e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home కరీంనగర్ పత్తి పంటకు తెగుళ్ల బెడద

పత్తి పంటకు తెగుళ్ల బెడద

  • తొలి దశలో గుర్తించకుంటే నష్టం అధికం
  • రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
పత్తి పంటకు తెగుళ్ల బెడద

గంగాధర, జూలై 21: రెండేళ్లుగా గులాబీ రంగు పురుగు పత్తి పంటను ఆశిస్తూ రైతులకు నష్టాన్ని కలుగజేస్తున్నది. దీని నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టకుంటే నష్టం అధికంగా ఉంటుంది. గంగాధర మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గులాబీ పురుగు లక్షణాలు, యాజమాన్య పద్ధతులు, నివారణ చర్యల గురించి వివరిస్తున్నారు.

గులాబీ పురుగు లక్షణాలు
లేత పత్తి ఆకుల అడుగు భాగం, లేత కొమ్మలు, మొగ్గలు, లేత కాయలు, రక్షక పత్రాలపై తల్లి పురుగు గుంపులుగా, విడివిడిగా గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన కంటికి కనిపించని చిన్న లార్వాలు మొగ్గను తొలుచుకుని లోపలి పదార్థాలను తిని పత్తి పూలను గుడ్డిపూలుగా మారుస్తుంది. చిన్న లార్వాలు కాయలపై కనిపించనంత చిన్న రంద్రాలు చేసి లోపలికి ప్రవేశిస్తాయి. తర్వాత కాయల రంధ్రాలు పూడుకుపోయి పురుగు కాయలోనే ఉండి గింజలను తింటూ దూది రంగు, నాణ్యతను పూర్తిగా దెబ్బతీసి నష్ట పరుస్తుంది. పురుగు లార్వా దశను మొత్తం కాయలోనే గడపడంతో కాయ పగిలిన తర్వాత మాత్రమే నష్టాన్ని గుర్తించడం జరుగుతుంది. పురుగు ఆశించిన కాయలు పూర్తిగా వృద్ధి చెందక త్వరగా పక్వానికి వస్తాయి.

- Advertisement -

పంటకు నష్టం జరిగేదిలా..
గులాబీ రంగు పురుగుతో కలిగే నష్టం పైకి కనిపించదు. కాయలు పగిలిన తర్వాతనే నష్టం తెలుస్తుంది. గుడ్డు నుంచి బయటికి వచ్చిన లార్వా మొగ్గపై, కాయలపై కంటికి కనిపించనంత చిన్న రంధ్రాలను చేసి లోపలికి ప్రవేశిస్తాయి. తమ జీవిత కాలం మొత్తం కాయలోనే గడుపుతాయి. లేత మొగ్గలను ఆశించి ఎదిగే పూలలోని పదార్థాలను తినడంతో ఆకర్షణ పత్రాలు విచ్చుకోకుండా ముడుచుకునే ఉంటాయి. వీటినే గుడ్డిపూలు అంటారు. ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పూలు విచ్చుకున్నప్పటికీ లోపల అండాశయాలు, పుప్పొడిని తిని నష్టం కలుగజేస్తుంది. తొలి దశలో ఆశించినప్పుడు మొగ్గలు, పూలు రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం గానీ, కాయ పరిమాణం పెరగకపోవడం, కాయలు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డి కాయలు ఏర్పడడం జరుగుతుంది. ఈ పురుగు ఆశించిన గుడ్డిపూలు, కాయలను తెరిచి చూసినప్పుడు చిన్న, పెద్ద గులాబీ రంగు గొంగళి పురుగులు కనిపిస్తాయి.

పురుగు నివారణ ఇలా..
రెండు మూడేళ్లకోసారి విధిగా పంట మార్పిడి విధానం పాటించాలి. తక్కువ కాల పరిమితి పంట రకాలను ఎంపిక చేసుకుని సకాలంలో విత్తుకోవడంతో పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. పత్తి చేను చుట్టూ తుత్తుర బెండ, ఉమ్మెత్త లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పత్తి వేసిన 45 రోజుల నుంచి పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా బుట్టల్లో మూడురోజుల్లో 7 లేదా 8 తల్లి రెక్కల పురుగులను గమనిస్తే లేదా 10 శాతం గుడ్డిపూలను లేదా 10 శాతం పురుగు ఆశించిన కాయలను గమనిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. గులాబీ పురుగు ఆశించిన గుడ్డిపూలను మొక్కల నుంచి తొలగించాలి. ట్రైకోగ్రామ పరాన్న జీవులను ఎకరానికి 60 వేల చొప్పున పూత పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు విడుదల చేయడంతో గులాబీ పురుగు గుడ్ల దశను నివారించవచ్చు. 5 శాతం వేప గింజల కషాయం లేదా 5 మి.లీ వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. క్వినాల్‌ఫాస్‌ 2.0 మి.లీ లేదా థయోడికార్బ్‌ 1.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ లేదా క్లోరోఫైరీపాస్‌ 2.5 మి.లీ లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి. పంట కాలంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సింథటిక్‌పైరిత్రాయిడ్‌ మందులైన సైపన్‌ మెత్రిన్‌ 25 శాతం ఇ.సి 1.0 మి.లీ లేదా లామ్‌డాసైహలోత్రిన్‌ 5.0 శాతం ఇ.సి 1.0 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

సస్యరక్షణ చర్యలతో పురుగు నివారణ
సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితేనే గులాబీ రంగు పురుగును నివారించవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పురుగు ఉధృతిని గుర్తించడానికి ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. రైతులకు సందేహాలుంటే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
-రాజు, మండల వ్యవసాయాధికారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పత్తి పంటకు తెగుళ్ల బెడద
పత్తి పంటకు తెగుళ్ల బెడద
పత్తి పంటకు తెగుళ్ల బెడద

ట్రెండింగ్‌

Advertisement