివృద్ధి చేసి చూపిస్తున్నడు. ఒక్క జమ్మికుంట మహిళల కోసం రూ.11కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను అందిస్తున్నం. ఇంటికి పోయే వరకు బ్యాంకు ఖాతాల్లో జమైతయి. వచ్చే మార్చిల రైతులకు వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తం. రెండు నెలల్లో 57ఏండ్ల వారికి పింఛన్‌ అందిస్తం. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడ్డం. ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అయినా కూడా ప్రజలకు బియ్యమిచ్చినం. నగదు పైసలిచ్చినం. ఆదుకునే ప్రయత్నం చేసినం. మీ నుంచి మేం ప్రేమను, అభిమానాన్ని, దీవెలను కోరుకుంటున్నం. మీకు సేవ చేసే అవకాశాన్ని మాత్రమే కోరుకుంటున్నం. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చండి. పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టండి.’ అంటూ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌, 20ఏండ్లు నడిపించిన కాంగ్రెస్‌, టీడీపీలు కనీసం నీళ్లు కూడా అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట మండలంలోని 20 మహిళా సంఘ భవనాలు మంజూరు చేయించామని, అందుకు రూ.3 కోట్లిచ్చామని తెలిపారు. ప్రతి భవనానికి రూ.15 లక్షలు ఇస్తున్నామని, వారంలోగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
‘ప్రతిపక్ష పార్టీలు ఏమైనా మాట్లాడుతాయి. వారి మాటలను నమ్మకుండా పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి’ అని మంత్రి హరీశ్‌రావు ఉద్యోగులను కోరారు. కడుపునిండా తిండి పెట్టి, చేతి నిండా పని చేయించుకోవడమే కేసీఆర్‌ ముఖ్య ఉద్దేశమని, దానికి అనుగుణంగానే పీఆర్సీలు ఇచ్చారన్నారు. కరోనాతో రాష్ర్టానికి లక్షల కోట్ల నష్టం జరిగింది. అందుకే పీఆర్సీ ప్రకటన ఆలస్యమైందని, అయినా, ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, దీనికి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ చేయాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారన్నారు. సూపర్‌ న్యూమరీ ఒక పోస్టు క్రియేట్‌ చేయడానికి టీఎన్జీవోస్‌ ఉద్యోగులకు గతంలో చెప్పులు అరిగేవని, ఇప్పుడు గంటల్లోనే జీవో విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, దీనికి చక్కటి ఉదాహరణనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, 24 గంటల కరెంటు సరఫరా చేయడమని చెప్పారు. గుజారత్‌లో మోడీ సీఎంగా ఉన్నప్పుడు నర్మద ప్రాజెక్టు ప్రారంభిస్తే 30 ఏళ్ల తర్వాత పీఎం అయినంక పూర్తయిందని విమర్శించారు. మంత్రిని ఉద్యోగులు సన్మానించారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, అరూరి రమేశ్‌, కోరుకంటి చందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, జమ్మికుంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాలకిషన్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీపీలు మమత, ముసిపట్ల రేణుక, జడ్పీటీసీలు శ్యాం, మాడ వనమాల, వైస్‌ ఎంపీపీ లత, సింగిల్‌ విండో చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, కోర్కల్‌ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ, టీఎన్టీవోఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్‌, దారం శ్రీనివాస్‌రెడ్డి, హుజూరాబాద్‌ మండలాధ్యక్షుడు సందీప్‌, ఇతర నాయకులు ముద్దసాని కశ్యప్‌రెడ్డి, సరిగొమ్ముల వెంకటేశ్‌, దేశిని కోటి, చుక్క రంజిత్‌, కాంతారెడ్డి, మహేందర్‌రెడ్డి ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాడ సాధవరెడ్డి, వీరేశలింగం, రమేశ్‌, ఎంపీటీసీలు జడల పద్మలత, విజయ్‌కుమార్‌, కందాల కొంరెల్లి, గౌడ సంఘం అధ్యక్షుడు శివకుమార్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రామస్వామి, విక్రం, వేణు, రాజబాబు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటరు
కరోనా సమయంలో చేనేత కార్మికులను సీఎం కేసీఆర్‌ ఆదుకున్నారని, ఆయనకు నేతన్నలు రుణపడి ఉంటారని మాజీ మంత్రి ఎల్‌ రమణ అన్నారు. కేంద్రం రద్దు చేసిన త్రిఫ్ట్‌ పథకాన్ని పునరుద్ధరించారని, రూ.30 కోట్లిచ్చారని తెలిపారు. వస్త్ర పరిశ్రమలో భావి తరాలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించేందుకు కేసీఆర్‌ ఎన్నో పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు.

  • ఎల్‌ రమణ, మాజీ మంత్రి

కార్మికులకు అండగున్నది
చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటున్నది. యార్న్‌ మీదున్న సబ్సిడీ వచ్చింది. నేను ఇయ్యాళ చెక్కు తీసుకున్న. కేంద్రం కొన్ని రద్దు చేసింది నిజమే. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటంది. అండగున్నది. చాల్రోజుల తర్వాత సబ్సిడీ అచ్చింది. సంతోషంగున్నది.

  • సర్వేశం, బాలాజీ చేనేత సంఘం అధ్యక్షుడు

ఏ ప్రభుత్వం ఇట్ల చేయలే..
మా సంఘానికి ఈరోజు రూ.కోటికి మీద చెక్కు అచ్చింది. మంత్రి హరీశ్‌రావు తెచ్చి ఇచ్చిండు. మా సంఘానికి ఇది ఎంతో ఉపయోగపడ్తది. ఏ ప్రభుత్వం ఇట్లా చేయలే. మా కోసం ఎన్నో చేత్తన్రు. పనిచేసే ప్రభుత్వం దిక్కే ఉండాలె. ఉంటం. మేం ఏది కోరినా, కోరక పోయినా ఇత్తన్రు. ఇంకేం కావాలె. కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటం.

  • ఉడుత రమేశ్‌, షత్రంజి సంఘం అధ్యక్షుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana