e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home కరీంనగర్ కట్టుదిట్టం

కట్టుదిట్టం

కట్టుదిట్టం
  • ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కార్యకలాపాలు
  • 10 గంటల నుంచి నిర్మానుష్యం
  • ఇండ్లకే పరిమితమైన ప్రజానీకం

కరీంనగర్‌, మే 12 (నమస్తే, తెలంగాణ) : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొదటి రోజు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌన్‌ అమలు విజయవంతమైంది. కరీంనగర్‌తోపాటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉదయం 6 గంటలకే దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి. పాల దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు, చికెన్‌, మటన్‌ సెంటర్లు ఓపెన్‌ అయ్యాయి. కూరగాయల మార్కెట్లు సందడిగా మారాయి. గల్లీలతోపాటు రోడ్ల పక్కనా కూరగాయల అమ్మకాలు కొనసాగాయి. ముఖ్యంగా కరీంనగర్‌లో కూరగాయల మార్కెట్లు వందలాది మందితో నిండి పోయాయి.

సూపర్‌ బజార్లు, కిరాణా షాపులు కూడా తెరిచి ఉంచడంతో ప్రజలు నిత్యవసరాలు కొనుగోలు చేసుకున్నారు. షాపింగ్‌ మాల్స్‌ కూడా ఉదయం 6 గంటలకే తెరిచారు. గిరాకీ లేకున్నా జ్యువెల్లరీ షాపులను కూడా ఓపెన్‌ చేశారు. జిల్లాకేంద్రాలతోపాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో నాలుగు గంటలు మాత్రమే వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు కొనసాగాయి. మెడికల్‌ షాపులు, దవాఖానలు రాత్రి వరకు తెరిచే ఉన్నాయి. వాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగింది. ఉపాధి హామీ కూలీలు కూడా నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకోడం కనిపించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగింది.

పది గంటల నుంచి నిర్మానుష్యం..
ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్‌ అమలైంది. 9.30 గంటలకే పోలీసులు రంగంలోకి దిగారు. వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో తిరుగుతూ దుకాణాలు మూసివేయాలని మైకుల ద్వారా చెప్పారు. దాంతో 10 గంటలకే దుకాణాలు మూసివేశారు. నిత్యావసరాలు, ఇతర అవసరాల కోసం వచ్చిన జనాలంతా పది గంటల వరకే ఇండ్లకు చేరుకున్నారు. తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అక్కడక్కడా కనిపించిన జనాలకు పోలీసులు హెచ్చరించి పంపించారు. బస్టాండ్‌ చౌరస్తా, టవర్‌సర్కిల్‌, తెలంగాణ చౌక్‌, కోర్టు చౌరస్తా, కమాన్‌చౌరస్తా, ఎన్‌టీఆర్‌ చౌక్‌, అల్గునూర్‌ చౌరస్తా.. ఇలా ఎక్కడ చూసినా పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేసి, జనం రోడ్లపైకి రాకుండా చూశారు. ఇదే తీరున జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లా కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లోనూ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి వాహనాలు జగిత్యాల జిల్లాలోకి రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

ఉద్యోగులు గుర్తింపు కార్డులు తప్పనిసరి
పోలీసులు పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. కరీంనగర్‌లో డ్రోన్లను కూడా వినియోగిస్తూ, లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎకడైనా జనం ఉన్నట్లయితే పోలీసులు సదరు ప్రాంతానికి చేరుకుని వారిని అకడి నుంచి తరలిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ 10 గంటల అనంతరం రోడ్లపైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తూ, సదరు వాహనదారులకు సంబంధించిన గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఉద్యోగులతోపాటు అత్యవసర విభాగాలకు చెందిన వారిని గుర్తింపు కార్డులను చూసి పంపిస్తున్నారు. సింగరేణి, ఎన్టీపీసీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఐడీ కార్డులను ధరించి డ్యూటీలకు హాజరుకావాలని సూచించారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ
లాక్‌డౌన్‌ అమలు తీరును ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు పర్యవేక్షించారు. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని గోదావరిఖని గాంధీచౌక్‌లో వాహనదారులకు రామగుండం సీపీ సత్యనారాయణ సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్పీ సింధూశర్మ పర్యటించి అమలు తీరును పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడలో ఎస్పీ స్వయంగా పర్యటించి అమలుతీరుపై పర్యవేక్షించారు. తిప్పాపూర్‌ మూలవాగు వంతెన వద్ద వాహనాలను తనిఖీ చేసి, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. మంథని నుంచి కాటారం వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న ఓ ముగ్గురు మహిళలను మంథని ట్రైనీ ఎస్‌ఐ అజయ్‌ అటు వెళ్తున్న ఓ కన్‌స్ట్రక్షన్‌ వాహనంలో పంపించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ-పాస్‌ పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

బస్టాండ్లు వెలవెల..
సడలింపు సమయంలోనే కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో బస్సులను నడుపుతున్నారు. వరంగల్‌, గోదావరిఖని, జగిత్యాల రూట్లకు బస్సులను నడిపించారు. ఉదయం 6 గంటల తర్వాత కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ నుంచి వెళ్లిన బస్సులు 10 గంటలలోపు తిరిగి చేరుకున్నాయి. హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు ఉదయం వెళ్లిన బస్సులు, తిరిగి గురువారం ఉదయం చేరుకోనున్నాయి. పదిగంటల తర్వాత బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా, బస్టాండ్లన్నీ వెలవెలబోయాయి. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే కరీంనగర్‌ బస్టాండ్‌ ప్రయాణికులు లేక బోసిపోయింది. ఇటు రోడ్లపై ఆటోలు, టాక్సీలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలు తిరుగలేదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కట్టుదిట్టం

ట్రెండింగ్‌

Advertisement