e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home కరీంనగర్ ఏ యూనిట్‌ ఎంచుకుంటరు?

ఏ యూనిట్‌ ఎంచుకుంటరు?

  • మీ భవిష్యత్‌.. మీ చేతుల్లోనే..
  • కేసీఆర్‌ ఇస్తున్నడని.. ఊరికే ఖర్చు చేయొద్దు
  • దళిత బంధు లబ్ధిదారులతో మేథావుల కమిటీ
  • జమ్మికుంటలో దళిత విశ్రాంత ఉద్యోగులతో సమావేశం
  • ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, చిన్నకొమటిపల్లిలో లబ్ధిదారులతో ముచ్చట

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 14 (నమస్తే తెలంగాణ)/జమ్మికుంట చౌరస్తా : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం లబ్ధిదారులతో మంగళవారం పలు సంస్థలతో కూడిన మేధావుల కమిటీ అధ్యయనం చేసింది. పలు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లపై లోతుగా పరిశీలించింది. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మన్‌ మల్లెపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో వచ్చిన ఈ కమిటీలో సీనియర్‌ జర్నలిస్ట్‌ కే రామచంద్రమూర్తి, బెసిక్స్‌ సంస్థ సీఈఓ, ఎండీ డీ సత్తయ్య, సామాజిక వేత్తలు, ఆర్థిక నిపుణులైన కెఎస్‌ గోపాల్‌, బాలాజీ, నవీన్‌, బీఎస్‌ గోపాల్‌, హెండ్రీతోపాటు దళిత నాయకుడు కనుమల్ల గణపతి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పుల్లూరి సంపత్‌ రావు, జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రభాకర్‌ ఉన్నారు. కమిటీ సభ్యులు మొదట జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో దళిత విశ్రాంత ఉద్యోగులతో సమావేశమై దళిత బంధు పథకానికి ఇంకా ఏవిధమైన మార్పులు తేవాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పథకం విధి విధానాలు విడుదల చేయాలని దళిత విశ్రాంత ఉద్యోగులు చేసిన సూచనలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, చిన్న కొమటిపల్లి గ్రామాల్లో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఇస్తున్న ఈ డబ్బును మీదిగా భావించి మీ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అవసరమైన వారికి శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. ఏ యూనిట్లు ఎంచుకున్నారని ప్రశ్నించారు. వారికి ఆ యూనిట్‌లో ఉన్న అనుభవం ఏమిటని అడిగారు. తొందరపడి యూనిట్లు ఎంపిక చేసుకోవద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి శిక్షణ కూడా ఇస్తామన్నారు. ఎంచుకున్న యూనిట్‌తో నెలకు ఎంత సంపాదించగలుగుతారని ప్రశ్నించారు.

విశ్రాంత ఉద్యోగులతో..
మేధావుల కమిటీ సభ్యులు ముందుగా జమ్మికుంటలో నియోజకవర్గంలోని పంచాయతీరాజ్‌, ఆరోగ్య, విద్య, ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. అయితే లబ్ధిదారులకు అవగాహన లేకుండా అందరూ ఒకే రకమైన యూనిట్లను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. దీని కోసం మల్లెపల్లి లక్ష్మయ్య పలు సూచనలు చేశారు. నియోజకవర్గ, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో దళిత్‌ కమ్యూనిటీ హెల్డర్స్‌ ఫోరం (డీఏసీఈఎఫ్‌) ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలు లబ్ధిదారులతో మమేకమై వారి కోసం పని చేయాలని సూచించారు. దళితబంధు కోసం ప్రత్యేకంగా యాప్‌ను డెవలప్‌ చేస్తున్నామని, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అనంతరం విరమణ ఉద్యోగులు మాట్లాడుతూ లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేయాలని, ఇంకా కొందరి పేర్లు నియోజకవర్గంలో నమోదుకాలేదని, వారికి మళ్లీ అవకాశం కల్పించాలని బృందాన్ని కోరారు.

- Advertisement -

గడ్డివానిపల్లిలో లబ్ధిదారులతో ముఖాముఖి
జమ్మికుంటలో సమావేశం తర్వాత మేధావుల కమిటీ సభ్యులు మధ్యాహ్నం 3.00 గంటలకు ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లికి చేరుకున్నారు. అక్కడ ఒక చెట్టు నీడలో దళితులు సమావేశమయ్యారు. కమిటీ సభ్యులు ఒక్కో లబ్ధిదారుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు కార్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేసుకుంటున్నామని కమిటీ సభ్యులకు తెలిపారు. కొందరు గ్రూపుగా ఏర్పడి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నెలకొల్పుకుంటామని చెప్పారు. ఒక ఇంటిలో మూడు యూనిట్లు వచ్చాయని, ముగ్గురం కలిసి హార్వెస్టర్‌, ట్రాక్టర్‌ కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. మినీ డెయిరీ యూనిట్‌ను నెలకొల్పుకుంటామని, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ నెలకొల్పుకుంటామని లబ్ధిదారులు చెప్పడంతో కమిటీ స భ్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో మొత్తం 48 మంది లబ్ధిదారులు ఉండగా 12 మంది ఖాతాల్లోనే డబ్బులు జమైనాయని లబ్ధిదారులు కమిటీ దృష్టికి తెచ్చారు. దీంతో మిగతా వారందరికి కూడా క్రమంగా డబ్బులు జమవుతాయని మల్లెపల్లి లక్ష్మయ్య తెలిపారు.

చిన్న కొమటిపల్లిలో..
సాయంత్రం 4.30 గంటలకు నేరుగా చిన్న కొమటిపల్లికి చేరుకున్నారు. ఇంటింటికి తిరిగి దళితుల స్థితిగతులను పరిశీలించారు. ఆ తర్వాత ఒక ఇంటి ముందు కూర్చుని లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ గ్రామంలో 52 మంది లబ్ధిదారులుండగా, వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఊళ్లో చాలా మంది ట్రాక్టర్లు కొనుగోలు చేసుకుంటామని కమిటీ సభ్యులకు తెలిపారు. గ్రామంలో 300 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉందని, ఇప్పటికే 24 ట్రాక్టర్లు ఉన్నట్లు తెలుసుకున్న కమిటీ సభ్యులు ఒక్కొక్కరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అందరూ ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు. ఈ గ్రామంలో లబ్ధిదారులు ఎంపిక చేసుకోవాల్సిన యూనిట్ల గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రభాకర్‌, బెసిక్స్‌ సంస్థ సీఈఓ సత్తయ్య లబ్ధిదారులకు చాలా సేపు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కమిటీ సభ్యుల వెంట టీఆర్‌ఎస్‌ దళిత నాయకుడు కనుమల్ల గణపతి, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సంపత్‌ రావు తదితరులు ఉన్నారు.

ఆదర్శం.. నారాయణ
గడ్డివానిపల్లిలో చెట్ల కింద సమావేశమైన సమయంలోనే ఓ ఇంటి ముందు బర్రెలు కట్టేసి ఉన్నాయి. అటుగా వెళ్లిన లక్ష్మయ్య బర్రెల యజమాని పాత నారాయణతో మా ట్లాడారు. తనకు ఇద్దరు కుమారులు ఉండ గా, పెద్ద కొడుకు ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత ఆరేళ్ల క్రితం తాను బర్రెలను కొ నుగోలు చేశానని, రోజు ఉదయం, సాయం త్రం గడ్డి పొలం నుంచి తీసుకొచ్చి వేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆరు బర్లు ఉండ గా, అందులో ఒకటి ఉదయం 4, సాయం త్రం 4 లీటర్ల పాలు ఇస్తున్నాయని, మిగతా వి సూడి బర్లు అని చెప్పాడు. నారాయణను ఆదర్శంగా తీసుకోవాలని, లబ్ధిదారులు ఇలా క్రమశిక్షణతో పని చేసుకుంటే దళిత కుటుంబాలకు లాభం చేకూరుతుందని మల్లెపల్లి లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పెట్టుకుంటా..
సీఎం కేసీఆర్‌ ఇచ్చిన డబ్బుతో మేము ఆరుగురం కలిసి హన్మకొండలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పెట్టుకుంటాం. మాలో ముగ్గురికి ఇది వరకే బార్లలో పనిచేసిన అనుభవం ఉంది. అందుకే ఈ యూనిట్‌ను ఎంచుకున్నాం. ఆరుగురం కలిస్తే రూ.60 లక్షలు అవుతున్నాయి. అందరం కలిసి కట్టుగా బార్‌ను నడుపుకుంటం. కేసీఆర్‌ సార్‌ లైసెన్స్‌ ఇప్పిస్తానని చెప్పడంతో మాకు వెంటనే ఈ ఆలోచన వచ్చింది.

  • తోకల పవన్‌, గడ్డివానిపల్లె, లబ్ధిదారుడు, ఇల్లందకుంట

ముగ్గురం రెండు యూనిట్లు తీసుకుంటం..
మా ఇంట్లో మూడు యూనిట్లు వచ్చాయి. మూడు యూనిట్ల డబ్బుతో ఒక హార్వెస్టర్‌, ఒక ట్రాక్టర్‌ కొనుగోలు చేసుకుంటం. మా ఊళ్లో హార్వెస్టర్లు లేవు. మంచి గిరాకీ ఉంటది. మిగిలిన పైసలతోని ట్రాక్టర్‌ కొనుక్కుంటం. అందరం కలిసి పనిచేసుకుంటం. బాగుపడ్తం..

  • పాత రాకేశ్‌, గడ్డివానిపల్లె, లబ్ధిదారుడు, ఇల్లందకుంట
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana